మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 26, 2020 , 00:28:11

నూర్పిడి ఇబ్బంది తప్పినట్లే!

నూర్పిడి ఇబ్బంది తప్పినట్లే!

  • వికారాబాద్‌ జిల్లాలో రూ.28.05 కోట్లతో 4,120 కల్లాల నిర్మాణం
  • దసరా నాటికి సిద్ధం
  • రోడ్లపై  నూర్పిళ్లతో నిత్యం  ప్రమాదాలు 
  • ఇప్పటివరకు 2900 అనుమతులు
  • నిర్మాణ దశలో 1,173
  • రైతాంగంలో హర్షాతిరేకాలు 
పరిగి : రైతులు పండించిన పంట నూర్పిడి చేసేందుకు తమ పొలాల్లోనే ఒక చోట కల్లాన్ని తయారుచేసుకునేవారు. కాలక్రమేణ గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించిన తర్వాత దాదాపు రైతులంతా రోడ్లపైనే నూర్పిళ్లు చేయడం ప్రారంభించారు. తమ పంటలు కోసి రోడ్లపై ఆరబెట్టి, నూర్పిడి చేసి ఇండ్లకు తీసుకెళ్లేవారు. రోడ్లపై పంటలు పోయడంతో వాహనాలు వాటిపై నుంచి వెళ్లే సమయంలో దుమ్ము, ధూళి ఎగిసి ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతోపాటు ప్రమాదాలు జరిగేవి. రోడ్డుపైనే వ్యవసాయ ఉత్పత్తులు ఉంటే రైతులు రాత్రి సమయంలో ఆ పక్కనే నిద్రపోయేవారు. రైతాంగం ఇబ్బందులను తొలగించేందుకు సర్కారు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌ రైతుల పొలాల్లోనే శాశ్వత ప్రాతిపదికన కల్లాల నిర్మాణం చేపట్టి, వారి ఇబ్బందులు తొలగించేందుకు ముందుకొచ్చారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలో ఈసారి 4,120 కల్లాలు నిర్మించేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.28.05 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 2,900 కల్లాల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా, 1173 కల్లాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో దసరా నాటికి కల్లాల నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనలో సర్కారు ఉన్నది. రైతులు తమ పొలాల్లోని కల్లాల్లోనే వానకాలం పంటలు నూర్పిడి చేసుకునేందుకు వీలుగా, వేగంగా నిర్మించాలని అధికారులు జోరుగా పనులు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో 4,120 కల్లాల నిర్మాణం
జిల్లా వ్యాప్తంగా 4,120 కల్లాలు నిర్మించాలని సర్కారు నిర్దేశించింది. ఇందుకుగాను 2,900 కల్లాల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వాటికి అనుమతులు కూడా మంజూరుచేశారు. 
ఆయా మండలాల వారీగా పరిశీలిస్తే బంట్వారం మండలంలో 87, బషీరాబాద్‌లో 73, బొంరాస్‌పేట్‌లో 262, ధారూర్‌లో 174, దోమలో 387, దౌల్తాబాద్‌లో 153, కొడంగల్‌లో 147, కోట్‌పల్లిలో 83, కులకచర్లలో 484, మర్పల్లిలో 119, మోమిన్‌పేట్‌లో 67, నవాబుపేట్‌లో 127, పరిగిలో 180, పెద్దేముల్‌లో 96, పూడూరులో 55, తాండూరులో 112, వికారాబాద్‌లో 116, యాలాల్‌లో 178 దరఖాస్తులు చేసుకోగా, అధికారులు అన్నింటికీ అనుమతులు మంజూరుచేశారు. కొన్ని మండలాల్లో నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో, మరికొన్ని మండలాల్లో అధికంగా దరఖాస్తులు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు వాటన్నింటికీ అనుమతులు మంజూరు చేశారు. 

మూడు రకాలుగా కల్లాలు

ప్రభుత్వం పొలాల్లో నిర్మించే కల్లాలను మూడు రకాలుగా విభజించింది. 50 చదరపు మీటర్ల కల్లానికి రూ.56వేలు, 60 చ.మీ.కు రూ.68వేలు, 75 చ.మీ.కు రూ.85 వేలు అందజేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతరులకు 90శాతం సబ్సిడీ మంజూరు చేస్తున్నది. తమ పొలాల్లో ఉన్న స్థలాలకు అనుగుణంగా వాటిని నిర్మించుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ కల్లాలను నిర్మిస్తున్నారు. కల్లాల నిర్మాణానికి మార్కింగ్‌తోపాటు పనులు చేపట్టిన తర్వాత రికార్డు చేయడం, చెక్‌మెజర్‌ అన్నీ సంబంధిత ఉపాధిహామీ అధికారులే చేస్తారు. రైతులు 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారై, ఉపాధి హామీ జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉన్నవారై ఉండాలి. ప్రతి రైతు తప్పనిసరిగా కల్లం నిర్మించుకోవాలన్నదే సర్కారు లక్ష్యం. ప్రతి ఏడాది కొన్నింటి చొప్పున నిర్మించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు. కూలీలతో చేపట్టే పనులకు రూ.16 వేలు, సిమెంటు, కంకర, ఇసుక, సెంట్రింగ్‌ పనులకు మిగతా డబ్బులు ఇవ్వనున్నారు. అర్హులైన రైతులకు అనుమతులు ఇవ్వడంతో కల్లాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు కూడా ప్రతిరోజు ఆయా మండలాల్లోని వ్యవసాయాధికారులు, ఉపాధిహామీ సిబ్బందితో మాట్లాడుతున్నారు. దీంతో కల్లాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

 రైతు కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు


రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ ఆరేండ్లుగా అనేక పథకాలతో ఆదుకుంటున్నడు.  పంటల నూర్పిళ్ల కోసం రోడ్లపై వేయడంతో ప్రమాదాలు జరిగేవి.  తమ పొలాల్లోనే పంట లు నూర్పిళ్లు చేసుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన కల్లాల నిర్మాణం చక్కటి కార్యక్రమం. రైతుకు ఎంతో మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తున్నది. 
- పి.రాంరెడ్డి, రైతు, రాఘవాపూర్‌


logo