సోమవారం 19 అక్టోబర్ 2020
Vikarabad - Aug 19, 2020 , 00:24:24

మూడో తరగతి నుంచే క్లాసులు..

మూడో తరగతి నుంచే క్లాసులు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ పాఠాలకు హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు  చేస్తున్నది. నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఈ ప్రక్రియ పక్కాగా ఉండేలా చూస్తున్నది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉన్న విద్యార్థుల వివరాలు అధికారులు సేకరించారు.  కాగా, 1, 2వ  తరగతుల్లోని విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించరు. మూడు నుంచి పదో తరగతి స్టూడెంట్స్‌ మాత్రం తప్పకుండా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావాల్సిందే. టెలీ పాఠాలు, లేదంటే డిజిటల్‌ బోధన చేసేందుకు టీచర్లు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే ప్రక్రియ మొదలుపెట్టనున్నారు.

పక్కాగా..పర్యవేక్షణ..

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణను విద్యాశాఖ అత్యంత కీలకంగా భావిస్తున్నది. కేవలం ఆదేశాలు జారీ చేసి వదిలిపెట్టకుండా పక్కాగా నిర్వహించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నది. ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించి, ఆయా తరగతుల్లోని విద్యార్థులంతా ఆన్‌లైన్‌ పాఠాలు వినేలా చూడాల్సిన బాధ్యతను ఆయా ఉపాధ్యాయులపైనే పెట్టబోతున్నారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. టీచర్ల పనితీరు, తరగతుల నిర్వహణను డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఐవోఎస్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను రోజువారీగా  నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

సర్వే చేసి..వివరాలు సేకరించి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో ఎంతమంది ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు వాడుతున్నారు. ? ఎంత మందికి ల్యాప్‌టాప్‌లు / కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్‌ సెట్లు, డీటీహెచ్‌, కేబుల్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ఉన్నాయి.? ఎంతమందికి లేవు.. అన్న విషయాలు తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ ఓ సర్వే నిర్వహించింది. ఇటీవల పాఠ్యపుస్తకాలు అందజేసినప్పుడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాడుతున్న ఫోన్‌ నంబర్లను టీచర్లు సేకరించారు. సర్వేలో భాగంగా పాఠశాలల వారీగా  ఉపాధ్యాయులను రంగంలోకి దించి, ఫోన్లు చేయించి విద్యార్థుల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉన్నాయో ఆయా వివరాలను నమోదు చేశారు. ఇలా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్వే చేశారు. జిల్లాలో మొత్తంగా 82,263 మంది విద్యార్థులుంటే వారిలో అత్యధిక మంది  స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్‌ సెట్లు వాడుతున్నారు. కేవలం 23 మంది మాత్రమే తాము ఎలాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు వినియోగించడం లేదని తెలిపారు. వీరికి కమ్యూనిటీహాళ్లలో టెలివిజన్‌ సెట్లను ఉపయోగించి..బోధించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్నాం..

హైదరాబాద్‌ జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి, వివరాలను పంపించాం. ఉపాధ్యాయులను సైతం సిద్ధంగా ఉండాలని సూచించాం. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు లేని విద్యార్థులకు కమ్యూనిటీ సపోర్ట్‌ తీసుకుని టెలీ పాఠాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు, మార్గదర్శకాల ఆధారంగా నడుచుకుంటాం.

- వెంకటనర్సమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి


logo