గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 17, 2020 , 02:24:43

జోరుగా రైతు వేదికల నిర్మాణాలు

జోరుగా రైతు వేదికల నిర్మాణాలు

  • తీరనున్న అన్నదాతల బాధలు
  • రైతులను ఏకతాటిపైకి తెచ్చేందుకే ఈ వేదికలు
  • అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం

మహేశ్వరం: మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ వేదికల ద్వారా రైతులకు అనేక లాభాలుంటాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు వారి అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకుపోయి లబ్ధి పొందేందుకు ఉపయోగ పడుతాయి. పంటల సస్యరక్షణ చర్యల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ వేదికలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. వారంతా ఒకేచోట కూర్చుని ఏ కాలంలో ఏ పంట వేయాలి, పంట మార్పిడి ద్వారా దిగుబడులు తదితర సూచనలు, సలహాలను చర్చించేందుకు వేదికలుగా ఉపయోగ పడనున్నాయి. రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ వేదికలను నిర్మిస్తున్నది. మండలంలో 3 రైతు వేదికల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఒకటి మహేశ్వరం, రెండోది నాగారం, మూడోది దుబ్బచెర్లలో నిర్మిస్తున్నారు. ఒక్కో వేదికకు రూ.22 లక్షల చొప్పున నిధులు ఎన్‌ఆర్‌జీఎస్‌ నుంచి రూ.10 లక్షలు, వ్యవసాయ రంగం నుంచి రూ.12 లక్షలు కేటాయిస్తున్నారు. ఈ వేదికలను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. దీని పిల్లర్ల దగ్గరనే కొంత సమయం తీసుకున్నా పైన పనులను రెండు వారాల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. రైతు వేదికలు నిర్మించిన తర్వాత వీటిని ఇతర రాష్ర్టాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

రైతులను సంఘటితం చేసేందుకు..

రైతులు సంఘటితంగా ఉండి వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ వేదికలు ఉపయోగ పడుతాయి. వారు పండించిన పంటలకు వారే ధరను నిర్ణయించుకొనుటకు వేదికగా మారనున్నాయి. మండలంలో జోన్లవారీగా మహేశ్వరం, దుబ్బచెర్ల, నాగారంలలో వేదికలు ఏర్పాటు చేస్తున్నాం.   రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేస్తున్నది.

- సుజాత, డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకురాలు logo