గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 21, 2020 , 23:35:45

గ్రామాలాభివృద్ధిలో రాజీలేదు

గ్రామాలాభివృద్ధిలో రాజీలేదు

చేవెళ్ల రూరల్‌: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని కౌకుంట్లలో సర్పంచ్‌ గాయత్రి ఆధ్వర్యంలో రూ.30 లక్షల జడ్పీ నిధులతో చేపడుతున్న మురుగు కాలువల నిర్మాణ పనులను మంగళవారం మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రా మాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామా ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక నిధులు మంజూరు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనన్నారు. ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు నేరుగా విడుదల చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రస్తుతం సీఎం గ్రామానికో ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని మంత్రి వెల్లడించారు. 

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

హరిత తెలంగాణ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి అన్నారు. అన్ని గ్రామల్లో విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలన్నారు. ఆయా పల్లెల్లో పెద్దఎత్తున మొక్కలు నాటడం జరిగిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. 

పాఠ్య పుస్తకాల పంపిణీలో భాగస్వాములవ్వాలి

రేపటి నుంచి ప్రారంభమయ్యే పాఠ్య పుస్తకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావ్వాలని మంత్రి సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొని పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలను ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీలకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. కొవిడ్‌-19 నిబంనధలు పాటించి పంపిణీ చేయాలన్నారు. 

గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు

గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి తెలిపారు. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు జడ్పీ నిధులతో కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనా కాలంలోనూ ధాన్యం సేకరణ చేపట్టినట్లు ఆమె గుర్తు చేశారు. 

కరోనా నివారణకు చర్యలు 

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటూనే రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, తాసిల్దార్‌ షర్మిల, ఎంపీడీవో హరీశ్‌, అంతారం ఎంపీటీసీ సుజాత, కౌకుంట్ల ఉపసర్పంచ్‌ అబ్దుల్‌, నాయకులు పాల్గొన్నారు. logo