ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 06, 2020 , 01:31:57

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

వికారాబాద్‌: కరోనాపై పోరులో జిల్లా పోలీసులు చూపిన ధైర్యం అందరికీ ఆదర్శమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కరోనా బారిన పడి కోలుకుని విధుల్లో చేరిన సిబ్బందిని జిల్లా ఎస్పీ నారాయణ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో కరోనాను ఎదుర్కోవడంలో పోలీసులు ముందున్నారన్నారు. కరోనాకు భయపడవద్దని, మానసికంగా దృఢంగా ఉంటూ కుటుంబ సభ్యు ల్లో ధైర్యం నింపాలన్నారు. వైద్యులు సూచించిన నియమ నిబంధనలు పక్కా గా పాటిస్తూ కరోనాను జయించవచ్చని రుజువు చేశారన్నారు.  కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ విధుల్లో పాల్గొనాలని సూచించారు. తమ తమ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, మనం అందరం కూడా పోరాడాల్సింది కరోనా వ్యాధితో కానీ రోగితో కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అన్నారు. అనారోగ్యం, అత్యవసర పరిస్థితి ఉంటే ఉన్నతాధికారులకు తెలుపాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటూ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ రషీద్‌, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీరెడ్డి, దాసు, వెంకటగిరి, సిబ్బంది పాల్గొన్నారు. 


logo