శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jul 25, 2020 , 00:01:26

అనంతగిరి.. ఔషధ గని

అనంతగిరి.. ఔషధ గని

  • 50 రకాల ఔషధ మొక్కలను గుర్తించిన అధికారులు
  • ఈ ఏడాది 25 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
  • రెండున్నర ఎకరాల మియావాకిలోనూ ఔషధ మొక్కలకు ప్రాధాన్యం

అనంతగిరి అడవులు ఔషధ మొక్కలకు ప్రసిద్ధి.   ఇక్కడి గాలి పీల్చితే శ్వాస సంబంధ  రోగాలు ఇట్టే నయమవుతాయని,  ఆయుష్షు కూడా పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు.  ఈ అటవీ ప్రాంతంలోనే ప్రభుత్వం టీబీ ద వాఖానను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నది.  1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో 50 రకాల ఔషధ మొక్కలున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మరో 25వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇక్కడ రెండున్నర ఎకరాల్లో చేపట్టనున్న చిట్టడవుల్లోనూ ఔషధ మొక్కలకు  ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

-వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

-వికారాబాద్‌, నమస్తే తెలంగాణ  : అనంతగిరికా హవా.. లాకో మరీజోంక దవా(అనంతగిరి గాలి లక్షల రోగాలకు మందు) అనే నానుడి ఉంది. ఔషధ మొక్కలకు అనంతగిరి అడవులు ప్రసిద్ధి. అనంతగిరి అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కల గాలితో శ్వాస సంబంధమైన రోగాలు కొన్నేండ్లుగా నయమవుతున్నాయి. అనంతగిరి గాలి పీల్చితే చాలా ఎక్కువ కాలం బతుకుతారని ఇక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు. అదేవిధంగా ఇక్కడి ఔషధ మొక్కలు వెదజల్లే గాలితో రోగాలు నయమవుతుండడంతో సంబంధిత అటవీ ప్రాంతంలోనే ప్రభుత్వం టీబీ దవాఖానను ఏర్పాటు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నారు. కేవలం అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కలు వెదజల్లే స్వచ్ఛమైన వాయువే టీబీ దవాఖానకు వచ్చే రోగులకిచ్చే ప్రధాన చికిత్స. అనంతగిరికి తెలంగాణ నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు ఇక్కడికి చికిత్సకై వస్తుంటారు. అయితే 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అడవుల్లో 50 రకాల ఔషధ మొక్కలున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఔషధ మొక్కలతోపాటు మరిన్ని ఔషధ మొక్కలను ఈ ఏడాది హరితహారంలో భాగంగా నాటేందుకు అధికారులు సిద్ధం చేశారు. అంతేకాకుండా అనంతగిరి అడవుల్లో రెండున్నర ఎకరాల్లో చేపట్టనున్న చిట్టడవుల్లోనూ ఔషధ మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూపొందించారు. 

ఈ ఏడాది 25 వేల మొక్కలు...

అనంతగిరి అడవుల్లో ఈ ఏడాది 25 వేల ఔషధ మొక్కలను నాటనున్నారు. మియావాకిలో భాగంగా అనంతరిగిలోని రెండున్నర ఎకరాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు ఔషధ మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. 10 వేల ఔషధ మొక్కలను నాటనుండగా, హరితహారంలో భాగంగా 15 వేల మొక్కలను నాటేందుకు ఇప్పటికే గుంతలను తవ్వారు. భారీ వర్షం నమోదైన వెంటనే మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అనంతగిరి అడవుల్లోని 50 రకాల ఔషధ మొక్కల్లో వేప, కాచు, దర్శనం, అల్లనేరేడు, వేరుమద్ది, ఉసిరి, రావి, నెమలినార, కానుగ, తెల్ల విరుగుడు, మర్రి, మేడి, నారవేప, చిన్నంగి, ఇప్ప, మామిడి, జీడి, దొరిసేన, గన్నేరు, చిల్లగింజ, చింత, టేకు, తెల్లమద్ది, కరక్కాయ, ఇనుముద్ది, అంకుడు చెట్టు, పెద్ద రేగు, పరాకి, ముష్టిగంగా, పెద్ద గుమ్ముడు టేకు, అజఘ్నము, అడ్డాకు, కలేచెట్టు, పసుపు, పెద్దమాను, చిందుగ, చిరుమాను, చారుమామిడి, మోదుగ, జిల్లేడు తదితర ఔషధ మొక్కలున్నాయి. వీటితో అప్లూడ మల్టికా, ఏషియన్‌ స్పైడర్‌ఫ్లవర్‌, అసిస్టిషియా మైసోరెంట్స్‌, స్పెర్మసోస్‌ ఒసిమైడీస్‌, త్రింపుట పెంటడా లాంటి గడ్డిజాతి ఔషధ మొక్కలు, అస్పిడోప్‌టెరిస్‌ కొర్డటా, బవుహినియా వహిలి, జక్వెమోంటియా లాంటి తీగ జాతి ఔషధ మొక్కలు అనంతగిరి అడవుల్లో ఉన్నాయి.


logo