ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 11, 2020 , 00:28:18

ముసురు.. మోస్తరు

ముసురు.. మోస్తరు

  • సాధారణం కంటే అధికంగా కురుస్తున్న వర్షం
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 
  • వికారాబాద్‌లోని ప్రాజెక్టులకు జలకళ
  • రంగారెడ్డి జిల్లాలోని 18 మండలాల్లో అధిక వర్షపాతం
  • పొంగిపొర్లిన వాగులు, వంకలు,  నిండుకుండల్లా చెరువులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ న ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎడతెరపిలేకుండా చిరుజల్లులు పడ్డాయి. ప్రధానంగా తాండూరు, పెద్దేముల్‌, యాలాల, ధారూర్‌ మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా తాండూరులో 3 సెం.మీటర్ల నమోదుకాగా, అత్యల్పంగా పరిగి మండలంలో 3.6 మి.మీటర్లు నమోదైంది. ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు నిండి అలుగుపారింది. నాలుగేండ్ల తర్వాత అలుగుపారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లగా.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. 

మండలాలవారీగా వర్షపాతం..

తాండూరు మండలంలో అత్యధికంగా 36.4 మి.మీటర్లు, యాలాల 21.2 మి.మీ, పెద్దేముల్‌ 22 మి.మీ, బషీరాబాద్‌ 5.6 మి.మీ, బొంరాసుపేట్‌ 8 మి.మీ, కొడంగల్‌ 12.4 మి.మీ, దౌల్తాబాద్‌ 8 మి.మీ, మర్పల్లి 8.8 మి.మీ, మోమిన్‌పేట్‌ 15.8 మి.మీ, నవాబుపేట్‌ 10.6 మి.మీ, వికారాబాద్‌ 10.4 మి.మీ, పూడూర్‌ 8.2 మి.మీ, పరిగి 3.6 మి.మీ, కుల్కచర్ల 16 మి.మీ, దోమ 4 మి.మీ, ధారూరు 7.6 మి.మీ, బంట్వారంలో 8.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 

సమృద్ధిగా వర్షాలు..

జిల్లాలో ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. జూన్‌ నుంచి ఇప్పటివరకు సాధారణానికి మించి 30 మి.మీటర్లు అధికంగా వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 108.3 మి.మీ కాగా 149.9 మి.మీ నమోదైంది. అంటే 40 మి.మీ అధికం. జూలైలో సాధారణం 203 మి.మీ. కాగా.. 295.1 మి.మీ నమోదైంది. ఇక ఈ నెలలో ఇప్పటివరకు 35.1 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 11 మండలాల్లో సాధారణానికి మించి, 5 మండలాల్లో సాధారణం, మరో రెండు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.

రంగారెడ్డి జిల్లాలో..


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు చిరుజల్లులు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భ జలాలు పైపైకి వస్తున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 7 మండలాల్లో సాధారణం, 2 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో 91.7 మి.మీ సాధారణ వర్షపాతం కాగా.. 155.0 మి.మీ, జూలైలో 152.8 మి.మీకు 171.2 మి.మీటర్లు నమోదైంది. ఇక ఆగస్టులో 140.7 మి.మీకు ఇప్పటివరకు 48.6మీ.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని, చిరుజల్లులతో పంటలకు ఎంతో మేలు జరుగుతున్నదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 


logo