శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jul 17, 2020 , 02:21:08

ప్రకృతి వనానికి స్థలం ఎంపిక చేయాలి

ప్రకృతి వనానికి స్థలం ఎంపిక చేయాలి

  •  వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు

పరిగి: పల్లె ప్రకృతివనానికి స్థలం ఎంపిక చేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు సూచించారు. గురువారం పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్‌ గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని వెంటనే ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేయించాలని, ప్రతి ఇంటికి ఒక ఇంకుడుగుంత నిర్మించాలని సూచించారు. తద్వారా వర్షపు నీరు వృథా కాకుండా ఎక్కడికక్కడే భూమిలో ఇంకిపోతుందన్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన నల్లాలకు ఆన్‌ ఆఫ్‌లు వెంటనే ఏర్పాటు చేయించుకోవాల్సిందిగా కలెక్టర్‌ తెలిపారు. ట్యాప్‌లు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృథాగా పోతున్నదన్నారు. 

డంపింగ్‌యార్డు స్థలం పరిశీలన

పరిగి మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్‌యార్డు ఏర్పాటుకు శాఖాపూర్‌ గ్రామ శివార్లలో కలెక్టర్‌ పౌసుమిబసు స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి డంపింగ్‌ యార్డుకు స్థలం పరిశీలించిన కలెక్టర్‌, ఆ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది తాసిల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పరిగి సమీపంలోని వాగుపై గల బ్రిడ్జిని కలెక్టర్‌ పరిశీలించారు. బ్రిడ్జిపై ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo