గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Aug 16, 2020 , 00:10:06

రైతును రాజు చేయడమే ధ్యేయం

రైతును రాజు చేయడమే ధ్యేయం

  • డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు 

వికారాబాద్‌: 74వ స్వాతంత్య్ర వేడుకలు శనివారం వికారాబాద్‌ జిల్లాలోని కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో నిరాడంబరంగా నిర్వహించారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ టి. పద్మారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు తప్పనిసరిగా రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రైతు బంధు, రైతు భీమా పథకాలతో పాటు ఒక్కో రైతు వేదిక భవనానికి రూ. 20 లక్షలు వెచ్చిస్తూ పంటల సాగులో నియంత్రిత సాగును సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు.

రైతులు కొత్త పద్ధతిలో పంటలు సాగు చేసి అధిక లాభాలు సాధించేందుకు రైతు వేదిక భవనాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. అదే విధంగా స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు తెలిపారు. గ్రామాలు, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో సీఎం ఉన్నారన్నారు.  రైతు ఏ పరిస్థితుల్లో మరణించినా ఆ కుటుంబానికి రూ. ఐదు లక్షల పరిహారం అందిస్తూ అండగా నిలుస్తున్నదని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మృతి చెందిన 1354 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ. 67.70 కోట్ల పరిహారం అందించిందన్నారు.  అనంతరం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో వికారాబాద్‌, పరిగి ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేశ్‌రెడ్డిల తో  కలిసి ఆయన మొక్కలు నాటారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు,  జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌,  జిల్లా ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు  పాల్గొన్నారు. 


logo