శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jul 15, 2020 , 01:28:40

నీటిబొట్టు.. పట్టిపెట్టు

నీటిబొట్టు.. పట్టిపెట్టు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : నీరే జీవకోటికి ప్రాణాధారం. తాగునీటి సమస్యతో ఏర్పడే సమస్యలు వర్ణనాతీతం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నీటి అవసరం ఎంతో ఉంటుంది. గతంలో భూగర్భజలాలు అతి తక్కువ లోతులోనే లభించేవి. అయితే రానురాను వర్షాభావ పరిస్థితులతోపాటు అవసరంలేకపోయినా భూగర్భజలాలను వాడుకోవడంతో భూగర్భజలమట్టం రానురాను పాతాళానికి పడిపోతున్నది. వెయ్యి అడుగుల లోతు వరకు తవ్వితే కాని బోర్లలో నీటి జాడ కనిపించని పరిస్థితి నెలకొంది. భూగర్భజలాలు ప్రమాదకరస్థాయికి చేరకముందే మేల్కొని భూగర్భజలాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వర్షపునీటిని వృథా పోనివ్వకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకుగాను ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణం స్పీడందుకుంది. ఇప్పటికే ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం కొనసాగుతున్నది. ప్రతి ఇంటికొక ఇంకుడు గుంతను నిర్మించుకునేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ప్రస్తుతం హరితహారం, పల్లెకో ప్రకృతివనం, కల్లాల నిర్మాణంలో ఉపాధి హామీ కూలీలు బిజీగా ఉండడంతో వారానికి వెయ్యి చొప్పున ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. 

ఇప్పటివరకు 28,144 ఇంకుడుగుంతలు పూర్తి...

జిల్లావ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణం జోరందుకుంది. వారానికి 1000 చొప్పున ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. జిల్లాలో 84,733 ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంకాగా ఇప్పటివరకు 28,144 ఇంకుడు గుంతలు పూర్తయ్యాయి. మరో 6,289 ఇంకుడు గుంతల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది చివరిలోగా జిల్లా యంత్రాంగం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా ముందుకెళ్తున్నది. అక్టోబర్‌ నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఇంటింటికి ఒక ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఆయా మండలాల్లో పూర్తైన ఇంకుడు గుంతలకు సంబంధించి బంట్వారం మండలంలో 991 ఇంకుడు గుంతలు, బషీరాబాద్‌లో 1015, బొంరాస్‌పేట్‌లో 1371, ధారూర్‌లో 2680, దోమలో 1927, దౌల్తాబాద్‌లో 1599, కొడంగల్‌లో 1527, కోట్‌పల్లిలో 882, కుల్కచర్లలో 2161, మర్పల్లిలో 2175, మోమిన్‌పేట్‌లో 2585, నవాబుపేట్‌లో 999, పరిగిలో 1606, పెద్దేముల్‌లో 1075, పూడూర్‌లో 1060, తాండూర్‌లో 1568, వికారాబాద్‌లో 1226, యాలాల మండలంలో 1697 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయ్యింది. 

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఆవశ్యకం...

ఆరుబయట, ఇండ్ల ప్రహరీ లోపల, బోర్ల చుట్టుపక్కల ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భూగర్భజలాలు పెరుగుతాయి. ప్రతి ఏడాదికేడాదికి తగ్గిపోతున్న భూగర్భజలాలు తిరిగి వృద్ధి చెందాలంటే ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకం. ఇంకుడు గుంతలను నిర్మించి వృథా నీటిని వాటిలోకి పంపడం ద్వారా సంబంధిత ప్రాంతాల్లో భూగర్భజలాలను పెంపొందించవచ్చు. ఇంకుడు గుంతల నిర్మాణంతో వృథాగాపోయే వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో భూగర్భజలాలు పెరుగడంతోపాటు ఇప్పటికే ఎండిపోయిన బోర్లలో తిరిగి భూగర్భజలాలు పెంపొందే అవకాశం ఉంటుంది. తాగు, సాగునీటి సమస్య ఏర్పడకపోవడంతోపాటు మురుగునీరు రోడ్లపైకి రాదు, దుర్గంధం ఏర్పడదు, అంతేకాకుండా ఈగలు, దోమల సంతతి పూర్తిగా నాశనమవుతుంది. అదేవిధంగా ఇంటి వద్ద నిర్మించుకునే ఇంకుడు గుంతకు రూ.3900, సామాజిక ఇంకుడు గుంతలను నిర్మించేందుకు రూ.7100 ప్రభుత్వం అందజేస్తుంది. అయితే ఇంకుడు గుంతలను స్వయంగా లబ్ధిదారుడే నిర్మించుకోవచ్చు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు ఉండేలా ఇంకుడు గుంతను తవ్వాలి. 3 అడుగుల వరకు పెద్ద రాళ్లు, మరో 3 అడుగుల వరకు చిన్న రాళ్లతో నింపాలి. 3 ఫీట్ల ఎత్తున ట్యాంకును నిర్మించి దానికి రంధ్రాలు చేయాలి. ట్యాంకు చుట్టూ కంకర రాళ్లతో నింపాల్సి ఉంటుంది. ఇంటివైపు నుంచి వచ్చే వర్షపు నీరు, ఇంటి అవసరాలకు  ఉపయోగించే నీటిని ట్యాంకులోకి వెళ్లేలా పైపులను అమర్చాల్సి ఉంటుంది. ట్యాంకుపై సిమెంట్‌తో చేసిన మూతను కప్పి ఉంచాలి.

ఇంటింటికి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి

ఇంటింటికి ఒక ఇంకు డు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాలి. ప్రస్తుతం వారానికి వెయ్యి ఇంకుడు గుంతల నిర్మా ణం పూర్తి చేస్తున్నారు. అక్టోబర్‌లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఈ ఏడాదిలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటి పోతున్న దృష్ట్యా భవిష్యత్తు తరాలకు నీటిని కాపాడేందుకుగాను ఇంకుడు గుంతలను నిర్మించుకోవాల్సిన అవసరముంది. - డీఆర్డీవో కృష్ణన్‌

తాజావార్తలు


logo