మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 12, 2020 , 02:44:16

బిందు సేద్యానికి ప్రోత్సాహం

బిందు సేద్యానికి ప్రోత్సాహం

ఇబ్రహీంపట్నంరూరల్‌ : ఉద్యాన పంటల సాగుపై ప్రభుత్వం మరోమారు దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యానపంటల సాగును ఉపాధిహామీలో చేర్చిన ప్రభుత్వం, పంటలకు నీటి సరఫరా కోసం ఉపయోగించే డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ను మరోమారు రైతులకు అందించాలని నిర్ణయించింది. ఈసారి పండ్ల తోటలు, ఆయిల్‌ఫామ్‌, ఆగ్రో ఫారెస్టు (శ్రీగంధం)చెట్లు పెట్టే రైతులకు సబ్సిడీపై డ్రిప్పులు అందించనున్నారు. గతంలో డ్రిప్‌ యూనిట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి డ్రిప్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. రైతులకు ఎలాంటి భారం పడకుండా సబ్సిడీపై అందించనుంది. ప్రతి ఐదు హెక్టార్లు ఉన్న పెద్ద రైతులకు 80శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇవ్వకుండా 2 హెక్టార్లకు తక్కువగా ఉన్న చిన్న రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రం పూర్తి ఉచితంగా 100శాతం సబ్సిడీపై డ్రిప్‌ అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశం జిల్లాలోని పండ్లతోటలు, ఆయిల్‌ఫామ్‌, ఆగ్రోఫారెస్టు చెట్లు పెట్టే రైతులకు ఎంతో ఉపయోగపడనుందని ఉద్యానవనశాఖ అధికారులు తెలుపుతున్నారు. గతంలో డ్రిప్పు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా అవకాశం కల్పించనున్నుట్ల తెలిపారు. 

రైతులను ప్రోత్సహించేందుకే..

రాష్ట్రప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రాంతానికి అవసరమైన పంటలను పండేలా ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అందులో భాగంగానే పండ్ల తోటలతోపాటు ఆయిల్‌ఫామ్‌, శ్రీగంధం సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. రైతులకు అధిక ఆదాయం వచ్చే ఈ పంటల సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తక్కువ ఖర్చుతో ప్రభుత్వం అందించే రాయితీలతో ఈ సాగు చేయడం వల్ల అటు రైతులకు ఇటు ప్రజలకు అవసరమైన పంటలు పండనున్నాయి. మామిడితోపాటు ఇతర పండ్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరస్థితి ఉంది. కొత్తరకం వండగాలను పరిచేయం చేసి పండించాలని ఉద్యానశాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. ఆయిల్‌ఫామ్‌ తోటలను విరివిగా నాటించేందుకు ఇప్పటికే అధికారులు పర్యటనలు చేసి భూముల సారాన్ని పరీక్ష చేశారు. రైతులకు అవగాహన కల్పించేందుకు స్టడీటూర్‌లు నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రైతులు ఆయిల్‌ఫామ్‌ సాగు చేసుకునేందుకు అన్నదాతలు ముందుకొస్తుండడంతో ఆసక్తిగల రైతులను ప్రోత్సహించేందుకు డ్రిప్‌లు అందించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యానవనశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. 

దరఖాస్తు చేసుకునే విధానం..

పండ్ల తోటలు, ఆయిల్‌ఫామ్‌, శ్రీగంధం సాగు చేసే రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఫాం 1బీ, బ్యాంక్‌ ఖాతా బుక్‌, ఒక పాస్‌ ఫొటోతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలను స్థానిక ఉద్యానవన అధికారులకు అందించాలి. వారు పత్రాలను రాష్ట్రస్థాయి అధికారులకు అందజేసిన అనంతరం ప్రభుత్వ ఆదేశాల  మేరకు అవసరమైన వారికి డ్రిప్‌ సౌకర్యాన్ని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా బిందు సేద్యాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ హయాంలో పేద, మధ్యతరగతి వారికి ఎంతో లాభం చేకూరుతుండడంతో గ్రామీణ ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo