సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 20, 2020 , 00:20:16

టార్గెట్ వంద‌శాతం

టార్గెట్ వంద‌శాతం

  • ఈ ఏడాది వికారాబాద్‌ జిల్లా పంచాయతీల్లో పన్ను వసూలుకు నిర్దేశించిన లక్ష్యం రూ.8 కోట్లు
  • ఆస్తి పన్ను రూ.7.50 కోట్లు, ఇతర బకాయిలు రూ.50 లక్షలు
  • ప్రభుత్వ ఖజానాలో ఇప్పటివరకు రూ.3.44 లక్షలు జమ 
  • నూతనంగా నిర్మించిన ఇండ్లతో పాటు మిగతా కట్టడాలను గుర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
  • గత ఆర్థిక సంవత్సరం రూ.7.93 కోట్లు వసూలు
  • ఈసారి వందశాతం వసూళ్లే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు

ఆస్తి పన్ను వసూలును పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. ఈ ఏడాది ఆస్తి పన్నుతో పాటు ఇతర బకాయిలు కలిపి మొత్తం రూ.8 కోట్లను టార్గెట్‌గా నిర్ణయించారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా మార్చిలో వసూళ్లు తగ్గినప్పటికీ జూన్‌ నెల చివరి వారం నుంచి మళ్లీ పంచాయతీ సిబ్బంది వేగం పెంచింది. పన్ను వసూళ్లలో పరిగి, కొడంగల్‌, బంట్వారం, వికారాబాద్‌, దోమ మండలాలు ముందంజలో ఉండగా, మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు మండలాలు వెనుకబడ్డాయి. పరిగి, కొడంగల్‌, బంట్వారం మండలాల్లో 100 శాతం ఇంటి పన్ను వసూలైంది. అయితే, గతేడాది 8.5 కోట్లకు రూ.7.93 కోట్లు అంటే 94శాతం బకాయిలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. అదే ఉత్సాహంతో ఈ సారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో వందశాతం లక్ష్యం సాధించేలా జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా చర్యలు చేపట్టారు. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి జిల్లా పంచాయతీ శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఏడాది ఆస్తి పన్నుతోపాటు ఇతర బకాయిలు కలిపి రూ.8 కోట్లను టార్గెట్‌ను నిర్ణయించారు. అయితే, జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో నూతనంగా నిర్మించిన ఇండ్లతోపాటు అదనంగా నిర్మించిన గదుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు లెక్కతేల్చారు. దాని ప్రకారమే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలు లక్ష్యాన్ని నిర్ణయించారు. వీటిలో ఆస్తి పన్ను రూ.7.50 కోట్లుకాగా, ఇతర బకాయిలను రూ.50 లక్షలుగా అధికారులు నిర్దేశించారు. 

ఈ ఏడాది వంద శాతం పన్ను వసూలు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను ప్రతి గ్రామ పంచాయతీకి నియమించిన ందున పన్ను బకాయిలు కూడా టార్గెట్‌ మేరకు వసూలు అవుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం రూ.5.50 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, అంతకుముందు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల బకాయిలను కూడా కలుపుకుని మొత్తం 94 శాతం వసూలు చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను వసూలయ్యే మార్చిలోనే వసూలు ప్రక్రియ నిలిచిపోవడంతో కొంతమేర వేగం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇప్పటివరకు రూ.3.44 లక్షలు వసూలు...

