సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 28, 2020 , 00:07:46

పర్యాటక కేంద్రంగా అనంతగిరి

పర్యాటక కేంద్రంగా అనంతగిరి

  • n టూరిజం స్పాట్‌గా మార్చేందుకు అన్ని అవకాశాలు 
  • n ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం
  • n చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు రంజిత్‌రెడ్డి
  • టూరిస్టు కేంద్రంగా  అనంతగిరిని అభివృద్ధి చేస్తాం : ఎంపీ

వికారాబాద్‌ రూరల్‌ :  రాష్ట్రంలోనే అనంతగిరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. సోమవారం అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే ఆనంద్‌, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులతో కలిసి పరిశీలించారు. అనంతగిరిలోని మూసీ నది పుట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో వంద సంవత్సరాలకు పైగా ఉన్న  చెట్లను పరిశీలించారు. సెల్ఫీ పాయింట్‌గా అడవిలో కొన్ని ప్రదేశాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి అనంత పద్మనాభస్వామి ఆలయానికి ప్రతి రోజు భక్తులు వస్తుంటారు. దీంతోపాటు  శని, ఆదివారాల్లో 2వేల నుంచి 3వేల మంది పర్యాటకులు వచ్చి రెండురోజుల పాటు అనంతగిరి అడవి అందాలను వీక్షిస్తారు. అనంతగిరిని ఆరోగ్యగిరిగా కాపాడుకుంటూనే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామ న్నారు.


అటవీ ప్రాంతం మొత్తం 316 ఎకరాలలో ఉందని డీఎఫ్‌ఓ ఎంపీకి వివరించారు. నందిఘాట్‌ సమీపంలో సందర్శకులు గడుపుతారని, వానకాలంలో వాటర్‌ఫాల్స్‌ వచ్చే ప్రదేశానికి వెళ్లి అక్కడే భోజనాలు చేస్తూ పిల్లలతో సరదాగా గడుపుతారన్నారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ నుంచి చూస్తే కోట్‌పల్లి ప్రాజెక్టు కనిపిస్తుందన్నారు. ఇది పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధితోపాటు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అనంతగిరిని అభివృద్ధి చేయాలని గతంలో మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ వచ్చి పరిశీలించారని, దానికనుగుణంగా కావాల్సిన చర్యలు తీసుకొని అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా అనంతగిరి కోనేరు సమీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఎఫ్‌ఆర్‌ఓ బాలయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, డీఈ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ పాండు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  logo