శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jul 21, 2020 , 23:35:50

ఆహార పార్కుకు ఆమోదం...

ఆహార పార్కుకు ఆమోదం...

  అన్నదాతల అభ్యున్నతికి అనేకరకాలుగా చేయూతనిస్తున్న ప్రభు త్వం తాజాగా ఆహార పార్కులు ఏర్పాటుచేసి వారికి అన్నిరకాలు గా సహకరించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇండస్ట్రియల్‌ పార్కు ల మాదిరిగానే ఆహార పార్కులు ఏర్పాటుచేసి రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి తోడ్పాటును అందించనున్నది. నియోజకవర్గానికి ఒక పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా తాండూరు మండలం జిన్‌గుర్తిలో ఏర్పాటుకు ఆమోదం లభించింది. మిగతా నియోజకవర్గాల్లోనూ వీటి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏయే పంటలు అధికంగా సాగవుతాయో వాటికి సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాలను  ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు బియ్యం, పప్పు, నూనె మిల్లులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేసి, వీటికి సమీపంలోనే గోదాములు నిర్మించాలని నిర్ణయించారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకుచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆహార పార్కు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. రెండు నెలల క్రితం ఆహార పార్కు కోసం ప్రతిపాదనలు పంపగా తాండూరు మండలం జిన్‌గుర్తిలో ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  జిల్లాలో తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లోని అనువైన ప్రభుత్వ భూములను జిల్లా యంత్రాంగం గుర్తించగా ప్రస్తుతానికి  జిన్‌గుర్తిలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.  ఇటీవల జిన్‌గుర్తిలో స్థలాన్ని టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. రోడ్డు సౌకర్యం, హెచ్‌టీ విద్యుత్‌ సౌకర్యం ఉండడంతో ఆమోదం తెలిపారు. ఇందుకోసం సర్వే పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిన్‌గుర్తి గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్‌ 206లో 305 ఎకరాల పోరంబోకు భూమిని గుర్తించారు. వీటిలో 222 ఎకరాలు ఎలాంటి కబ్జాలో లేకుండా ఉండడం, ఈ ప్రాంతం ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు అనుసంధానమై ఉండడం, మండల కేంద్రానికి సమీపం, తాండూరు రైల్వే స్టేషన్‌కు 13 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అనువైన స్థలంగా గుర్తించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆహార పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో జిల్లాలో మరో మూడు ఆహార పార్కులకు త్వరలోనే ఆమోదం లభించనున్నది. పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం రాకంచర్లలో ఇప్పటికే ఇండస్ట్రియల్‌ పార్కు ఉన్న దృష్ట్యా ప్రస్తుతానికి వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఆహార పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

అర్కతల, ఘణాపూర్‌లలో అనువైన స్థలం...

 ఆహార పార్కులో శుద్ధి కేంద్రాలతోపాటు బియ్యం, పప్పు, నూనె మిల్లులు తదితర పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పనున్నారు.  ఇప్పటికే జిల్లాలో శివారెడ్డిపేట్‌, రాకంచర్లలో ఇండస్ట్రియల్‌ పార్కులున్నాయి. రాకంచర్ల ఇండస్ట్రియల్‌ పార్కులో పూర్తిగా స్టీల్‌ పరిశ్రమలుండగా, శివారెడ్డిపేట్‌లో సుద్ధ గనులతోపాటు ఇతర పరిశ్రమలున్నాయి.  