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8 కోట్ల ఇంటి పన్ను, ఇతర(నీటి పన్ను, ఇంటి అనుమతి పన్ను, ఆస్తి మార్పిడి పన్ను, దుకాణ అనుమతి పన్ను తదితర పన్నులు) బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు రూ.3.44 లక్షలు వసూలైంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను బకాయిలను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా ఆ దిశగా చర్యలు చేపట్టారు. మూడు, నాలుగు నెలలుగా కరోనా విజృంభిస్తుండడంతో గత నెల చివరి వారం నుంచి వసూలు ప్రక్రియను సిబ్బంది ప్రారంభించింది. ఇప్పటివరకు ఆయా మండలాల్లో పన్ను వసూలుకు సంబంధించి... బంట్వారం మండలంలో రూ.7090, బొంరాస్‌పేట్‌లో రూ.7828, దోమ రూ.6965, దౌల్తాబాద్‌ రూ.3950, కొడంగల్‌ రూ.4386, కోట్‌పల్లి రూ.28,722, కుల్కచర్ల రూ.51,110, మర్పల్లి రూ.56,411, మోమిన్‌పేట్‌ రూ.24,218, నవాబుపేట్‌ రూ.1085, పరిగి రూ.56,071, పూడూర్‌ రూ.21,358, తాండూర్‌ రూ.32,816, వికారాబాద్‌ మండలంలో రూ.42,861 పన్ను బకాయిలను వసూలు చేశారు.    

గతేడాది రూ.7.93 కోట్ల వసూలు...

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 94 శాతం బకాయిలు వసూలు చేశారు. జిల్లాలో 566 గ్రామ పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.50 కోట్ల పన్ను, ఇతర బకాయిలతోపాటు గత రెండు, మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్లను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించగా రూ.7.93 కోట్లు వసూలు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన ఇంటి పన్ను రూ.7.26 కోట్లు, ఇతర బకాయిలు రూ.66.78 లక్షలు వసూలు చేశారు. వసూళ్లలో  పరిగి, కొడంగల్‌, బంట్వారం, వికారాబాద్‌, దోమ మండలాలు ముందంజలో ఉండగా, మర్పల్లి, మోమిన్‌పేట్‌, ధారూర్‌ మండలాలు వెనుకంజలో ఉన్నాయి. పరిగి, కొడంగల్‌, బంట్వారం మండలాల్లో 100 శాతం ఇంటి  వసూలు  చేశారు. వికారాబాద్‌, దోమ మండలాల్లో 98 శాతం  పూర్తయింది. అదేవిధంగా నవాబుపేట్‌, పెద్దేముల్‌, బషీరాబాద్‌, పూడూరు, తాండూరు, కులకచర్ల, యాలాల మండలాల్లో 90 శాతానికిపైగా పన్ను వసూలైంది. అయితే ఆయా మండలాల్లో వసూలు చేసిన పన్ను బకాయిలకు సంబంధించి.. పరిగి మండలం రూ.51.84 లక్షలు, కొడంగల్‌ రూ.29.14 లక్షలు, వికారాబాద్‌ రూ.36.63 లక్షలు, దోమ రూ.42.33 లక్షలు, పెద్దేముల్‌ రూ.42.27 లక్షలు, నవాబుపేట్‌ రూ.45.25 లక్షలు, యాలాల రూ.47.43 లక్షలు, బంట్వారం రూ.20.32 లక్షలు, కులకచర్ల రూ.55.65 లక్షలు, బషీరాబాద్‌ రూ.30.96 లక్షలు, బొంరాస్‌పేట్‌ రూ.21.19 లక్షలు, కోట్‌పల్లి రూ.20.72 లక్షలు, దౌల్తాబాద్‌ రూ.28 లక్షలు, పూడూరు రూ.68.29 లక్షలు, తాండూరు రూ.1.07 కోట్లు, ధారూర్‌ రూ.48.53 లక్షలు, మర్పల్లి రూ.40.89 లక్షలు, మోమిన్‌పేట్‌ మండలంలో రూ.55.65 లక్షల పన్ను బకాయిలు వసూలైంది. 

100 శాతం వసూలు చేస్తాం : డీపీవో రిజ్వానా


జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం పన్ను బకాయిలను వసూలు చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ఇప్పటి నుంచే పన్ను బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు రూ.3 లక్షలకుపైగా బకాయిలు వసూలయ్యాయి. మరోవైపు అన్ని పంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులను నియమించిన దృష్ట్యా గతంలో ఎన్నడూలేని విధంగా పన్ను బకాయిలు వసూలయ్యాయి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇల్లు, నీటి, ఇంటి అనుమతి, తదితర పన్నులను ఎప్పటికప్పుడు చెల్లించాలి. 


logo