సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 14, 2020 , 01:23:54

లాక్‌డౌనే మేలు

లాక్‌డౌనే మేలు

  • పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో  స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్న వ్యాపారస్తులు
  • అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులకు  మినహాయింపు
  • తాండూరు, కడ్తాల్‌, పెద్దేముల్‌లో  కొనసాగుతున్న స్వీయ నిర్బంధం..
  • నేటి నుంచి పదిరోజులు వికారాబాద్‌ బంద్‌..

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాపార సంఘాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. దీంతో వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల దుకాణాలు మూతపడ్డాయి. ఆర్థికంగా నష్టపోతామని.. అయి నా ప్రాణాల కంటే డబ్బులు ముఖ్యం కాదని, సమూహాలతో వైరస్‌ వేగంగా వ్యాప్తి  చెందుతుందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నేటి నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నిత్యావసర సరుకుల కోసం సోమవారం  ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు.

వికారాబాద్‌: కరోనా కట్టడికి వికారాబాద్‌ వర్తక వ్యాపార  సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ కేసులు విజృంభిస్తుండడంతో స్వీయ నియంత్రణ వైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార సముదాయాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 132 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఎక్కువ సంఖ్యలో జిల్లా కేంద్రంలోనే నమోదు కావడంతో వికారాబాద్‌ పట్టణంలోని వ్యాపార దుకాణాలు మూసివేసేందుకు వర్తక వ్యాపార సంఘం సభ్యులు నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి 10 రోజుల పాటు దుకాణాలు మూసి వేసేందుకు యజమానులు నిర్ణయం తీసుకున్నారు. నియంత్రణకు స్వీయ నిర్భంధమే మార్గంగా భావించిన వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించేందుకే మొగ్గు చూపారు. 

తాండూరులో

తాండూరు: కరోనాను తరిమికొట్టడమే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లో కరోనా విజృంభిస్తున్నది. దీంతో ప్రజలు కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు 13 నుంచి 20 వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని తాండూరు వెల్ఫేర్‌ ఫోరం, వాణిజ్య, వ్యాపార సంఘాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో సోమవారం పట్టణంలోని అన్ని దుకాణాలను మూసి సంపూర్ణ లాక్‌ డౌన్‌ అమలుకు మద్దతు తెలిపారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేందుకు వలంటీర్లు తగు చర్యలు చేపట్టారు. ప్రజలు ఒకే దగ్గర గుమికూడి ఉండకుండా పోలీస్‌ శాఖ తగు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం తాండూరులో పరిస్థితి బాగలేదని అందుకు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సీఐ రవికుమార్‌ సూచించారు. 

పెద్దేముల్‌

పెద్దేముల్‌ మండల కేంద్రంలో రెండు రోజులుగా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో కరోనా విజృంభిస్తుండటంతో గ్రామస్తులంతా అవసరమైతే తప్పా బయటకు రావడంలేదు. 

కడ్తాల్‌.

కడ్తాల్‌ మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛంద బంద్‌ను పాటిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. దీంతో మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి వచ్చే వారు ఉదయమే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు  సహకరించాలని వర్తక సంఘం నాయకులు కోరుతున్నారు.


logo