సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 10, 2020 , 23:19:09

ప‌ల్లెల‌కు ప‌చ్చందాలు..

ప‌ల్లెల‌కు ప‌చ్చందాలు..

  • జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో రూరల్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు
  • నెలాఖరులోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు
  • ప్రతీ పార్కులో 4 వేల మొక్కలు నాటాలని నిర్ణయం
  • ఇప్పటివరకు 315 గ్రామ పంచాయతీల్లో స్థలాలు గుర్తింపు
  • మిగిలిన చోట్ల  స్థలాలను గుర్తించే పనిలో అధికారులు

పల్లెల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిపల్లెలో ప్రకృతివనాలను ఏర్పాటు చేసేందుకు   సన్నాహాలు చేస్తున్నది. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 566 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో  315 చోట్ల రూరల్‌ పార్కుల కోసం స్థలాన్ని కేటాయించారు. మిగిలిన చోట్ల రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దోమ మండలంలో  ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉపాధి హామీకి అనుసంధానం చేసి వీటిని పూర్తి చేయనున్నారు. ఒక్కొక్క అర్బన్‌ పార్కులో నాలుగు వేల మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి రూ.9లక్షలు కేటాయించారు. మూడు వరుసల్లో మొక్కలు నాటి మధ్యలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. నెలాఖరులో ఈ  ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు డీఆర్‌డీవో కృష్ణన్‌ తెలిపారు. ఈ పార్కులతో ప్రతి పల్లె పచ్చందాలను సంతరించుకోనున్నది.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రతీ పల్లెను పచ్చని వనంలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే హరితహారంలో భాగంగా ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. కాగా ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక రూరల్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పల్లెప్రగతి కార్యక్రమంలో జిల్లాలోని 566 పంచాయతీల్లో రూరల్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. అంతేకాకుండా బుధవారం నుంచి రూరల్‌ పార్కుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. రూరల్‌ పార్కులను జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో కొనసాగించనున్నారు. కూలీలకు ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాలను ఆకు పచ్చని పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఒక్కో పార్కు ఏర్పాటుకు రూ.9 లక్షలు

గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేలా ప్రతీ పంచాయతీలో రూరల్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే జిల్లాలోని 566 పంచాయతీల్లో 315లో రూరల్‌ పార్కులకు స్థలాలను  గుర్తించారు. మరో 251 పంచాయతీల్లో రెండు, మూడు రోజుల్లో స్థలాలు గుర్తించనున్నారు.  ఒకవేళ పంచాయతీల్లో పార్కులకు అనువైన స్థలం లేకుంటే ఆయా గ్రామాల్లోని అనువైన స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎకరా స్థలంలో రూరల్‌ పార్కును అభివృద్ధి చేసి, అందులో నాలుగు వేల మొక్కలు నాటనున్నారు. పార్కులో మొక్కలు, వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేయనున్నారు. మూడు వరుసల్లో వివిధ రకాల మొక్కలు నాటనున్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక్కో పార్కుకు రూ.9 లక్షలు ఖర్చు చేయనున్నది. దోమ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పార్కుల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వికారాబాద్‌ మండలంలోని పలు పంచాయతీల్లోనూ పార్కుల పనులు షురు అయ్యాయి. పల్లె ప్రకృతి వనాల్లో పొడువు జాతి, చిన్న జాతి మొక్కలతోపాటు ఔషధ మొక్కలు నాటనున్నారు. చివరి వరుసలో పొడువు జాతి, వేప, ఇప్పా, నెరపి, గంధం, ఎర్ర కలప, టేకు, కుంకుడు, ఉసిరి, మారేడు, చింత, పనస, సీమచింత, నెమలినార మొక్కలు పెంచనున్నారు. మధ్య వరుసలో సాధారణ సైజులాంటి ఈత, జీలుగ, మెహందీ, సీతాఫల్‌, జామ, దానిమ్మ, కరివేపాకు, నిమ్మ, తాటి, మల్బరీ, వెదురు, జమ్మి మొక్కలు నాటుతారు. వాకింగ్‌ ట్రాక్‌కు సమీపంలో తంగేడు, అద్దసారం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి, గుగ్గల్‌, పెద్దనిమ్మ మొక్కలు పెంచనున్నారు. మూడు వరుసల్లో మొక్కలు నాటిన అనంతరం మధ్యలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్‌ ట్రాక్‌ను ఎస్‌ లేదా గుండ్రని ఆకారంలో ఆయా పంచాయతీల్లోని స్థలాన్ని బట్టి నిర్మించనున్నారు.  పార్కు  చుట్టూ గచ్చకాయ, మెహందీ, కిత్తలి, కాక్టస్‌ తదితర మొక్కలు నాటనున్నారు. ప్రతీ పంచాయతీకి కేటాయించిన 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ నుంచి ప్రకృతి వనాలకు ఖర్చు చేయనున్నారు. 

ఈనెలాఖరులోగా వనాలు: డీఆర్‌డీవో కృష్ణన్‌

ఈనెలాఖరులోగా జిల్లాలోని ప్రతి పంచాయతీలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే మెజార్టీ గ్రామాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. త్వరలో మిగతా గ్రామాల్లోనూ స్థలాలు గుర్తిస్తామన్నారు. 
logo