శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 15, 2020 , 01:13:18

40 పడకలతో కొవిడ్‌ కేర్‌ వార్డు

40 పడకలతో కొవిడ్‌ కేర్‌ వార్డు

  • n తాండూరు జిల్లా ప్రభుత్వ దవాఖాన,  అనంతగిరి టీబీ సెంటర్‌లో ఏర్పాటు
  • n హోంక్వారంటైన్‌ సౌకర్యం లేని వారికి 
  • టీబీ సెంటర్‌లో ఐసోలేషన్‌ వార్డు 
  • n బీపీ, షుగర్‌, టీబీ, క్యాన్సర్‌ రోగులకు 
  • ఇంటి వద్దకే మందులు
  • n అందుబాటులో 27 ర్యాపిడ్‌ యాంటిజెన్‌, 
  • 2 ఆర్‌టీపీసీఆర్‌ సెంటర్లు
  • n వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌: కొవిడ్‌ 19 కేసులకు వైద్యం అందించేందుకు తాండూరులోని జిల్లా దవాఖానలో 40 పడకలతో కూడిన కొవిడ్‌ కేర్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పౌసుమి బసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోంక్వారంటైన్‌ సదుపాయం లేని వారు, ఎలాంటి లక్షణాలు లేకుండా ఎక్కువ రిస్క్‌లేని కొవిడ్‌  బాధితులకు వికారాబాద్‌ పట్టణంలోని అనంతగిరి టీబీ సెంటర్‌లో 40 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నమోదు అవుతున్న ఐఎల్‌ఐ కేసులకు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రైవేటు దవాఖానల్లో నమోదవుతున్న వారి వివరాలు సైతం సేకరించి వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామని తెలిపారు. కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలియగానే వారి ఇంటి పక్కల 50 నుంచి 100 ఇండ్ల వరకు ఇన్‌సెంటివ్‌ శానిటేషన్‌, ఫీవర్‌ సర్వే చేపడుతామన్నారు. ప్రతి వారం మరణాల వివరాలను శుక్రవారం రోజు నమోదు చేస్తారన్నారు. జిల్లాలో  బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, టీబీ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు వారి ఇంటి వద్దకు చేరే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆమె తెలిపారు.

జిల్లాలో 27 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా 2 ఆర్‌టీపీసీఆర్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్‌  లక్షణాలతో వచ్చే ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహిస్తామన్నారు. పాజిటివ్‌ అని తేలితే జిల్లా నిఘా అధికారి ద్వారా సంబంధిత వైద్య అధికారికి కొవిడ్‌ బాధితుడి యొక్క సమాచారం అందించి బాధితుడి పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తామన్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు ఉన్న వారిని ఇంటి దగ్గరే ఉంచి ప్రతి రోజు 2 పూటలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం అవసరమైన వారికి వైద్యులు వైద్య సేవలు అందించి సలహాలు, సూచనలు ఇస్తారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ప్రతి రోజూ తెలుసుకుంటారని, హోంకేర్‌ కిట్‌ను అందిస్తారన్నారు. ఈ కిట్‌లో పల్స్‌ ఆక్సిమీటర్‌, థర్మామీటర్‌, మాస్కులు, ఫేస్‌ షీల్డ్‌, సబ్బులు, మందులు మొదలైనవి  ఉంటాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 742 కొవిడ్‌-19 కేసులు నమోదు కాగా  వికారాబాద్‌, తాండూరు పట్టణాలలోనే 70 శాతం పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. 379 మంది కొవిడ్‌  బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 26 మంది మృతి చెందినట్లు కలెక్టర్‌ పౌసుమిబసు తెలిపారు. 298 మంది హోంక్వారంటైన్‌లో ఉండగా, 39 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ చేతులను శుభ్రం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. 

జిల్లాలో 817 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు

వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌  పథకం కింద రుణాలు మంజూరు చేస్తున్నదని కలెక్టర్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌  పథకం కింద మంజూరైన రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారులు ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 5800 మంది వ్యాపారులను గుర్తించామని తెలిపారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 1623 మంది వీధి వ్యాపారులను గుర్తించగా 299 మందికి రుణాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. తాండూరు మున్సిపల్‌లో 2887 మంది వీధి వ్యాపారుల్లో 278 మందికి, పరిగిలో 912లో 113 మందికి, కొడంగల్‌ 679లో 127 మందికి  రూ.10 వేల చొప్పున అందజేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 817 మందికి రూ.81.70 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న మరో 1618 వీధి వ్యాపారులకు త్వరలో రుణాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు. రుణాల మంజూరు కోసం వ్యాపారులు తమ ఆధార్‌ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపారు. సలహాలు, సందేహాలకు మున్సిపల్‌ కార్యాలయంలోని మెప్మా అధికారులను సంప్రదించాలని సూచించారు.


logo