శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jul 31, 2020 , 00:04:09

ప్ర‌తి రైతుకు స‌హ‌కారం

ప్ర‌తి రైతుకు స‌హ‌కారం

  • n పంట రుణాల్లో ‘సహకారం’దే పైచేయి
  • n ప్రతి ఏడాది లక్ష్యానికి మించి పంట రుణాలు మంజూరు 
  • n రైతులకు సకాలంలో రుణాలందిస్తున్న డీసీసీబీ
  • n ప్రతి ఏడాది 80 వేల మందికి లబ్ధి
  • n ఈ వానకాలంలో రూ.200 కోట్లకు రూ.250 కోట్లు అందజేత
  • n గత మూడేండ్లుగా వంద శాతానికి  మించి పంపిణీ
  • n పూర్తైన రూ.25 వేల రుణమాఫీ ప్రక్రియ

వికారాబాద్‌ జిల్లాలో  రైతులకు పంట రుణాలు అందజేయడంలో సహకార బ్యాంకులు ముందున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో హైదరాబాద్‌ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 34 బ్రాంచీల్లో రూ.200 కోట్ల ఇవ్వాలని టార్గెట్‌  నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.250 కోట్లను మంజూరు చేశాయి. మూడేండ్లుగా లక్ష్యానికి మించి 115 శాతం నుంచి 150 శాతం మేర రుణాలిస్తూ అన్నదాతకు అండగా నిలబడుతున్నాయి. అలాగే, ఉమ్మడి జిల్లాలోని  సహకార బ్యాంకు బ్రాంచుల్లో రూ.25 వేలలోపు రుణాలు పొందిన 5094 మంది రైతులకు సంబంధించి రూ.7.34 కోట్లను మాఫీ చేసి వీరితో పాటు కొత్త వారికి కూడా రుణాలిచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్‌లలో రూ. 1610 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇప్పటి వరకు  రూ.300 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. గతేడాది సైతం అనుకున్న టార్గెట్‌లో కేవలం 53శాతమే పూర్తి చేశాయి. రైతులెవరూ అధైర్యపడొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు ఇస్తున్నామని, వచ్చే యాసంగిలోనూ సకాలంలో రుణాలు అందజేస్తామని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి పేర్కొంటున్నారు.        

 - వికారాబాద్‌ నమస్తే తెలంగాణ

 వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు సహకార బ్యాంకులు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఓ వైపు  రుణాల కోసం రైతులు ప్రైవేటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా  ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండగా, మరోవైపు సహకార బ్యాంకులు మాత్రం అర్హులైన ప్రతీ రైతుకు మూడేండ్లుగా నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాలను ఇస్తూ జిల్లా రైతాంగానికి సహకారమందిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది దాదాపు 80 వేల మంది రైతులకు పంట రుణాలను సహకార బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ కేంద్ర సహకార బ్యాంకే కాకుండా సంబంధిత బ్యాంకు పరిధిలోని 34 శాఖల్లో ఈ ఏడాది వానకాలం సీజన్‌లో రూ.200 కోట్ల ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.250 కోట్లను మంజూరు చేశాయి. ఈ ఏడాదితో పాటు గత మూడేండ్లుగా 115 శాతం నుంచి 150 శాతం మేర రుణాలను మంజూరు చేస్తున్నాయి 2017-18 ఆర్థిక సంవత్సరంలో  రూ.218 కోట్లకు రూ.320 కోట్లు , 2018-19లో రూ.272 కోట్లకు రూ.374 కోట్లు, 2019-20లో రూ.390 కోట్లకు రూ.432 కోట్లు, 2020-21లో లక్ష్యం రూ.200 కోట్లకు (వానకాలం) ఇప్పటి వరకు రూ.250 కోట్లు మంజూరు చేశాయి. అదేవిధంగా రుణ మాఫీకి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సహకార బ్యాంకు బ్రాంచుల్లో రూ.25 వేలలోపు రుణాలు పొందిన 5094 మంది రైతులకు సంబంధించిన రూ.7.34 కోట్ల రుణాల మాఫీతో రెన్యు వల్‌ చేసి  వీరితో  పాటు కొత్త వారికి కూడా రుణాలను అందజేశాయి. అయితే, రుణ మాఫీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.లక్షలోపు రుణా లు రూ.202 కోట్లు ఉండగా, 44,487 మంది రైతులు ఉన్నారు. వికారాబాద్‌ జిల్లా లో రూ.107 కోట్లకు  24,107 మంది, రంగారెడ్డి జిల్లాలో రూ.86.91 కోట్లకు 18,173 మంది, మేడ్చల్‌ జిల్లాలో రూ.9.24 కోట్లకు 2000 మంది రైతులున్నారు. 

ప్రైవేటు బ్యాంకుల ద్వారా అరకొర రుణాలే...

ఈ ఆర్థిక సంవత్సరం కూడా ప్రైవేటు బ్యాంకర్లు అరకొర రుణాలనే మంజూరు చేశాయి. ఓ వైపు రైతులకు పంట రుణాలను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం, మరోవైపు కొవిడ్‌ వైరస్‌ దృష్ట్యా వానకాలం సీజన్‌లో ఇప్పటివరకు 30 శాతం మేర రుణాలను ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్‌లకు రూ.1610 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా సుమారు రూ.300 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. అయితే, గతేడాది  రెండు సీజన్‌లకు కలిపి కేవలం 53 శాతం మాత్రమే ఇచ్చాయి. రూ.1509 కోట్లను 1,12,758 మంది రైతులకు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్దేశించగా, కేవలం రూ.779 కోట్లను మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారు. వానకాలం సీజన్‌లో రూ.905 కోట్ల లక్ష్యానికి....రూ. 520 కోట్లు, అదేవిధంగా యాసంగి సీజన్‌లో రూ.603 కోట్లకు కేవలం రూ.259 కోట్లను 75,170 మంది రైతులకు మంజూరు చేశాయి. 

అర్హులైన రైతులందరికీ రుణాలు...


హైదరాబాద్‌ కేంద్ర సహకార బ్యాంకుతో పాటు అన్ని శాఖ ల్లోనూ అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలను అందజేస్తున్నాం. ప్రతి ఏటా అన్ని బ్రాంచీల్లో లక్ష్యానికి మించి రైతులకు రుణాలను అందిస్తున్నాం. మొదటి దఫాగా రూ.25 వేలు మాఫీ అయిన ప్రతి రైతుకు రుణాలను మంజూరు చేశాం. యాసంగిలోనూ సకాలంలో రుణాలను అందించి అండగా ఉంటాం. 

- డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌ రెడ్డిlogo