శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jul 14, 2020 , 01:31:38

ఫార్మాసిటీ పరిహారం పెంచండి

ఫార్మాసిటీ పరిహారం పెంచండి

  • మంత్రి కేటీఆర్‌కు  ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి  వినతి
  •  ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రకటన చేస్తామన్న మంత్రి

ఇబ్రహీంపట్నం : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంపు విషయంపై రైతుల నుంచి వస్తున్న అభ్యర్థనలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఐటీశాఖమంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించి ముఖ్యమంత్రితో చర్చించి రైతులకు పరిహారం పెంచే విషయంపై సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్‌, కుర్మిద్ద, తాడిపర్తి, కందుకూరు మండలంలోని ముచ్చర్ల గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ గ్రామాల్లో ఇప్పటికే 10వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూములను కూడా సేకరించే క్రమంలో కరోనా, లాక్‌డౌన్‌ వంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా కొంత జాప్యం జరిగింది. తిరిగి మిగిలిన భూసేకరణ చేయడం కోసం అధికారులు సిద్ధ్దమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వమే నేరుగా రైతులతో చర్చించి వారి కోరిక మేరకు భూములకు పరిహారం పెంచి, తగిన న్యాయం చేయాలని భావిస్తున్నది. గతంలో ప్రభుత్వ భూములకు రూ.7.50 లక్షలు, పట్టాభూములకు రూ.12.50లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. రైతులకు ఉన్న భూములకు పూర్తిగా పరిహారం చెల్లించలేదు. దీంతో రైతుల నుంచి కొంత నిరసన వ్యక్తమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టాభూములకు, ప్రభుత్వ భూములకు పరిహారం పెంచడంతో పాటు రైతులకున్న భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే రైతుల నుంచి అభ్యంతరాలు ఉండవనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రైతులతో పలుమార్లు చర్చించి వారి డిమాండ్‌లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

 అడ్డంకులు సృష్టించినా ఫార్మాసిటీ ఆగదు : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ ఎట్టి పరిస్థితిలోనూ ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నేరుగా ప్రభుత్వమే రైతులతో చర్చించి వారికి తగిన న్యాయం చేసి భూములను సేకరిస్తుందన్నారు. కొంతమంది పైరవీకారులు, ప్రతిపక్ష నాయకులు మాత్రమే ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 


logo