ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 12, 2020 , 00:26:36

చేతినిండా పని..

చేతినిండా పని..

  • ఈ ఏడాది 85.93 లక్షల పనిదినాలు లక్ష్యం
  • ఇప్పటి వరకు 63.41 లక్షలు పూర్తి
  • 4,222 కుటుంబాలకు వంద రోజుల పని
  • వలస కూలీలకూ ఉపాధి చూపుతున్న అధికారులు
  • జిల్లా వ్యాప్తంగా 1,77,941 జాబ్‌కార్డులుండగా.. 
  • 3,94,208 మంది ఉపాధి హామీ కూలీలు

చేతినిండా పని.. సరిపడా డబ్బులు.. కష్టకాలంలో పేదలకు పని కల్పిస్తూ ఆదుకుంటున్నది ఉపాధి హామీ పథకం.. ఈ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసి రాష్ట్రంలోనే వికారాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించాలనే లక్ష్యంగా యంత్రాంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు జిల్లాలో ఒక్కో కుటుంబానికి 50.14 రోజులు పని కల్పించారు. వంద రోజుల పని కల్పించడంలో కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలువగా, వికారాబాద్‌ మూడో స్థానంలో ఉంది. వలస కూలీలకూ ఉపాధి చూపడంలో జిల్లా అధికారులు చురుకుగా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూనే కూలీలకు పని కల్పిస్తున్నారు 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో జిల్లా దూసుకుపోతున్నది. గతేడాదితో పోలిస్తే పనిదినాలు, ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగడంతోపాటు అన్ని జిల్లాలతో పోలిస్తే జిల్లా మెరుగైన స్థానంలో ఉన్నది. ఉపాధి హామీ కూలీలకు పనిదినాల కల్పనలో మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లా ఉండగా, రెండో స్థానంలో జిల్లా నిలిచింది. అదేవిధంగా ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్న ఒక్కో కుటుంబానికి సాధారణంగా కల్పించిన పనిదినాలను పోలిస్తే రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు జిల్లాలోని ఒక్కో ఉపాధి కూలీ కుటుంబానికి 50.14 రోజుల పనిదినాలను కల్పించడం గమనార్హం.

అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఉపాధి హామీ పనులకు సంబంధించి 85.93 లక్షల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 85 శాతానికిపైగా పనిదినాలను కూలీలకు కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా, వంద రోజుల పని కల్పించడంలో కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో నిలువగా, జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం కరోనా విజృంభణతో మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలతోపాటు హైదరాబాద్‌కు వలసవెళ్లిన వారంతా తిరిగి గ్రామాల్లోకి రావడంతో వారందరికీ కొత్తగా జాబ్‌కార్డులు జారీ చేసి ఉపాధి కల్పించారు. అదేవిధంగా జిల్లాలో 1,77,941 జాబ్‌కార్డులుండగా.. 3,94,208 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉపాధి కూలీలందరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంతోపాటు పని చేసే స్థలం వద్ద ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకుగాను సబ్బులు, నీటిని అందుబాటులో ఉంచడంతోపాటు కూలీలందరికీ మాస్కులను కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం పంపిణీ చేసింది.

4,222 కుటుంబాలకు వందరోజుల పని 

ఈ ఆర్థిక సంవత్సరం జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పనిని కల్పించడంలో జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 14,502 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించి కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, 5401 కుటుంబాలకు పనికల్పించి రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో, 4,222 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించి జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న కుటుంబాల్లో అత్యధికంగా ధారూరు మండలంలో 567 కుటుంబాలు, నవాబుపేటలో 457, మర్పల్లిలో 452, వికారాబాద్‌లో 328, పెద్దేముల్‌లో 261, కొడంగల్‌ మండలంలో 227 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రస్తుతం తెలంగాణకు హరితహారం, పల్లెకో ప్రకృతి వనం, కల్లాలు, ఇంకుడు గుంతల నిర్మాణం పనులను ప్రధానంగా చేపడుతున్నారు.

అంతేకాకుండా అసైన్డ్‌ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదును చేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు అసైన్డ్‌ భూముల్లో చేపట్టనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, పశువుల మేత పెంపకం, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట నూర్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ కాలువల్లో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. 

63.41 లక్షల పనిదినాల కల్పన..

ఈ ఆర్థిక సంవత్సరానికిగాను 85.93 లక్షల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌గా నిర్ణయించగా ఇప్పటివరకు 63.41 లక్షల పనిదినాలను కల్పించారు. కుల్కచర్ల మండలంలో అత్యధికంగా 4.48 లక్షల పనిదినాలను, ధారూరులో 4.44 లక్షలు, మర్పల్లిలో 4.28 లక్షలు, పెద్దేముల్‌లో 4.24 లక్షలు, బషీరాబాద్‌ మండలంలో 4.02 లక్షల పనిదినాలను కల్పించారు. ఈ ఏడాది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఉపాధి హామీ పథకంలో భాగంగా పూర్తైన పనులకుగాను ఈ ఏడాది ఇప్పటివరకు రూ.97.97 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు.

కుల్కచర్ల మండలంలో ఉపాధి పనులకు హాజరైన 15,800 మంది కూలీలకుగాను రూ.9.23 కోట్లు, మర్పల్లిలో 15,345 మందికి రూ.8.32 కోట్లు, వికారాబాద్‌లో 10,019 మందికి రూ.6.96 కోట్లు, పెద్దేముల్‌లో 14,627 మందికి రూ.6.67 కోట్లు, నవాబుపేటలో 11,571 మందికి రూ.6.36 కోట్లు, కుల్కచర్ల మండలంలో 15,413 మంది కూలీలకుగాను రూ.6.31 కోట్ల చెల్లింపులను ఇప్పటివరకు పూర్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఒక్కో కూలీకి రోజువారీగా రూ.237 కూలీ చెల్లిస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. రోజుకు 10 వేల వరకు కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. 

అర్హులందరికీ పని కల్పిస్తాం

జిల్లాలో అర్హులైన వారందరికీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తిరిగి వచ్చిన వారికి కూడా ఉపాధి హామీ జాబ్‌కార్డులు జారీ చేసి, ఉపాధి కల్పిస్తున్నాం. ప్రస్తుతం హరితహారం, కల్లాలు, పల్లెకో ప్రకృతివనం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ఉపాధి హామీ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతాం. 

 కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 


logo