బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 13, 2020 , 00:35:18

జోరుగా హ‌రిత‌హారం

జోరుగా హ‌రిత‌హారం

  • నిర్దేశించిన టార్గెట్‌లో  70 శాతం పూర్తి
  • ఇప్పటివరకు నాటిన మొక్కలు 46.31 లక్షలు
  • ఈ ఏడాది లక్ష్యం 68.71 లక్షలు
  • వారం రోజుల్లో ముగియనున్న కార్యక్రమం
  • ఇప్పటివరకు 425 ఎకరాల్లో పూర్తి
  • ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేస్తున్న యంత్రాంగం

హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వికారాబాద్‌ జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఆకుపచ్చ తెలంగాణలో భాగస్వాములవుతున్నారు. ఈ ఏడాది 68.71 మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 46.31 లక్షలను నాటారు. అటవీ శాఖ సైతం వికారాబాద్‌, పరిగి, తాండూరు, ధారూరు, కొడంగల్‌ రేంజ్‌ల పరిధిలోని 600 ఎకరాల్లో హరితహారాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు 425 ఎకరాల్లో 4.80 లక్షల మొక్కలు నాటారు. అలాగే, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేసి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. మొత్తంగా జిల్లాకు నిర్దేశించిన టార్గెట్‌లో 70శాతం పూర్తవగా, మిగతా 30 శాతాన్ని కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో నిర్దేశించిన టార్గెట్‌లో ఇప్పటికే 70 శాతం లక్ష్యాన్ని అధికారులు పూర్తి చేశారు. అయితే, జిల్లాలోని 566 నర్సరీల్లోని మొక్కలు నాటిన దృష్ట్యా మరో వారం రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని ముగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అదేవిధంగా, ఈ ఏడాది అడవులను పెంచేందుకు అటవీ ప్రాంతంలో మొక్కలను నాటడంతో పాటు 600 ఎకరాల్లో పునరుజ్జీన కార్యక్రమం కొనసాగుతుంది. జియోట్యాగింగ్‌ ద్వారా ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని  బతికాయనే వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. 

ఇప్పటివరకు 46.31 లక్షల మొక్కలు నాటడం పూర్తి...

 ఈ ఏడాది వర్షాలు సరిగ్గా సమయానికి పడడంతో  ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితో పాటు జామ, నిమ్మ, సీతాఫల్‌, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటుతున్నారు. జిల్లావ్యాప్తంగా 68.71 లక్షలను లక్ష్యంగా పెట్టుకోగా,.. ఇప్పటివరకు 46.31 లక్షలను నాటారు. ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలిస్తే,...డీఆర్‌డీఏ, డీపీవో 26.40 లక్షలు, అటవీ శాఖ 8,94,763, ఎక్సైజ్‌ శాఖ 2,01,400, విద్యాశాఖ 42,892, విద్యుత్‌ శాఖ  5,700 మొక్కలు, ఉద్యానవన శాఖ  96 వేలు, గనుల శాఖ 13,550, సంక్షేమ శాఖ 13,002, గిరిజన సంక్షేమ శాఖ 10 వేలు, నీటి పారుదల శాఖ 27,200, వ్యవసాయ శాఖ 3.44 లక్షలు, పోలీస్‌ శాఖ 56,704, పరిశ్రమల శాఖ 17,770, రోడ్లు, భవనాల శాఖ 1150, మార్కెటింగ్‌ శాఖ  3 వేలు, పౌరసరఫరాల శాఖ  6 వేలు, పశుసంవర్ధక శాఖ 20 వేలు, తాండూరు మున్సిపాలిటీ 34,280, వికారాబాద్‌ మున్సిపాలిటీ 1,23,230, కొడంగల్‌ మున్సిపాలిటీ  21,755, పరిగి మున్సిపాలిటీ 34,320 మొక్కలను ఇప్పటివరకు నాటడం పూర్తయింది.

425 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో...

వికారాబాద్‌, పరిగి, తాండూరు, ధారూరు, కొడంగల్‌ రేంజ్‌ల పరిధిలోని 600 ఎకరాల్లో మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని ఐదు రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతంతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లో ఇప్పటివరకు 425 ఎకరాల్లో 4.80 లక్షలు నాటారు. తాండూరు అటవీ శాఖ రేంజ్‌ పరిధిలో అడికిచెర్ల, జిన్‌గుర్తి, నాగులపల్లి, మైల్వార్‌, అంతారం, కల్కొడ, బంట్వారం, తట్టేపల్లి, గొట్టిగ, కొప్పన్‌కోట్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో 1.25 లక్షలు, పరిగి ఫారెస్ట్‌ రేంజ్‌లో ఇబ్రహీంపూర్‌, మిట్టాకోడూర్‌, తిర్మలాపూర్‌, పీరంపల్లి, కొత్తపల్లి, అనంతసాగర్‌, రంగంపల్లి, ఇప్పాయిపల్లి, మహ్మదాబాద్‌, నస్కల్‌ పరిధిలో 1.40, కొడంగల్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లో అప్పాయిపల్లి, బొంరాసుపేట్‌, తుంకిమెట్ల, మెట్లకుంట, దుద్యాల్‌, దౌల్తాబాద్‌, కొత్తూరు, గుండెపల్లి, రేగడిమైల్వార్‌ పరిధిలో 90 వేలు, వికారాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లో పులుమామిడి, మోత్కుపల్లి, ఎక్‌మామిడి, దుర్గంచెరువు, మున్నూరుసోమారం, బుగ్గ ఆలయం, వెల్చాల్‌, నాగసాన్‌పల్లి, తిప్పాపూర్‌, అనంతగిరి, మన్నెగూడ పరిధిలో 85 వేలు, ధారూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లో అల్లాపూర్‌, ధారూర్‌, చింతకుంట, రేగొండి, కొండాపూర్‌, నాగసముందర్‌, దోర్నాల్‌ లో 40 వేల మొక్కలను నాటారు.

70 శాతం మొక్కలు పూర్తి : డీఎఫ్‌వో

జిల్లాలో ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 70 శాతం టార్గెట్‌ పూర్తయింది.  మరో వారం రోజుల్లో హరితహారం కార్యక్రమం పూర్తి కానుంది. మరో 5 లక్షల మేర మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతాం. మరోవైపు అటవీ ప్రాంతాల్లోనూ మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 425 ఎకరాల్లో మొక్కలు నాటాం.


తాజావార్తలు


logo