సోమవారం 28 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 09, 2020 , 00:04:30

చెక్ డ్యాంలతో సాగునిండుగా...

చెక్ డ్యాంలతో సాగునిండుగా...

  • u చకచకా చెక్‌డ్యాం నిర్మాణాలు
  • u జిల్లాలోని కాగ్నా, కాకరవేణి, మూసీ నదులతో పాటు పలు వాగులపై ఏర్పాటు
  • u రూ.62.20 కోట్లతో 18 చెక్‌డ్యాంలు.. 15 టెండర్లు పూర్తి
  • u జీవంగిలో 80 శాతం, బొంరాస్‌పేట్‌లో 30 శాతం పనులు పూర్తి
  • u భారీ వర్షాలతో నిలిచిన పనులు
  • u నవంబర్‌లో ప్రారంభించేలా నీటిపారుదల శాఖ అధికారుల కసరత్తు
  • u 2 వేల ఎకరాల ఆయకట్టుకు  సాగు నీరందించడమే లక్ష్యం

జిల్లా రైతాంగమంతా వర్షంపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురువకపోతే ఆ ఏడాది ఒక్క పంట కూడా చేతికందని పరిస్థితి ఉంటుం ది. కాగ్నా, మూసీ, కాకరవేణి నదులు, కోట్‌పల్లి, లఖ్నాపూర్‌ వంటి ప్రాజెక్టులు, చెరువులు ఉన్నప్పటికీ ఉపయో గం లేకుండాపోతున్నది. ఈ నేపథ్యంలో సాగునీటి లభ్య తను మరింత పెంచేందుకు రూ.62.20 కోట్లతో 18 చెక్‌ డ్యాంలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో పంటలకు సాగు నీరందడమే కాకుండా బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశమున్నది. జిల్లాలోని 80 శాతం మంది రైతులు రెండు పంటలు పండించుకునే వీలుంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ 


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: సాగునీటి రంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులో భాగంగానే మిషన్‌ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగు నీరందించేందుకుగాను నీటి పారుదల శాఖ అధికారులు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ ప్రజానీకం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా పత్తి, మక్కజొన్న, వరి, కంది పంటలను అధికంగా సాగు చేస్తారు. జిల్లాలోని రైతాంగమంతా వర్షంపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోతే ఆ ఏడాది ఒక పంట కూడా అంతంతా మాత్రంగానే వస్తుంది. జిల్లాలో కాగ్నా, కాకరవేణి, మూసీ, లఖ్నాపూర్‌ వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరందించాలనే ఆలోచించకపోవడం గమనార్హం. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టింది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతో పాటు వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించి, పంటలకు సాగు నీరందించడమే కాకుండా బోర్లు, బావుల్లో భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. జిల్లాలో చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే 80 శాతం మంది రైతులు ఏడాదికి రెండు పంటలు పండించే ఆస్కారం ఉంటుంది. జిల్లాలో 1126 చెరువులు, 9 ప్రాజెక్టులున్నాయి. వీటి కింద 77,580 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 2.25 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. మిషన్‌ కాకతీయలో భాగంగా 720 చెరువుల్లో రూ.250 కోట్లతో పునరుద్ధరణ పనులు పూర్తిచేశారు. 

కొనసాగుతున్న మూడు చెక్‌డ్యాంల పనులు..

జిల్లాలోని కాగ్నా, కాకరవేణి, మూసీ నదులతోపాటు లఖ్నాపూర్‌ ప్రాజెక్టు, వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజక వర్గాల్లోని ప్రధాన వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించేందుకుగాను రూ.62.20 కోట్లు అవసరమవుతున్నది. దీంతో 18 చెక్‌డ్యాంలను నిర్మించేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అయితే తాండూరు నియోజక వర్గానికి 7 చెక్‌డ్యాంలు, పరిగికి 5, కొడంగల్‌కు 2, వికారాబాద్‌కు రెండు, చేవెళ్లకు రెండు చెక్‌డ్యాంలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. అనుమతులు మంజూరైన చెక్‌డ్యాంలకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తికాగా, పలు చెక్‌డ్యాం పనులు జోరుగా జరుగుతున్నాయి. బషీరాబాద్‌ మండలం జీవంగి సమీపంలో కాగ్నా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 80 శాతం పూర్తయ్యాయి. వరద రానట్లయితే మరో 20 రోజుల్లో పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. బొంరాసుపేట్‌లోని కాకరవేణి ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 30 శాతం పూర్తికాగా, పెద్దేముల్‌ మండలంలోని మాన్‌సాన్‌పల్లిలో చెక్‌డ్యాం పనులు జరుగుతున్నాయి. టెండర్లు పూర్తైనప్పటికీ జిల్లాలో నెలరోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలతో పనులు ప్రారంభంకాలేదు. నవంబర్‌లోగా పెండింగ్‌లో ఉన్న చెక్‌డ్యాంల పనులను ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మూసీ, కాగ్నా, కాకరవేణి నదులపై చెక్‌డ్యాంలు..

