బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 09, 2020 , 00:04:31

లక్ష నామాలు.. లక్ష తులసీ అర్చన...

లక్ష నామాలు..  లక్ష తులసీ అర్చన...

  • గోవింద నామ స్మరణతో మార్మోగిన కొడంగల్‌ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
  • శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు..
  • శోభాయమానంగా 50వ వసంతాల మహోత్సవం
  •  కొవిడ్‌ కారణంగా నిరాడంబరంగా పూజలు

కొడంగల్‌ : తిరుమల తరువాత తిరుమలగా పేరుగాంచిన కొడంగల్‌ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుడికి లక్ష నామాలతో లక్ష తులసీ అర్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. శ్రావణమాసంలోని మూడో శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి అలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 50 సంవత్సరాలుగా ఆలయంలో లక్ష తులసీ అర్చన మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు. అర్చకులు ఏడుకొండలవాడిని లక్ష నామాలతో కొలుస్తూ.. లక్ష తులసీ దళాలను స్వామివారికి అర్పించారు.

శ్రావణమాసం నెల రోజులు పవిత్రత చేకూరి ఉంటుంది. ఇందులో మూడో శనివారం, మూడో సోమవారాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ రోజున భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మరు జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులను ఆశ్వీదించేందుకు ఆ దేవదేవుడు స్వయంగా ఆలయంలో కొలువై ఉంటాడనేది భక్తుల నమ్మకం. కాబట్టే నేడు భక్తులు ఆలయాలను సందర్శించుకొని స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇందులో భాగంగా శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర దేవాలయంలో భక్తి శ్రద్ధలతో కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక అలంకరణల మధ్య శ్రీనివాసుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి విశేషంగా పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. కన్నులకు కనువిందునందించే స్వామి దివ్య రూపాన్ని దర్శించుకొని భక్తులు తరించారు.

ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ధర్మకర్తలు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించాల్సిన లక్ష తులసీ అర్చన కార్యక్రమాన్ని అర్చకుల మధ్య గర్భ గుడిలో నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం సాక్షాత్కరింపజేశారు. భక్తులు తన్మయత్వంతో గోవిందనామాలు స్మరిస్తూ ఆనందడోలికల్లో మునిగిపోయారు. స్వామిని సందర్శించుకొని అన్ని వేళలా, ఎటువంటి ఆపదలు దరిచేరకూడదని, త్వరలో కొవిడ్‌ మహమ్మారి నుంచి విముక్తిని ప్రసాదించాలని మొక్కులను తీర్చుకున్నారు.   

తాజావార్తలు


logo