     జిన్‌గుర్తితో పాటు వికారాబాద్‌ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం ఘణాపూర్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 57లోని 330 ఎకరాలు(గైరాన్‌ భూమి), వికారాబాద్‌ మండలంలోని గిరిగెట్‌పల్లి గ్రామం సర్వే నెంబర్‌ 228లోని 383 ఎకరాలు(పోరంబోకు-సర్కారీ), నవాబుపేట మండలంలోని అర్కతల గ్రామం సర్వేనెంబర్‌ 31లోని 246 ఎకరాల పోరంబోకు భూమి, ఎక్‌మామిడి గ్రామం సర్వే నెంబర్‌ 606, 628, 112 లోని 999 ఎకరాలు(అటవీ భూమి)లను ఆహార పార్కు కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. వీటిలో మర్పల్లి మండలంలోని ఘణాపూర్‌, నవాబుపేట మండలం అర్కతలలో ఆహార పార్కు ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. మర్పల్లి మండలం ఘణాపూర్‌ ముంబై జాతీయ రహదారికి కేవలం 3 కిలోమీటర్ల సమీపంలోనే ఉండడం, 286 ఎకరాలు  అనువైనదిగా ఉన్నట్లు సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికను ఆందజేశారు. అంతేకాకుండా నవాబుపేట్‌ మండలం అర్కతలలోని సర్వే నంబర్‌ 31లోని 341 ఎకరాలు కూడా అనువుగా ఉనాయని ప్రభుత్వానికి తెలిపారు. అయితే ప్రతిపాదించిన స్థలాలను టీఎస్‌ఐఐసీ బృందం పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందించనుంది. ఎస్సీలకు 35 శాతం, బీసీ, ఓసీలకు 15 శాతం, అదేవిధంగా ఎస్సీ మహిళలకు 45 శాతం, బీసీ మహిళలకు 25 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు రూ.75 లక్షల వరకు నిధులను అందజేయనుంది. 

ఆహార పార్కుల్లో శుద్ధి కేంద్రాలు...

జిల్లాలో ఏయే పంటలు అధికంగా సాగవుతాయో ఆ పంటలకు సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాలను స్థానికంగానే ఏర్పాటు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అధిక మొత్తంలో సాగు చేసే కందులతోపాటు వేరుశనగ, చిరుధాన్యాలు, కూరగాయలు, చెరుకు, చింతపండు, మొక్కజొన్న పంటల  శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. అయితే కందులను సాగు చేసే రైతులు దళారులకు క్వింటాలుకు రూ.5 వేల చొప్పున విక్రయిస్తుండగా, రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న దళారులు కందులను పప్పుగా మార్చేసి రూ.8 వేలకుపైగా విక్రయిస్తూ రూ.3 వేలకుపైగా లాభాన్ని అర్జిస్తున్నారు.  ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే రైతులు తాము పండించిన కందులను ఆహార శుద్ధి కేంద్రాల్లో పప్పుగా మార్చుకొని నేరుగా విక్రయించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయలకు సంబంధించి జిల్లాలో ప్రధానంగా మోమిన్‌పేట్‌, నవాబుపేట, పూడూరు, దోమ మండలాల్లోని 12,590 హెక్టార్లలో 30,556 మెట్రిక్‌ టన్నుల కూరగాయాలను సాగు చేస్తున్నారు. అయితే టమాటాలను పండించే రైతులు కొన్నిసార్లు ధరలు లేక  పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రోడ్డుపై పారవేయడం, పశువులకు మేతగా వేయడంలాంటివి చేస్తుంటారు. టమాటా రైతులు నష్టపోకుండా ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి టమాటా సాస్‌, టమాట సూప్‌లాంటివి తయారు చేసినట్లయితే రైతులు లాభాన్ని అర్జించవచ్చు. అయితే  ప్రస్తుతం పండిస్తున్న టమాటాలను కాకుండా టమాట సాస్‌,  టమాట సూప్‌లా తయారయ్యే కొత్త టమాట వంగడాలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, కులకచర్ల మండలాల్లో 3253 హెక్టార్లలో చిరుధాన్యాలను సాగు చేసి 6023 మెట్రిక్‌ టన్నులను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యరీత్యా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్న కారణంగా వాటి సాగును పెంచడంతోపాటు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులు లాభాలు పొందుతారు. అదేవిధంగా దోమ, కులకచర్ల మండలాల్లో గంపల్లో పెట్టి రైతులు చింతపండును విక్రయిస్తున్నారు, ఈ  చింతపండును ప్యాక్‌ చేసి ఆహార శుద్ధి కేంద్రం ద్వారా విక్రయించినట్లయితే రైతులు లాభాన్ని పొందవచ్చు. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల, దోమ మండలాల రైతులు కొందరు  పచ్చి మామిడిని సన్నని ముక్కలుగా చేసి నిజామాబాద్‌ వెళ్లి విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలు, తదితర ఖర్చులతో రైతులు అంతగా లాభం పొందడం లేదు, ఆహార శుద్ధి కేంద్రం స్థానికంగానే ఏర్పాటు చేసినట్లయితే పచ్చి మామిడి ముక్కలతో ఆమ్‌చూర్‌ ఇక్కడే తయారు చేసి విక్రయించి అధిక  లాభాన్ని ఆర్జించవచ్చు.


logo