మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 10, 2020 , 23:33:05

పరిశుభ్రతతోనే దోమల నివారణ

పరిశుభ్రతతోనే దోమల నివారణ

  • జిల్లాలో 15 డెంగీ, 4 మలేరియా, 1 మెదడువాపు కేసులు నమోదు
  • ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలి
  • జిల్లా సహాయ మలేరియా అధికారి వై.గంగప్ప

కొడంగల్‌: డెంగీ కేసులు నమోదవుతున్నాయంటే పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే కారణమని జిల్లా సహాయ మలేరియా అధికారి వై.గంగప్ప పేర్కొన్నారు.  శుక్రవారం ఫ్రైడే.. డ్రైడే సందర్భంగా పట్టణ, మండలంలో నిర్వహిస్తున్న దోమల నివారణ చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మలేరియా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సుధాకర్‌ షిండే ఆదేశానుసారంగా పర్యటించి, దోమల నివారణ చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంటిలో నీటి నిల్వల కోసం ఏర్పాటు చేసుకున్న తొట్టీలు, పూల కుండీలు తదితర పరికరాల్లో వారం కంటే అధిక రోజులు నీటి నిల్వలు ఉంటే ఎడిస్‌ దోమ వృద్ధి చెందుతుందని, దీని కాటువల్ల డెంగీ వ్యాధి సోకుతుందని తెలిపారు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

జిల్లాలో 15 డెంగీ కేసులు          

నీటి నిల్వ పరికరాల్లోనే డెంగీ అర్బో వైరస్‌ వృద్ధి చెందుతుందని, గతేడాదిలో జిల్లాలో 6 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 15 డెంగీ, 4 మలేరియా, 1 మెదడువాపు కేసులు నమోదయ్యాయన్నారు. తాండూరు సబ్‌ యూనిట్‌ పరిధిలోని జిన్గుర్తి, యాలాల మండలాల్లో అధికంగా ఉన్నాయని, కొడంగల్‌ నియోజవర్గంలోని బొంరాస్‌పేట మండలంలో దుద్యాల, కొత్తూర్‌ గ్రామాల్లో 2 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

దోమల నివారణకు మస్కిటో యాప్‌..

దోమలు పుట్టకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. దోమ కుట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమతెర, ప్రతిరోజూ సాయంత్రం ఇంటి తలుపులు కిటికీలను మూసేయడంతో పాటు వేపాకు పొగ వేసుకుంటే దోమలను నివారించవచ్చన్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో ప్లేస్టోర్‌ ద్వారా మస్కిటో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఈ యాప్‌లో వచ్చే శబ్ధం వల్ల దోమలు దూరంగా పారిపోతాయని తెలిపారు. దోమ లార్వా నివారణకు టిమిఫాస్‌ మందును పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పైలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి విజయ్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ స్వరూప్‌సింగ్‌, ల్యాబ్‌ టెక్నీషన్‌ ప్రభు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo