బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Aug 06, 2020 , 23:58:07

రైతు వేదిక పనుల్లో వేగం పెంచాలి

రైతు వేదిక పనుల్లో వేగం పెంచాలి

వికారాబాద్‌ రూరల్‌ : గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రకృతి వనాలను ఆదర్శంగా నిర్మించాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. గురువారం వికారాబాద్‌ మండలం నారాయణ్‌పూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న ప్రకృతి వనం, రైతు వేదిక పనులను జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవరావు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. ప్రకృతి వనాల్లో ఏ మొక్కలు నాటితే బాగుంటాయనే విషయాన్ని అటవీశాఖ అధికారులతో కలిసి చర్చించి మొక్కలు నాటాలన్నారు. ప్రకృతి వనంలో పిల్లలు ఆడుకునే పరికరాలు, వాకింగ్‌ ట్రాక్‌, పచ్చదనం, చుట్టూ మూడు వరుసలుగా మొక్కలు నాటాలన్నారు. ఎకరంలో ఏర్పాటు చేస్తే 4 వేల మొక్కలు, అర ఎకరంలో చేస్తే 2 వేల మొక్కలు నాటాలన్నారు. అందమైన కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనుల్లో వేగం పెంచి నాణ్యతగా నిర్మించాలన్నారు. గ్రామంలో చాలా రోజులుగా విద్యుత్‌ సమస్య నెలకొందని.. త్వరగా పరిష్కరించేలా చూడాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా.. స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో మండల అధికారి సుభాషిణి, ఎంపీఓ నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

రైతు వేదిక స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కొడంగల్‌ : మండలంలోని పర్సాపూర్‌లో రైతు వేదిక స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య గురువారం పరిశీలించారు. రైతు వేదిక కోసం స్థల వివాదం నెలకొ నడంతో సర్పంచ్‌ సయ్యద్‌ అంజాద్‌ సమక్షంలో సమస్య పరిష్కారం కోసం సర్వే నం.5లోని 20 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇచ్చారు. పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసిల్దార్‌ కిరణ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.


logo