మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 19, 2020 , 00:03:40

భోజనహర్షం

భోజనహర్షం

  • ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల హర్షం
  • వికారాబాద్‌ జిల్లాలో 8 వేల మందికి ప్రయోజనం
  • జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్‌, 2 డిగ్రీ కాలేజీలు
  • తగ్గనున్న డ్రాపౌట్స్‌, బలోపేతం కానున్న కళాశాలలు

విద్యార్థులకు అందనున్న పౌష్టికాహారంప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతూ దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పెట్టాలని  నిర్ణయం తీసుకున్నది. దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  విద్యార్థుల డ్రాపౌట్స్‌ తగ్గించడానికి, పోషకాలతో కూడిన ఆహారం అందించడానికి దీనివల్ల సాధ్యమవుతుంది. ఈ పథకం కారణంగా వికారాబాద్‌ జిల్లాలో ఎనిమిది వేల మందికి ప్రయోజనం కలుగనుంది.  జిల్లాలో మొత్తం 9 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుకుంటున్న విద్యార్థులు ఇకనుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీలను బలోపేతం చేసేందుకుగాను చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ కాలేజీల్లో అన్ని మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అమలుచేయాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం అమలుతో డ్రాపౌట్‌ శాతం పూర్తిగా తగ్గడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది. ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే కాబట్టి వారందరికీ ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ కాలేజీ ల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఆర్‌వో ప్లాంట్‌ ద్వారా తాగునీరు, ఫర్నిచర్‌, అర్హులైన లెక్చరర్లతో టీచింగ్‌ తదితర సదుపాయాలను అందిస్తున్న ప్రభుత్వం.. మధ్యాహ్న భోజ నం అమలు చేయడంతో కాలేజీకి వచ్చి మధ్యాహ్నమే వెళ్లే విద్యార్థులతోపాటు ఉపవాసముండి తరగతులు వింటున్న పేద విద్యార్థుల ఆకలి సమ స్య తీరుతుంది. అంతేకాకుండా కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కూడా మరింత పెరుగుతుంది.  

జిల్లాలో 8 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం...

మధ్యాహ్న భోజనం అమలు చేయడంతో జిల్లాలోని జూనియర్‌, డిగ్రీ కాలేజీలకు చెందిన 8 వేల మందికి ప్రయోజనం చేకూరుతుంది. జిల్లా లో 9 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, రెండు డిగ్రీ కాలేజీలున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తాం డూర్‌, కొడంగల్‌లో ఉండగా, వికారాబాద్‌, మర్ప ల్లి, మోమిన్‌పేట్‌, నవాబుపేట్‌, దోమ, పరిగి, కొడంగల్‌, తాండూర్‌, పెద్దేముల్‌లో జూనియర్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 7 వేల మంది విద్యార్థులుండగా, డిగ్రీ కాలేజీల్లో 1200 మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తున్నారు. కాలేజీ సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు.. కానీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు.

అయితే విద్యార్థులు ఇంటి నుంచి ఉదయం 8 గంటలకే బయలుదేరి వస్తున్న దృష్ట్యా మధ్యా హ్నం వరకు తరగతులకు హాజరై వెళ్తున్నారు. స్థానికంగా ఉన్న విద్యార్థులు మాత్రమే ప్రత్యేక తరగతుల సమయం వరకు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని కొడంగల్‌, తాండూర్‌, దోమ కాలేజీల్లో చేరే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కాలేజీల్లో చేరి తిరిగి పరీక్షల సమయంలో మాత్రమే హాజరయ్యే వారున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏదో ఒక పని నిమిత్తం ముంబై, హైదరాబాద్‌ నగరాలకు వలస వెళ్తుంటారు. అంతేకాకుండా మరికొంతమంది పస్తులుండి తరగతులు వింటుండగా, మరికొంత మంది మధ్యాహ్నమే ఇంటికి వెళ్లే విద్యార్థులున్నారు.

అయితే ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుచేసినట్లయితే డ్రాపౌట్‌ విద్యార్థులంతా క్రమం తప్పకుండా కాలేజీలకు హాజరుకానున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కూడా మరింత పెరుగుతుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 50 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. గతంలో 30-40 శాతం ఉన్న ఉత్తీర్ణత శాతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కాలేజీల బలోపేతంతో పెరిగింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 66 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ప్రభుత్వ తీరుపట్ల విద్యావేత్తలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా 

దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు మరింత బలోపేతమవుతాయి. ఆర్థికంగా వెనుకబడిన జిల్లా కాబట్టి ఇక్కడి పేద విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. పౌష్టికాహారాన్ని అందించనున్న దృష్ట్యా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. 

- ఎన్‌.శంకర్‌, జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి

దూర ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యం

ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు చేపడుతున్న చర్యలకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ సౌకర్యం ఎంతగానో తోడ్పడుతుంది. కళాశాలకు ఉదయం హడావుడిగా బయలుదేరే క్రమంలో అమ్మ ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మధ్యాహ్న భోజన పథకంతో ఈ ఇబ్బందులు తప్పుతాయి. సాఫీగా చదువులు కొనసాగుతాయి.          -ఖాజామొయినొద్దీన్‌, డిగ్రీ విద్యార్థి, హస్నాబాద్‌
logo