మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 10, 2020 , 23:45:27

వంతెనలు పూర్తికాక అవస్థలు

వంతెనలు పూర్తికాక అవస్థలు

  • వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్లు
  •  రెండు సంవత్సరాలుగా ముందుకు సాగని పనులు
  • ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు

వికారాబాద్‌ రూరల్‌ : వికారాబాద్‌ నుంచి వయా సిద్దులూరు గ్రామం మీదుగా హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో రోడ్డు మరమ్మతుల్లో భాగంగా రూ. 4.5కోట్ల నిధులతో మూడు వంతెనలు నిర్మిస్తున్నారు. రెండు వంతెనల నిర్మాణాల పనులు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు ప్రారంభించిన సమయంలో నిర్మాణ పనులు చురుగ్గా సాగినా సంవత్సర కాలంగా పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో భారీ వాహనాలు, ఆటోలు, కార్లు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు వేయడంతో వర్షాలు ప్రారంభమైన నాటినుంచి మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాత్కాలిక రోడ్లు కూడా దెబ్బతినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం, పదిరోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెబుతున్న అధికారులు ఇంతవరకూ పనులు ప్రారంభించలేదు. గుత్తేదారు నాకెందుకులే అన్నట్లుగా మొండికేసుకొని కూర్చున్నాడు. 

సంవత్సర కాలంగా ఇబ్బందులు: అంజయ్య, సిద్దులూరు సర్పంచ్‌

కొటాలగూడ, సిద్దులూరు గ్రామాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న వంతెన పనులు పూర్తికాక సంవత్సర కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులకు విన్నవించినప్పుడల్లా పనులు ప్రారంభిస్తామంటున్నారు. కానీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. వర్షం కురిసిందంటే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. త్వరగా పనులు పూర్తి చేస్తే బాగుంటుంది.

కరోనా వల్లే పనులు ఆలస్యం : లక్ష్మీరారాయణ,ఏఈ

పనులు ప్రారంభమైన సమయంలో నిధుల కొరత ఉండేది. జనవరి, ఫిబ్రవరి మాసంలో నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించాలని గుత్తేదారుకు పదేపదే వివరిస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల కూలీల కొరత ఏర్పడింది. త్వరలో పనులు ప్రారంభించేలా చూస్తాం.


logo