సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Aug 02, 2020 , 00:42:19

ఒక్కొక్కరికి..వందరోజులు

ఒక్కొక్కరికి..వందరోజులు

  • ఉపాధి హామీలో కుటుంబానికి వంద రోజుల కల్పనతో నష్టపోతున్న కూలీలు
  • n ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు..
  • n 25 రోజులకే పూర్తవుతున్న పనులు
  • n  ఇప్పటివరకు 4,941 కుటుంబాలకు వంద రోజుల పని కల్పన
  • n జూలై వరకు 56.46 లక్షల పనిదినాలు కల్పించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ

ఉపాధి హామీ కూలీలకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు ఒక్కో జాబ్‌కార్డుకు వంద రోజుల పనిదినాలు ఇస్తుండగా, అవి 25 రోజుల్లోనే పూర్తవుతున్నాయి. దీంతో మళ్లీ ఆర్థిక సంవత్సరం వరకు పనిలేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జాబ్‌కార్డుల లెక్కన కాకుండా ఒక్కో కూలీకి ఒక్కో కార్డు ఇచ్చి వంద రోజులు పని కల్పిస్తే మరింత మేలు జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై సర్కార్‌ వద్ద ప్రతిపాదనలు ఉండగా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. అయితే, ప్రస్తుతం డబ్బుఐదు రోజుల పనులు పూర్తైన వారిని గుర్తించి సంబంధిత కార్డులోని ఇద్దరికి ఒక్క కార్డు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 2 వేల కార్డులను సిద్ధం చేయగా, ఈ నెలాఖరులోగా ఈ విభజన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లాలో 4,941 కుటుంబాలకు వందరోజులు పని ఇవ్వగా, రూ.97.97 కోట్లు చెల్లించారు.  56.46 లక్షల పని దినాలను అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కుటుంబాలను కాకుండా కూలీలను పరిగణనలోకి తీసుకుని వంద రోజులు ఉపాధి పనులను కల్పించనున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉండగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఒక్కో జాబ్‌కార్డులో నలుగురైదుగురు ఉండడంతో కేవలం 25 రోజుల్లోనే సంబంధిత జాబ్‌కార్డుపై వంద రోజులు పూర్తవుతుండగా సంబంధిత జాబ్‌కార్డులోని కూలీలందరూ మళ్లీ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఉపాధికి దూరంగా ఉండాల్సి వస్తున్నది. కేవలం ఉపాధి పనులపైనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్న దృష్ట్యా జాబ్‌కార్డులోని కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కో కూలీని లెక్కలోకి తీసుకోనుడడంతో ప్రతి కూలీకి వంద రోజుల పాటు ఉపాధి లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 4,941 కుటుంబాలకు వంద రోజుల  పని కల్పించారు. 

కొనసాగుతున్న జాబ్‌కార్డుల విభజన ప్రక్రియ...

ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డుల విభజన ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఒక్కో జాబ్‌కార్డులో అత్యధికంగా ఆరుగురు వరకు కూలీలున్నారు. దీంతో కూలీలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో ప్రస్తుతానికి ప్రతి జాబ్‌కార్డులో ఇద్దరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2 వేల కార్డులను సిద్ధం చేయగా, ఈనెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే 75 రోజులు పూర్తైన కూలీలను గుర్తిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సంబంధిత జాబ్‌కార్డులోని కూలీలకు ఇద్దరికి ఒక కార్డును జారీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 3.94లక్షల మంది కూలీలుండగా, 1,77,941 జాబ్‌కార్డులున్నాయి. ఇద్దరికి ఒకటి చొప్పున జారీ చేసినైట్లెతే 3.50 లక్షల వరకు, ఒక్కో కూలీకి ఒక్కో జాబ్‌కార్డు ఇస్తే ఆ సంఖ్య 4 లక్షలకు పెరుగనుంది. వంద రోజుల పాటు పని పొందే కూలీలు ఇప్పటితో పోలిస్తే రెండింతలు కానున్నారు. 

 4,941 కుటుంబాలకు వందరోజుల పని కల్పన...

ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4,941 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించారు. ఇప్పటివరకు అత్యధికంగా ధారూర్‌ మండలంలో 618, మర్పల్లి 523 , నవాబుపేట్‌ 520, వికారాబాద్‌ 390, పెద్దేముల్‌ 291, కొడంగల్‌ మండలంలో 274 కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించారు.జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా   హరితహారం, పల్లె ప్రకృతి వనం, కల్లాలు, ఇంకుడు గుంతల నిర్మాణం పనులను ప్రధానంగా చేపడుతున్నారు. అంతేకాకుండా, అసైన్డ్‌ భూముల్లో రాళ్లను తీసివేయడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీల ఏర్పాటు, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువుల షెడ్లు, పశువుల మేత పెంపకం, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు తదితర పనులను ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

56.46 లక్షల పనిదినాల కల్పన...

ఈ ఆర్థిక సంవత్సరంలో 85.93 లక్షల పనిదినాలు టార్గెట్‌గా నిర్ణయించగా, ఇప్పటివరకు 56.46 లక్షల పనిదినాలను కల్పించారు. అత్యధికంగా ధారూరు మండలంలో 5.07 లక్షలు, మర్పల్లి 4.64 లక్షలు, పెద్దేముల్‌ 3.85 లక్షలు, కులకచర్ల 3.76 లక్షలు, వికారాబాద్‌ 3.65 లక్షలు, యాలాల 3.53 లక్షలు, నవాబుపేట్‌ 3.39 లక్షలు, బషీరాబాద్‌ మండలంలో 3.10 లక్షల పనిదినాలను కల్పించారు. అదేవిధంగా ఈ ఏడాది పూర్తైన పనులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఇప్పటివరకు రూ.97.97 కోట్లు చెల్లించారు.అత్యధికంగా కులకచర్ల మండలంలో 15,800 కూలీలకు రూ.9.23 కోట్లు, మర్పల్లి 15,345 మందికి రూ.8.32 కోట్లు,  వికారాబాద్‌ 10,019 మందికి రూ.6.96 కోట్లు, పెద్దేముల్‌ 14,627 మందికి రూ.6.67 కోట్లు, నవాబుపేట్‌ 11,571 మందికి రూ.6.36 కోట్లు, కులకచర్ల మండలంలో 15,413 మంది కూలీలకు రూ.6.31 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఒక్కొక్కరికి రోజువారీ కూలి రూ.237 చెల్లిస్తున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కో జాబ్‌కార్డుపై  స్పష్టత రావాల్సి ఉంది


మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక్కో కూలీకి ఒక్కో జాబ్‌కార్డు జారీపై ఇ ప్పటికే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది. కుటుంబానికి వంద రోజుల పనిని పరిగణనలోకి తీసుకోవడంతో చాలా మంది కూలీలు నష్టపోతున్నారని  ప్రభుత్వం గుర్తించింది. ప్రతి కూలీకి ప్రత్యేకంగా జాబ్‌కార్డు జారీ చేయడం వల్ల న్యాయం జరుగుతుంది. అదేవిధంగా, ప్రస్తుతం నలుగురైదుగురు కలిగిన జాబ్‌కార్డులను ప్రతి ఇద్దరికి ఒక జాబ్‌కార్డు చొప్పున జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. 

- కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 
logo