బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Aug 06, 2020 , 23:21:13

మున్సిపాలిటీల్లో ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌' పథకం

మున్సిపాలిటీల్లో ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌' పథకం

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం అద్భుత అవకాశాన్ని కల్పించింది. పన్ను కట్టేవారికి ఆర్థిక భారం తగ్గేలా... ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌'ను ప్రకటించింది. ఎవరైనా తమ బకాయిని ఒకేసారి చెల్లిస్తే 90 శాతం వడ్డీని మాఫీ పొందవచ్చు. వికారాబాద్‌ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోని ప్రజలకు ఈ పథకంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పరిగిలో అత్యధికంగా రూ.95.76లక్షలు, వికారాబాద్‌ రూ.80 లక్షలు, తాండూరు రూ.70 లక్షల బకాయి లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అవకాశం సెప్టెంబర్‌ 15వరకు మాత్రమే ఉందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య తెలిపారు.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కొన్నేండ్లుగా ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడంతో పన్నుదారులకు భారం తగ్గేలా, ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేలా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రకారం పెండింగ్‌లో ఉన్న బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తూ మున్సిపల్‌ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను బకాయిలను ఒకేసారి ఎవరైతే చెల్లిస్తారో వారికి మాత్రమే ఈ రాయితీ లభించనున్నది. ఇంటి పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నవారు 10 శాతం వడ్డీతో చెల్లిస్తే సరిపోతుంది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు సెప్టెంబర్‌ 15 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. ఆలోగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించిన వారికే ఈ పథకం వర్తించనున్నది. మరోవైపు జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఈ పథకానికి సంబంధించి అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. 

జిల్లాలో రూ.2.45 కోట్ల పన్ను బకాయిలు

జిల్లాలో రూ.2.45 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో ఎలాంటి పెండింగ్‌ బకాయిలు లేనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మిగతా మూడు మున్సిపాలిటీల్లో భారీగా బకాయిలు ఉన్నాయి. అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో రూ.95.76 లక్షలు, వికారాబాద్‌లో రూ.80 లక్షలు, తాండూరులో రూ.70 లక్షల ఇంటి పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పరిగిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.95.76 లక్షల ఆస్తి పన్ను బకాయి వసూలు చేయాల్సి ఉన్నది. ప్రతీ ఏటా పరిగి మున్సిపాలిటీలో రూ.54.23 లక్షలుగా లక్ష్యంగా నిర్ణయిస్తారు. పెండింగ్‌ బకాయిలతోపాటు ఈ ఏడాదికి నిర్దేశించిన లక్ష్యాన్ని కలిపితే మొత్తం రూ.1.49 కోట్ల వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.20.68 లక్షలు వసూలు చేశారు. పరిగిలో కొన్నేండ్లుగా పన్ను బకాయిలు పేరుకుపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు ఈ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. వికారాబాద్‌లో 2018-19కి రూ.2.15 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.1.61 కోట్లు, 2019-20 రూ.2.03 కోట్లకు రూ.1.99 కోట్లు వసూలు చేశారు. గతేడాది వరకు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ.80 లక్షలున్నట్లు అధికారులు తెలిపారు. తాండూరులో 2019-20కి   రూ.4.20 కోట్లకు రూ.3.50 కోట్లు రాగా, రూ.70 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి  రూ.4.30 కోట్లకు ఇప్పటివరకు రూ.కోటి వసూలు చేశారు. మరో రూ.3.30 కోట్లు రావాల్సి ఉంది. కొడంగల్‌ మున్సిపాలిటీలో గతేడాది నిర్దేశించిన రూ.13.27 లక్షల ఇంటి పన్నును వసూలు చేయడంతో ఎలాంటి బకాయిలు లేవు. బకాయిదారులకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిన దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బకాయిలకు 10 శాతం వడ్డీ చెల్లించండంటూ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. మున్సిపాలిటీ ఆటోల ద్వారా, కరపత్రాల ద్వారా వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకానికి సంబంధించి ఆయా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

విస్తృతంగా ప్రచారం...జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

మున్సిపాలిటీల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. జిల్లాలోని పరిగి మున్సిపాలిటీలో అత్యధికంగా ఇంటి పన్ను బకాయిలున్న ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టాం. మొత్తం  వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సెప్టెంబర్‌ 15 వరకు పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి. 90 శాతం వడ్డీ రాయితీతో ప్రయోజనం చేకూరుతుంది. చెల్లించాల్సిన మొత్తం డబ్బుతో పాటు గడువు తేదీని బకాయిదార్ల ఫోన్‌లకు మెసేజ్‌లు పంపుతున్నాం.


logo