శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 14, 2020 , 03:18:53

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణకేతలమానికం

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణకేతలమానికం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌: తెలంగాణ స్వయం సమృద్ధి సాధన దిశగా పయనిస్తున్నదని, అందుకే  రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో మేధా సర్వో డ్రైవ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల, మెదక్‌ ఎంపీలు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రూ.30వేల కోట్లతో పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో భారత రైల్వేలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పెట్టుబడులను ఆహ్వానిస్తుందన్నారు. రానున్నకాలంలో ఇక్కడి నుంచే మెట్రో కోచ్‌లు, లోకోమోటివ్‌లు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయా.. అని కొందరు అపోహలు సృష్టించారన్నారు. తెలంగాణ బిడ్డ యుగేంధర్‌రెడ్డి 1984లో స్థాపించిన మేధా సంస్థ దినదినాభివృద్ధి చెంది నేడు రైల్వే కోచ్‌లు, లోకోమోటివ్‌లు తయారు చేసే స్థాయికి ఎదుగడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. 2005లో రూ.25 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ నేడు చాలా దేశాలకు విస్తరించడం గొప్ప విషయమన్నారు. ఆదిబట్లలో విమానాల విడి భాగాల తయారీ, ఇక్కడ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తెలంగాణలో అన్ని రకాల సంస్థలు వచ్చినట్లేనని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రోకోచ్‌లను కొరియా కంపెనీ తయారు చేసిందని, మున్ముందు ఇక్కడి నుంచే కోచ్‌లు తయారు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్‌ రైలుకు సిగ్నలింగ్‌తో పాటు అనేక రకాల పరికరాలను తయారు చేసిన సంస్థగా మేధాకు గుర్తింపు ఉందన్నారు. ఈ రైల్యే కోచ్‌ ఫ్యాక్టరీతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడుతూ మేధా అతిపెద్ద పరిశ్రమగా ఎదుగాలని ఆకాంక్షించారు. ఏడాదికి 100కోచ్‌లు, 50 లోకో(ఇంజిన్‌)లు తయారయ్యే విధంగా ఈ ఫ్యాక్టరీ ముందుకెళ్లాలన్నారు. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు వస్తే ఢిల్లీ, వారణాసి మాదిరిగా తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చునన్నారు. గంటలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రెండు గంటల్లో విజయవాడకు, నాలుగు గంటల్లో బెంగుళూరుకు చేరుకోవచ్చని తెలిపారు. టీఏస్‌ ఐ-పాస్‌ ద్వారా వస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు 50 నుంచి 60శాతం ఉద్యోగాలు ఇస్తే అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. కొండకల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 15 నుంచి 18నెలల సమయంలో మొదటి యూనిట్‌ ద్వారా మొదటి కోచ్‌ నిర్మాణం పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించుకుందామన్నారు. కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రికల్‌ వాహనాల వినియోగం పెంచేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని మేధా సంస్థను కోరారు. 106 ఎకరాల్లో కొండకల్‌, వెలిమల గ్రామాల్లో ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీ ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల, మెదక్‌ ఎంపీల నిధులతో ఇక్కడి స్థానిక నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద శిక్షణ ఇప్పించాలని సూచించారు. కొండకల్‌లో ఐలా ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు తీగల అనితారెడ్డి, మంజుశ్రీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, వైస్‌ చైర్మన్‌ వెంకటనర్సింహారెడ్డి, మేధా కంపెనీ ఎండీ కశ్యప్‌రెడ్డి, ఈడీ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్లు అమయ్‌కుమార్‌, హన్మంత్‌రావు, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మన్‌ పి. కార్తీక్‌రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక వసతుల చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, నాయకులు శుభప్రద్‌పటేల్‌, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

నాలుగేండ్లలో రూ. వెయ్యి కోట్ల ఖర్చు - అశోక్‌రెడ్డి, మేధా కంపెనీ ఈడీ

మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో వచ్చే నాలుగేండ్లలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ ఈడీ ఆశోక్‌రెడ్డి తెలిపారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇందు లో 1500 రైల్వే కోచ్‌లు, 500 లోకోమోటివ్‌లు తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ మండల నాయకుల ఘన స్వాగతం  

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలం కొంకడల్‌ గ్రామ శివారులో మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు గురువారం వచ్చిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మోకిల, కొండకల్‌తండా గ్రామ ప్రజలు, మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఆర్థికశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వచ్చారు. మోకిల క్రాస్‌రోడ్‌ నుంచి తండా మీదుగా కొండకల్‌ గ్రామం వరకు పెద్దఎత్తున నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంత్రులు మోకల క్రాస్‌రోడ్‌, కొండకల్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బీ.వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, గుడిమల్కాపూర్‌ చైర్మన్‌ డీ.వెంకట్‌రెడ్డి, డైరెక్టర్‌ శేరి అనంత్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ కే.గోపాల్‌, కొండకల్‌ సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ బీ.సురేందర్‌రెడ్డి, శంకర్‌పల్లి ఏఎంసీ చైర్మన్‌ రాజునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బీ.శశిధర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ సాత ప్రవీణ్‌కుమార్‌, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కే.రవీందర్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.


logo