మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 29, 2020 , 00:59:17

మహిళా సంఘాలకు రుణాలు

మహిళా సంఘాలకు రుణాలు

పట్టణంలో 952 స్వయం సహాయక సంఘాలు

స్వయం ఉపాధి కింద 18 మందికి ప్రోత్సాహం

వికారాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న మహిళా సంఘాల అభ్యున్నతి కోసం నిధులు కేటాయిస్తూ సంఘాలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. కరోనా సమయంలో కూడా నిధులు మంజూరు చేసి వారిలో మనోధైర్యాన్ని పెంపొందించింది. వికారాబాద్‌ పురపాలికలో 952 మహిళా సంఘాలుండగా 30 సంఘాలకు రూ.15 లక్షల రుణాలు అందించారు. ఈ రుణం తీసుకున్నవారు 24 నెలల్లో చెల్లించాల్సి ఉన్నా వారికి మొదటి ఆరు నెలలు చెల్లించకున్నా పర్వాలేదు, వడ్డీ మాత్రం యథావిధిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వారికి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయోగపడుతుందని సంఘాల సభ్యులు తెలిపారు. పొదుపు చేసుకున్న రుణాన్ని కూడా తిరిగి సభ్యులకు చెల్లిస్తూ సంఘాలు అభివృద్ధి చెందేలా అధికారుల ప్రోత్సాహం ఉందని పట్టణంలోని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఒక్కో సంఘంలో 10 మందిని చేర్చుకుని అవసరమున్నవారికి రుణాలందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. కిరాణా దుకాణం, పాల వ్యాపారం, చీరల వ్యాపారం చేసుకునేవారు పట్టణంలోని 18 మంది రూ.12 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు.


కిరాణ దుకాణం నడిపిస్తున్నా : అరుణ, గాంధీ కాలనీ

నేను సాయికృప మహిళా సంఘంలో కొనసాగుతున్నా. సంఘం నుంచి వచ్చే నిధులే కాకుండా స్వయం ఉపాధి కోసం కిరాణ దుకాణం నడుపుతున్నా. దానిని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక రుణం తీసుకున్నా. తక్కువ వడ్డీ కావడంతో చాలా ఉపయోగంగా ఉంది. గ్రూపు సభ్యులందరూ సకాలంలో రుణాలు చెల్లించడంతో అధికారులు కూడా మాకు మంచి ప్రోత్సాహం కల్పిస్తున్నారు. 

సకాలంలో రుణాలు అందిస్తున్నాం 

- పట్టణ మెప్మా అధికారి వెంకటేశ్‌

వికారాబాద్‌లోని 952 సంఘాలకు సకాలంలో రుణాలు అందిస్తున్నాం. ప్రత్యేకంగా వ్యాపారాలు చేసుకునే మహిళలకు కూడా నిధులు మంజూరు చేసి వారిని ప్రోత్సహిస్తున్నాం. తిరిగి రుణాలు చెల్లించినవారికి 15 రోజుల్లో మళ్లీ ఆ సంఘానికి నిధులు అందిస్తున్నాం. 


logo