కాగ్నా, మూసీ, కాకరవేణి నదులతోపాటు లక్నాపూర్‌ ప్రాజెక్టుపై నిర్మించనున్నారు. రూ.7.02 కోట్లతో తాండూరు మండలంలోని ఎల్మకన్నె సమీపంలో కాగ్నా నదిపై, చిట్టిఘనాపూర్‌ వద్ద రూ.5.60 కోట్లతో, పెద్దేముల్‌ మండలంలోని మాన్‌సాన్‌పల్లి వద్ద రూ.3.04 కోట్లతో, బషీరాబాద్‌ మండలం జీవంగి వద్ద  రూ.7.64 కోట్లతో, యాలాల మండలంలోని కోకట్‌ వద్ద రూ.8.35 కోట్లతో, బషీరాబాద్‌ మండలంలోని క్యాద్గిరా వద్ద రూ.4.91 కోట్లతో, యాలాల మండలం గోవిందరావుపేట్‌ సమీపంలోని కాకరవేణి నదిపై రూ.4.97 కోట్లతో, పరిగి మండలంలోని లఖ్నాపూర్‌ వద్ద పెద్దవాగుపై రూ.1.80 కోట్లతో, పరిగి మండలం చిగురాల్‌పల్లి వద్ద చిన్నవాగుపై రూ.1.24 కోట్లతో, కుల్కచర్ల మండలం అంతారం వద్ద పెద్దవాగుపై రూ.1.60 కోట్లతో, కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌ వద్ద పెద్దవాగుపై రూ.1.37 కోట్లతో, నవాబుపేట్‌ మండలం గంగ్యాడ వద్ద రూ.1.76 కోట్లతో, నవాబుపేట్‌ మండలం ముబారక్‌పూర్‌ సమీపంలోని మూసీ నదిపై రూ.1.58 కోట్లతో, బొంరాసుపేట్‌ వద్ద కాకరవేణి వాగుపై రూ.2.32 కోట్లతో, బొంరాసుపేట్‌ మండలం తుంకిమెట్ల వద్ద కాకరవేణి వాగుపై రూ.2.70 కోట్లతో, బొంరాసుపేట్‌ మండలం మహాంతిపూర్‌ సమీపంలోని కాకరవేణి ప్రాజెక్టుపై రూ.2.79 కోట్లతో, ధారూర్‌ మండలంలోని దోర్నాల్‌ వద్ద పెద్దవాగుపై రూ.1.37 కోట్లతో, దోర్నాల్‌ వద్ద పెద్దవాగుపై రూ.1.80 కోట్లతో చెక్‌డ్యాంలను నిర్మించతలపెట్టారు.

జనవరిలోగా పూర్తి చేసేందుకు చర్యలు


రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 18 చెక్‌డ్యాంల నిర్మాణాలను జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతాం. ఇప్పటికే 3 చెక్‌డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభంకాగా, వర్షాల కారణంగా మిగతా చెక్‌డ్యాం పనులను నవంబర్‌లో ప్రారంభిస్తాం. బషీరాబాద్‌ మండలంలోని జీవంగిలో కాగ్నా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 80 శాతం పూర్తయ్యాయి, వీలైనంతా త్వరగా పూర్తి చేస్తాం. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే 80 శాతం మంది రైతులకు సాగునీరందే అవకాశం ఉంటుంది .

- బి.సుందర్‌,  జిల్లా నీటిపారుదల శాఖ అధికారి


logo