సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jul 30, 2020 , 00:04:35

విప‌క్షాల‌కు నో ఆప్ష‌న్‌

విప‌క్షాల‌కు నో ఆప్ష‌న్‌

  • n వికారాబాద్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవం దిశగా ఎన్నికలు..
  • n దాదాపు ఖరారైన సభ్యుల పేర్లు
  • n ప్రతి మున్సిపాలిటీలో నలుగురికి  అవకాశం
  • n నేడు కొడంగల్‌ మున్సిపాలిటీ కౌన్సిల్‌ సమావేశం
  • n రేపు పరిగి ..మిగతా రెండు చోట్ల వారంలోగా సమావేశపర్చేందుకు సన్నాహాలు
  • n నోటిఫికేషన్‌ నుంచి 13 రోజులే గడువు..

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో   సభ్యుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. వికారాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి  పది మంది పోటీలో ఉండగా నలుగురి పేర్లను ఖరారు చేశారు. తాండూరులో  11 మంది నామినేషన్లు వేయగా నలుగురు ఉపసంహరించున్నారు. ఒక నామినేషన్‌ను తిరస్కరించగా, మిగతా ఐదుగురిలో ఒకరు నామమాత్రపు పోటీకాగా మిగిలిన నలుగురి ఎన్నిక లాంఛనమే కానున్నది. కొడంగల్‌లో ఆరు నామినేషన్లు రాగా, ముగ్గురికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. నాలుగో స్థానంపై ఉత్కంఠ నెలకొన్నది. పరిగిలో మెజార్టీ సభ్యులు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉండడంతో నాలుగు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి.  నోటిఫికేషన్‌ జారీ చేసిన 13రోజుల్లో ఎన్నిక నిర్వహించాల్సి ఉండడంతో త్వరలో కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించి సభ్యులను ప్రకటించేందుకు ఆయా మున్సిపాలిటీల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ


 వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నిక నిర్వహించేందుకు ఆయా మున్సిపాలిటీల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోనూ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌  కైవసం చేసుకున్న దృష్ట్యా కో-ఆప్షన్‌ స్థానాలన్నీ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమేనని తెలుస్తున్నది. పరిగి మున్సిపాలిటీలో మాత్రమే ఇతర పార్టీలకు చెందిన ఆరుగురు సభ్యులున్నప్పటికీ మెజార్టీ సభ్యుల ఓట్లను బట్టి ఎన్నికను నిర్వహించనున్నారు కాబట్టి నాలుగు కో-ఆప్షన్‌ స్థానాలు కూడా అధికార పార్టీకే దక్కే అవకాశాలున్నాయి. అయితే, ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీల్లోనూ కో-ఆప్షన్‌ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. కొడంగల్‌లో నేడు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశమవుతుండగా, రేపు పరిగి మున్సిపాలిటీలో.. వారంలోగా మిగతా మున్సిపాలిటీల్లో సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ సభ్యుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అదేవిధంగా కో-ఆప్షన్‌ ఎన్నికను నోటిఫికేషన్‌ జారీ చేసిన 13 రోజుల్లో  నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి  ఆయా మున్సిపాలిటీల అధికారులు ఎన్నికల కోసం కౌన్సిల్‌ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఎన్నికలకు సన్నాహాలు..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్‌ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఇందులో మైనార్టీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన వారిని ఎన్నుకుంటారు. ఆయా కేటగిరిల నుంచి పోటీ ఎవరూ లేకపోయినైట్లెతే ఏకగ్రీవమవుతాయి. అయితే, వికారాబాద్‌ మున్సిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్‌ స్థానాలకు 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా 4 నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం పది మంది సభ్యులు నాలుగు స్థానాలకు పోటీ పడుతున్నారు.ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 34 వార్డులుండగా 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌కు బలం ఉన్న దృష్ట్యా నాలుగు కో-ఆప్షన్‌ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో పడనున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో పది మంది ఉండగా నలుగురి పేర్లను దాదాపు ఖరారు చేశారు. మైనార్టీ కేటగిరిలో షకిల్‌(ముస్లిం), క్రిస్టియన్‌ మహిళ, జనరల్‌ కేటగిరి కింద శంకర్‌, దమయంతి పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. మరోవైపు తాండూరు మున్సిపాలిటీలోనూ కో-ఆప్షన్‌ దాదాపు ఏకగ్రీవమైంది. ఇక్కడ 11 మంది నామినేషన్లను దాఖలు చేయగా నలుగురు ఉపసంహరించుకోగా ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే, ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఐదుగురు బరిలో ఉండగా ఒకరు నామమాత్ర పోటీకాగా మిగతా నలుగురి ఎన్నిక లాంఛనమే కానుంది.

అబ్దుల్‌ ఖవి, ఉష, వెంకట్రాంనాయక్‌, సారంగి పేర్లను దాదాపు ఖరారు చేశారు. అదేవిధంగా కొడంగల్‌ మున్సిపాలిటీలో ఆరు నామినేషన్లు దాఖలుకాగా టీఆర్‌ఎస్‌కు చెందిన సయ్యద్‌ మునీర్‌, శారదమ్మ, హజీరాబేగం పేర్లు ఇప్పటికే ఖరారుకాగా, నాలుగో కో-ఆప్షన్‌ స్థానం కోసం రమేశ్‌బాబు, కోస్గి వెంకటయ్య మధ్య పోటీ నెలకొన్నది. అయితే, రమేష్‌ బాబుకు స్థానిక ఎమ్మెల్యే మద్దతుండగా, కోస్గి వెంకటయ్యకు మాజీ ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. మరోవైపు నామినేషన్‌ వేసిన ఫకీరప్ప పోటీ నామమాత్రమేనని స్పష్టమవుతున్నది. పరిగి మున్సిపాలిటీలో ఏడు నామినేషన్లు రాగా అధికార పార్టీ నుంచి ఇద్దరు,  ఇతర పార్టీకి చెందిన  ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. మెజార్టీ సభ్యులు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉండడంతో నాలుగు కో-ఆప్షన్‌ స్థానాలు కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనున్నాయి.

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సానియా సుల్తానా, సోమారం పార్వతమ్మ, ముకుంద శేఖర్‌, శేట్‌ ముజామిల్‌ పేర్లను ఇప్పటికే ఖరారు చేశారు. కో-ఆప్షన్‌ ఎన్నికకు సంబంధించి నేడు కొడంగల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనున్నది. పోటీలేని స్థానాల్లో బరిలో ఉన్న వారి పేర్లను అధికారులు ఏకగ్రీవ ఎన్నికగా ప్రకటించనున్నారు. ఒకవేళ పోటీ ఉన్నట్లయితే మెజార్టీ సభ్యుల ఓట్లను పరిగణనలోకి తీసుకొని ఎన్నుకోనున్నారు. పరిగి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రేపు నిర్వహించేందుకు  నిర్ణయించగా,  మిగతా మున్సిపాలిటీల్లో  వారంలోగా కౌన్సిల్‌ సమావేశపరిచి ఎన్నికను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  
logo