మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 12, 2020 , 02:44:16

బస్తీ దవాఖానలు పేదలకు వరం

బస్తీ దవాఖానలు పేదలకు వరం

సిటీబ్యూరో/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: నగరంలో మరో 26 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 18, మేడ్చల్‌లో ఆరు, రంగారెడ్డిలో రెండు ఉన్నాయి. వీటిని ఈ నెల 14న ప్రారంభించాలని నిర్ణయించారు. వీటి ఏర్పాటుతో గ్రేటర్‌ పరిధిలో బస్తీ దవాఖానాల సంఖ్య 196కు చేరనుంది.

 రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బస్తీ దవాఖానలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్షల ప్రకారం నగరంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌ జిల్లాలో 95, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 40, సంగారెడ్డిలో 3 కలుపుకొని మొత్తం నాలుగు జిల్లాల పరిధిలో 170 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిద్వారా రోజుకు 14వేలమంది వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. 

కొత్తగా ప్రారంభిస్తున్న 26 దవాఖానలతో మరో రెండువేల మందికి వైద్య సేవలు లభిస్తాయని చెప్పారు. ఈ దవాఖానాల్లో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ఒక స్టాఫ్‌ నర్సు, ఒక అటెండర్‌ విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వీటిల్లో ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు లభిస్తాయని చెప్పారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావు సూచనలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుకు రెండు చొప్పున మొత్తం 300 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తలసాని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటి సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రస్తుత బస్తీ దవాఖానల్లో మంచినీరు, విద్యుత్‌ తదితర అంశాలకు సంబంధించిన చిన్నచిన్న సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్య, వైద్యం, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నామని వివరించారు. తనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి. రామారావు, హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, శాసనమండలి ప్రభుత్వ విప్‌  ఎంఎస్‌ ప్రభాకర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి వివరించారు. సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌తోపాటు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతితోపాటు గ్రేటర్‌లోని నాలుగు జిల్లాల వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. 

కొత్తగా దవాఖానలు ఏర్పాటు చేస్తున్న వార్డు, బస్తీ వివరాలు

సంతోష్‌నగర్‌- జవహర్‌నగర్‌, గన్‌ఫౌండ్రీ-గడిఖానా, అడిక్‌మెట్‌-పోచమ్మబస్తీ, కుర్మగూడ-మాదన్నపేట్‌, కుర్మగూడ-వికాస్‌నగర్‌, దూద్‌బౌలి-దూద్‌బౌలీ, కిషన్‌బాగ్‌-అల్లామజీద్‌, హబీబ్‌గూడ-రాంరెడ్డినగర్‌, భోలక్‌పూర్‌, రాంగోపాల్‌పేట్‌, రాంనాస్‌పురా-మోచీ కాలనీ, దూద్‌బౌలి-బండ్లగూడ, కవాడిగూడ-భీమామైదాన్‌, లంగర్‌హౌస్‌-ఇబ్రహీం బస్తీ, జియాగూడ-ఎంసీహెచ్‌ కాలనీ, ఖైరతాబాద్‌-కుమ్మరబస్తీ, సనత్‌నగర్‌-అశోక్‌నగర్‌, బన్సీలాల్‌పేట్‌-బాపూజీనగర్‌, మన్సూరాబాద్‌-వీరన్నగుట్ట, హస్తినాపురం-భూపేష్‌గుప్తానగర్‌, వెంగళరావునగర్‌- జవహర్‌నగర్‌, ఏఎస్‌రావునగర్‌-హుడాపార్క్‌, ఉప్పల్‌-శారదానగర్‌, గాజుల రామారం-గాజుల రామారం విలేజ్‌, సూరారం-శ్రీకృష్ణానగర్‌, మౌలాలి-ఎంజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌.


logo