మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 08, 2020 , 00:01:47

అనంతగిరికి మరిన్ని హంగులు

అనంతగిరికి మరిన్ని హంగులు

  • ఆ దిశగా ప్రభుత్వం చర్యలు 
  • త్వరలో వెల్‌నెస్‌ సెంటర్‌,  రిసార్ట్‌, రోప్‌వే నిర్మాణం
  • పక్షులను    వీక్షించేందుకు వాచ్‌ టవర్లుట్రెక్కింగ్‌ సౌకర్యం..
  • ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో వడివడిగా అడుగులు 
  • వారంలోగా డీపీఆర్‌ను ఆమోదించేందుకు కసరత్తు
  • మూడేండ్లలో అందుబాటులోకి.. 

తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరికి మరిన్ని హంగులు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ దిశగా కసరత్తు ముమ్మరంగా సాగుతున్నది.  హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో వారాంతంలో అనంతగిరితోపాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులు పర్యాటకులతో నిండిపోతున్నాయి. అయితే సరైన సౌకర్యాలు లేకపోవడంతో పలువురు నిరుత్సాహపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనంతగిరి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.  3600 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలో బెంగళూరులోని జిందాల్‌ తరహాలో ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, యోగా, ధ్యానం కేంద్రాలు, స్పా, స్విమ్మింగ్‌ పూల్‌, పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్‌ టవర్లు, ట్రెక్కింగ్‌, ప్రధాన వ్యూ పాయింట్‌ వద్ద రోప్‌వే ఏర్పాటుకు నిర్ణయించారు. పర్యాటకుల కోసం విశాలమైన అధునాతన వసతులతో కూడిన రిసార్ట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ (డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌)కు పూర్తి ఆమోదం రానున్నది.


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరిని పర్యాటక ప్రదేశంగా మరింత అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నారు. అనంతగిరి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకుగాను చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరువ చూపుతున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో వారాంతంలో ఈ ప్రాంతంతో పాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కొందరు మాత్రం అనంతగిరి ప్రాంతానికి చుట్టుపక్కన గల ఒకట్రెండు చిన్న చిన్న ప్రైవేట్‌ రిసార్ట్స్‌లకు వెళ్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకుల తాకిడికి సరిపోను సౌకర్యాలు ఎక్కడా లేకపోవడంతో దీన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను మరింత ఆకర్షించేలా అనంతగిరి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. వారం రోజుల్లో ఇందుకు సంబంధించి డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌)కు పూర్తి ఆమోదం తెలుపనున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు వారం రోజుల క్రితం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి  ఆ ప్రాంతమంతా పర్యటించి పరిశీలించారు. నాలుగైదు రోజుల్లో కలెక్టర్‌, అటవీ శాఖ అధికారులతో సమావేశమై పర్యాటకులను ఆకర్షించేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

వచ్చే మూడేండ్ల్లలో అందుబాటులోకి ..

ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదంటే ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. 3,600 ఎకరాల్లో అనంతగిరి అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, పర్యాటకులను ఆకర్షించేందుకు బెంగుళూరులోని జిందాల్‌ తరహాలో వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రకృతి చికిత్స అందించేందుకు ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌,  యోగా, ధ్యాన కేంద్రం, స్పా, స్విమ్మింగ్‌ పూల్‌, జిప్‌లైన్లు, వాటర్‌ ఫౌంటెన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్‌ టవర్లు, ట్రెక్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి ప్రాంతాన్ని పూర్తిగా వీక్షించేందుకు రోప్‌వే నిర్మించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రధాన వ్యూ పాయింట్‌ వద్ద రోప్‌వే ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే టూరిజం శాఖకు సంబంధించిన హరిత రిసార్ట్‌ ఉన్నప్పటికీ అన్ని వసతులతో కూడిన మరొక విశాలమైన రిసార్ట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వెల్‌నెస్‌ సెంటర్‌, రిసార్ట్‌ తదితరాలను ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారనేదానిపై  త్వరలో స్పష్టత రానున్నది. కెరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం సమీపంలో హట్‌లు, రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలోనే ఉండేలా నైట్‌ క్యాంపింగ్‌లు, కేఫ్‌లు, చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే మూడేండ్ల్లలో ప్రతిపాదించిన అన్నింటిని పూర్తి చేసి అనంతగిరి ప్రాంతాన్ని పూర్తిస్థాయి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధిలోకి తీసుకురానున్నారు.

పర్యాటకుల తాకిడి...మినీ ఊటీ, తెలంగాణ ఊటీగా పిలవబడుతున్న అనంతగిరి కొండకు పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సెలవులొస్తే చాలు నగరవాసులు అనంతగిరిలో వాలిపోతున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్ర, శని, ఆది వారాల్లో 4 నుంచి 5 వేల మంది వరకు పర్యాటకులు అనంతగిరితో పాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులను చూసేందుకు వస్తున్నారు. అనంతగిరిలోని ప్రసిద్ధ పద్మనాభస్వామిని దర్శించుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కెరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతంలో పర్యాటకులు సేద తీరుతున్నారు. దీంతో పాటు కోట్‌పల్లి ప్రాజె క్టు వద్ద బోటింగ్‌ సౌకర్యం ఉండడంతో బోటింగ్‌ చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత అనంతగిరిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. అనంతగిరి అడవుల్లోని వాతావరణంలో సేద తీరేందుకు చాలామంది పర్యాటకులు ఇతర రాష్ర్టాల నుంచి కూడా ఎక్కువగానే వస్తుంటారు. అనంతగిరి కా హవా... లాకో రోగోంకా దవా (అనంతగిరి గాలి లక్ష రోగాలకు మందు) అని నానుడి కూడా ఉంది. అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కలతో రోగాలు నయమవుతుంటాయన్న నమ్మకంతో కూడా చాలామంది పర్యాటకులు అనంతగిరి కొండకు క్యూ కడుతున్నారు. మరోవైపు అనంతగిరి అడవుల్లో జింకలు, వందల రకాల పక్షులు, నిశాచర జంతువులు, వివిధ రకాల సీతాకోక చిలుకలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

అనంతగిరిని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం


అనంతగిరి అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల పర్యాటకులను ఆకర్షించేలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అనంతగిరి అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు తదితరాలున్న దృష్ట్యా జిందాల్‌ తరహాలో అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది.

- చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డిlogo