గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 13, 2020 , 00:18:52

ఆ ల్యాబ్‌లపై చర్యలేవి..?

ఆ ల్యాబ్‌లపై చర్యలేవి..?

  • పరిగిలో మూడు ల్యాబ్‌లకే అనుమతులు  
  • దర్జాగా కొనసాగుతున్న మరో ఐదు ల్యాబ్‌లు 

పరిగి : ప్రస్తుత వైద్య విధానంలో ప్రతి చిన్న వ్యాధికి సంబంధించిన పరీక్షలు జరిపించిన తర్వాతే నిర్ధ్దారించి వైద్యులు మందులు రాస్తున్నారు...తద్వారా చిన్న పట్టణాల్లోనూ ల్యాబ్‌లు వెలుస్తుండగా కొన్నింటికీ అనుమతులు లేకుండానే కొనసాగుతుండడం విడ్డూరం...కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రతి ల్యాబ్‌లోనూ అనుమతించిన పరీక్షలే జరుపాల్సి ఉంటుంది. అలాంటిది ఏకంగా అనుమతులు లేకుండానే ల్యాబ్‌లు కొనసాగుతున్న వైనమిది. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలు అమలు ఈ ల్యాబ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే పరిగి పట్టణంలో 8 ప్రైవేట్‌ ల్యాబ్‌లు కొనసాగుతున్నాయి. వాటిలో 3 ల్యాబ్‌లకు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులు ఉండగా, 5 ల్యాబ్‌లకు ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగిస్తుండడం గమనార్హం. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వినిపిస్తున్నాయి. కనీసం ల్యాబ్‌లు నడుపుకునేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోకుండానే ఇటీవల ఓ ల్యాబ్‌ ప్రారంభించడం జరిగింది. 

దరఖాస్తు చేసుకోని ల్యాబ్‌లు...

ల్యాబ్‌ ఏర్పాటు చేసుకున్న తర్వాత సంబంధిత ల్యాబ్‌ల యాజమాన్యలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. తమ దగ్గర పనిచేసే టెక్నీషియన్స్‌, విద్యార్హతలతతో కూడిన వివరాలను జతపరుస్తూ దరఖాస్తు అందజేయాలి. అనంతరం జిల్లా స్థాయిలోని ఓ ఉన్నతాధికారుల కమిటీ ల్యాబ్‌లు సందర్శించి, వారు సమర్పించిన టెక్నీషియన్ల సర్టిఫికెట్లు ఒరిజినలేనా అని పరిశీలించడంతోపాటు, ల్యాబ్‌లో సదుపాయాలు పరిశీలిస్తారు. అన్నీ సజావుగా ఉంటే వెంటనే అనుమతులు మంజూరు చేస్తారు. ఒకసారి అనుమతులు తీసుకుంటే ఐదేండ్ల కాలపరిమితి వరకు ల్యాబ్‌లు కొనసాగించవచ్చు. అందుకు ల్యాబ్‌ల యాజమాన్యులు చెల్లించాల్సిన ఫీజు సైతం తక్కువగానే ఉంటుంది. వారి ఒకరోజు ఆదాయమంతా కూడా ఉండదు. అలాంటిది ల్యాబ్‌లకు అనుమతుల కోసం సంబంధిత వ్యక్తులు దరఖాస్తు చేసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 

నిబంధనలు గాలికి...

ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను కొన్ని ల్యాబ్‌లు అసలు పాటించడం లేదు. ప్రస్తుత కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, ఫేస్‌షీట్‌లు ధరించాలి. హ్యాండ్‌ శానిటైజర్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ల్యాబ్‌లను శానిటైజషన్‌ చేస్తుండాలి. కానీ కొన్ని ల్యాబ్‌లు ఈ నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు ప్రతి ల్యాబ్‌లో పరీక్షల అనంతరం అందజేసే రిపోర్ట్‌పై తమ అభిప్రాయం తెలియజేస్తూ ఓ ఎంబీబీఎస్‌ వైద్యుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో డాక్టర్‌తో సంబంధిత ల్యాబ్‌ యాజమాన్యులు ఒప్పందం చేసుకోవాలి. పరిగిలోని ల్యాబ్‌ల వారు అందజేసే రిపోర్ట్‌పై డాక్టర్ల సంతకాలు ఎక్కడా ఉండవు. మరోవైపు స్కానింగ్‌, ఎక్స్‌రేలపై తప్పనిసరిగా రేడియాలజిస్ట్‌ల సంతకాలు ఉండాలి. అలాంటివి చాలావరకు ల్యాబ్‌లు అందజేసే రిపోర్ట్‌లపై కనిపించవు. ల్యాబ్‌ల యాజమాన్యులే సంతకాలు చేసి ఇస్తుండడం గమనార్హం. ఇదిలావుండగా కొన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలకు నిర్ణయించిన కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం గమనార్హం. డెంగీ వంటి పరీక్షలకు ఇతర ప్రాంతాలతో పోలిస్తే పరిగిలోనే అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రతి చిన్న వ్యాధికి డాక్టర్లు సైతం పరీక్షలు చేయించాలని రాస్తుండడంతో వారు వసూలు చేస్తున్నదే లెక్కగా మారింది. 

ల్యాబ్‌ల వివరాలు సేకరించాం..

పరిగి మున్సిపల్‌ అధికారులతో సమన్వయం చేసుకోని, పట్టణం లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ల్యాబ్‌ల వివరాలు సేకరించాం. పట్టణంలోని ఐదు ల్యాబ్‌లకు ఎలాంటి అనుమతులు లేవు. వాటికి త్వరలోనే నోటీసులు జారీ చేయడం జరుగుతున్నది. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ల్యాబ్‌లపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సైతం నివేదిక ఇవ్వడం జరిగింది. 

 - డాక్టర్‌ సత్యనారాయణమూర్తి   (చిట్యాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)


logo