శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Aug 01, 2020 , 00:01:35

పట్టణాల్లో పచ్చందాలు

పట్టణాల్లో పచ్చందాలు

  • వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 31 పార్కుల ఏర్పాటుకు నిర్ణయం 
  • ప్రైవేటు లే అవుట్లలో కేటాయించిన స్థలాల్లో పచ్చదనం పెంచేందుకు సన్నాహాలు
  • అన్ని వయసుల వారు సేదతీరేలా ఏర్పాట్లు..
  • ఆగస్టు 15  వరకు మొక్కలు నాటడం పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం 

మున్సిపాలిటీల్లో అందమైన, ఆహ్లాదకరమైన పార్కుల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తొలి విడుతలో 31 పార్కులు ఏర్పాటు చేయనున్నారు. పరిగి మున్సిపాలిటీలో 4, వికారాబాద్‌లో 18, కొడంగల్‌లో 2, తాండూరులో 7 పార్కులు అందుబాటులోకి తేనున్నారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా వాకింగ్‌ ట్రాక్‌, బెంచీలు, ఆటవస్తువులు, వివిధ రకాల మొక్కలతో తీర్చిదిద్దనున్నారు. ప్రైవేటు లే అవుట్లలో మున్సిపాలిటీకి కేటాయించిన 10శాతం స్థలాల్లో వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ తయారుచేయించి పాలకవర్గం ఆమోదం తర్వాత పనులు మొదలుపడతారు. కొద్ది రోజుల క్రితం మంత్రి సబితారెడ్డి పరిగి హౌసింగ్‌బోర్డులో పార్కు కోసం కేటాయించిన స్థలంలో మొక్కలు నాటి పనులను ప్రారంభించగా, ఆగస్టు 15లోగా పార్కుల నిర్మాణం పూర్తి చేసి మొక్కలు నాటాలని కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులను ఆదేశించారు.                                             

 

 పరిగి : పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు, సాయంత్రం సమయంలో కుటుంబసభ్యులతో కలిసి సేద తీరేందుకు మున్సిపాలిటీలలో పార్కుల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీకి అర్బన్‌పార్కుల ఏర్పాటుతో పాటు ప్రైవేటు లే అవుట్లలో మున్సిపాలిటీకి కేటాయించిన స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కాలనీల ప్రజలకు మంచి వాతావరణం అందుతుంది. తద్వారా ఉదయం వాకింగ్‌కు, సాయంత్రం కొంతసేపు సేద తీరడానికి ఈ పార్కులు వేదికలుగా నిలువనున్నాయి. సాధ్యమైనంత త్వరగా పార్కుల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 15వ తేదీలోపు పార్కులలో మొక్కలు నాటే పనులు పూర్తి కావాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉండగా  తొలి విడుతలో 31 పార్కులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటి నిర్మాణానికి అవసరమైన నిధులు ఆయా మున్సిపాలిటీల నుంచే ఖర్చు చేయనున్నారు. 

నాలుగు మున్సిపాలిటీలలో 31 పార్కులు 

వికారాబాద్‌ జిల్లా లోని నాలుగు మున్సిపాలిటీల్లో తొలి విడుతలో పరిగి మున్సిపాలిటీలో 4, వికారాబాద్‌లో 18, కొడంగల్‌లో 2, తాండూరులో 7 పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటువారు చేసిన లే అవుట్లలో మున్సిపాలిటీకి కేటాయించిన 10 శాతం స్థలాల్లో వీటిని నిర్మించనున్నారు. పలుచోట్ల లే అవుట్లలో మున్సిపాలిటీలకు కేటాయించిన స్థలాలకు ప్రహరీ కూడా పూర్తి చేయగా, సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టి ఆగస్టు 15 వరకు మొక్కలు నాటాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి పరిగిలోని హౌసింగ్‌బోర్డులో పార్కు కోసం కేటాయించిన స్థలంలో మొక్కలు నాటి  పనులను ప్రారంభించారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పరిగి పట్టణంలో  స్థలాలను ఇటీవల సందర్శించి వెంటనే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన డిజైన్‌లను ప్రత్యేకంగా తయారు చేయించి మున్సిపాలిటీ పాలకవర్గం ఆమోదం మేరకు పనులు మొదలుపెట్టనున్నారు. అయితే, కొన్నిచోట్ల హుడాకు, మరికొన్ని చోట్ల ప్రైవేటు వారితో లేదంటే మున్సిపల్‌కు పనులు అప్పగించాలనే ఆలోచన  చేస్తున్నారు.  ఒక్కో పార్కుకు కనీసం రూ.5లక్షల వరకు ఖర్చు కానున్నాయని అంచనా వేస్తున్నారు.   

  అందంగా...ఆహ్లాదకరంగా...

మున్సిపాలిటీలలో పార్కులు చూడచక్కగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా  ఏర్పాట్లు చేయనున్నారు. వీటిల్లో వివిధ రకాల మొక్కలతో పాటు అందమైన  పూలమొక్కలు నాటనున్నారు. అలాగే, ప్రత్యేకమైన గడ్డి పెంపకంతో చిన్నారులు ఆడుకునేందుకు, కూర్చోవడానికి అనువుగా తీర్చిదిద్దనున్నారు. పిల్లలకు ప్రత్యేక ఆటవస్తువులు, వాకింగ్‌ చేసేందుకు వాకింగ్‌ ట్రాక్‌లు, వృద్ధులు సేద తీరేందుకు ప్రత్యేక బెంచీలు, అలాగే, రాత్రి సమయంలో ప్రత్యేకమైన లైటింగ్‌ ఏర్పాట్లను చేయనున్నారు. పార్కులలో అందంగా ఉండే మొక్కలతో పాటు అధిక ఆక్సిజన్‌ ఇచ్చే మొక్కల పెంపకం ద్వారా ప్రజలకు ఆరోగ్యపరంగా మరింత మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా..

ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పార్కులు ఏర్పాటు చేస్తారు. లే అవుట్లలో మున్సిపాలిటీకి కేటాయించిన స్థలాల్లో పార్కుల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఆయా పార్కుల స్థలాల్లో అందమైన మొక్కలు, ప్రత్యేకమైన గడ్డి పెంపకంతోపాటు చక్కటి వాతావరణం ఉండేలా పార్కులను తీర్చిదిద్దుతాం. వాకింగ్‌ ట్రాకులు, బెంచీలు, చిన్నారులకు ఆటవస్తువులు అందుబాటులో ఉంచుతాం. అన్ని వయస్సుల వారు వచ్చి సేదతీరేలా అన్ని చర్యలు తీసుకుంటాం.  

- ప్రవీణ్‌కుమార్‌(కమిషనర్‌, పరిగి మున్సిపాలిటీ) 


logo