సోమవారం 21 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 04, 2020 , 22:50:29

జలసిరులు...

జలసిరులు...

రెండేండ్ల తర్వాత వికారాబాద్‌ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. గత రెండు నెలల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావడంతో అంతటా జలకళ సంతరించుకుంది. జూన్‌లో 108.3 మి.మీటర్లకు  149.9 మి.మీటర్లు, జూలైలో 203 మి.మీటర్లకు 295.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 1126 చెరువులుండగా 150 అలుగుపారాయి.  ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్‌, సర్పన్‌పల్లి, కాకరవేణి ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షపు నీరు చేరినప్పటికీ మరో సారి వర్షం పడితే ఇవి కూడా అలుగుపారేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది నీటి నిల్వలు డెడ్‌స్టోరేజీకి పడిపోగా ఈ సంవత్సరం కురిసిన వానలతో సాగుకు భరోసా వచ్చిందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రెండేండ్ల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్‌, సర్పన్‌పల్లి, కాకరవేణి ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. మరో వర్షంతో సంబంధిత మూడు ప్రాజెక్టులు అలుగు పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. సంబంధిత ప్రాజెక్టుల కింద సాగునీరందే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది డెడ్‌ స్టోరేజీకి పడిపోయిన ప్రాజెక్టులు, చెరువుల నీటి నిల్వలు రెండేండ్ల తర్వాత జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కావడంతో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా నీరొచ్చి చేరడంతో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న భూములకు సాగు నీరందించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు పెద్దఎత్తున కాగ్నానది పొంగిపొర్లింది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు పెరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.   

196 చెరువుల్లో వందశాతం నీరు

జిల్లావ్యాప్తంగా 1126 చెరువులుండగా.. 78,091 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అయితే తాండూర్‌ డివిజన్‌లో 285, కొడంగల్‌లో 199, పరిగిలో 348, వికారాబాద్‌ డివిజన్‌లో 294 చెరువులున్నాయి. జిల్లాలో 150 చెరువులు వర్షపు నీటితో నిండి అలుగుపారాయి. తాండూర్‌ డివిజన్‌లో 92, పరిగి డివిజన్‌లో 58 చెరువులు నిండి అలుగుపారాయి. ఇప్పటివరకు 196 చెరువుల్లో 100 శాతం నీటితో జలకళను సంతరించుకున్నాయి. వీటిలో తాండూర్‌ డివిజన్‌లో 19, వికారాబాద్‌లో 110, కొడంగల్‌లో 12, పరిగి డివిజన్‌లో 55 చెరువులున్నాయి. జిల్లాలోని 243 చెరువుల్లో 50-75 శాతం నీటి నిల్వలు పెరిగాయి. వీటిలో తాండూర్‌ డివిజన్‌లో 22, వికారాబాద్‌లో 46, కొడంగల్‌లో 25, పరిగి డివిజన్‌లో 150 చెరువులున్నాయి. 328 చెరువుల్లో 25-50 శాతం నీటి నిల్వలున్నాయి. వీటిలో తాండూర్‌ డివిజన్‌లో 83, వికారాబాద్‌లో 95, కొడంగల్‌లో 108, పరిగి డివిజన్‌లో 42 చెరువులున్నాయి. మరోవైపు 209 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలున్నాయి. వీటిలో తాండూర్‌ డివిజన్‌లో 69, వికారాబాద్‌లో 43, కొడంగల్‌లో 54 చెరువులు, పరిగి డివిజన్‌లో 43 చెరువులున్నట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 

జిల్లాలో అధిక వర్షపాతం

జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. వానకాలం ప్రారంభమైన జూన్‌ నెల నుంచి ఇప్పటివరకు జిల్లా అంతటా భారీ వర్షాలు కురువడంతో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై మాసాల్లో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతంతో పోలిస్తే 100 మి.మీటర్లకుపైగా అధికంగా వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 108.3 మి.మీ కాగా 149.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఒక్క మండలంలోనే తక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మిగతా అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం, సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 203 మి.మీ వర్షపాతంకాగా 295.1 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 11 మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకాగా, మరో 5 మండలాల్లో సాధారణ వర్షపాతం, మరో 2 మండలాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతానికి మించి 42.8 మి.మీ వర్షపాతం నమోదైంది.  


logo