ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 15, 2020 , 01:33:31

పంపిణీకి పాఠ్యపుస్తకాలు సిద్ధం..

పంపిణీకి పాఠ్యపుస్తకాలు సిద్ధం..

విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు  అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. వికారాబాద్‌ జిల్లాకు అవసరమైన పుస్తకాలు ఇప్పటికే జిల్లా కేంద్రంలోని బుక్‌డిపోలో భద్రపరిచారు. వీటిని రెండు మూడు రోజుల్లో మండల కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకు అందజేస్తారు. -పరిగి

పరిగి : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పటికీ స్పష్టత లేకున్నా పాఠశాలలన్నింటికీ పాఠ్య పుస్తకాల పంపిణీకి సర్కారు చర్యలు చేపట్టింది. తద్వారా ఎప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమైనా విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నది సర్కారు ఆలోచన. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా అవసరమైన పుస్తకాల్లో చాలావరకు జిల్లా కేంద్రంలోని బుక్‌ డిపోకు తరలించారు. మిగతావాటిని రెండు రోజుల్లో తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, గురుకులాలకు 5,90,390 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో అత్యధిక శాతం బుక్‌డిపోకు చేరగా.. వాటిని రెండు రోజుల్లో పాఠశాలలకు చేరవేసే కార్యక్రమం చేపట్టనున్నారు. అందుకు సంబంధించి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. 

పాఠశాలలు, గురుకులాలకు సరిపడ పుస్తకాలు...

వికారాబాద్‌ జిల్లా పరిధిలో 1003 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 9 మోడల్‌ స్కూళ్లు, 18 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, 6 ఆశ్రమ పాఠశాలలు, రెండు సంగెం లక్ష్మీబాయి గురుకులాలు, 8 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 7 బీసీ గురుకులాలు, 6 మైనార్టీ గురుకులాలు, 2 టీఆర్‌ఐఈఎస్‌లు ఉన్నాయి. వీటిలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి మొత్తం 5,90,390 పాఠ్య పుస్తకాలు అవసరమని ప్రతిపాదించారు. వాటిలో ఇప్పటికే 5,75,390 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని బుక్‌డిపోకు చేరుకున్నాయి. మరో 15,000 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. వాటిని సైతం రెండుమూడు రోజుల్లో జిల్లా కేంద్రానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుండగా జిల్లాలోని వివిధ గురుకులాలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మిగతా పాఠశాలలకు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఉచిత పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టింది. ప్రతి పుస్తకంపై బార్‌కోడ్‌ ముద్రించింది. తద్వారా పక్కదారి పట్టకుండా నిర్దేశించిన వారికే అందజేసేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి. 

రెండుమూడు రోజుల్లో పంపిణీ షురూ...

పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం రెండుమూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతున్నారు. వికారాబాద్‌లోని బుక్‌ డిపో నుంచి ముందుగా ఆయా మండల కేంద్రాలలోని మండల విద్యా వనరుల కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరవేస్తారు. అక్కడి నుంచి పాఠశాలల వారీగా అవసరం మేరకు పాఠ్య పుస్తకాలు అందజేస్తారు. ఇందుకుగాను ఆయా రూట్ల వారీగా కార్గో బస్సుల్లో పాఠ్య పుస్తకాలు తరలించనున్నారు. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌లోని బుక్‌డిపోకు కార్గో బస్సుల్లోనే పాఠ్య పుస్తకాలు చేరవేశారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు ఇదే విధంగా తరలిస్తారు. అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారు. logo