మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 10, 2020 , 00:27:50

ముల్లెసర్దుకుని పల్లెకొస్తున్నరు

ముల్లెసర్దుకుని పల్లెకొస్తున్నరు

  • కరోనా ప్రభావంతో వలస కార్మికులు సొంతూళ్లకు..
  • పట్నం నుంచి స్వగ్రామాలకు వంద కుటుంబాలు
  • ఊరిలోనే ఉపాధి పొందుతున్న ఉద్యోగులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : పలు ప్రాంతాలకు  వలస వెళ్లిన వారంతా కరోనా విజృంభిస్తుండడంతో పల్లెబాట పట్టారు. బతుకుదెరువుకై వలసవెళ్లిన దాదాపు వంద కుటుంబాలు జిల్లాలో సొంతూళ్లకు చేరుకున్నారు. నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో సొంత ఊర్లకు తరలివస్తున్నారు. తమ కుటుంబాలను వదిలి వలసవెళ్లిన వారంతా పల్లెటూర్లకు వస్తుంటే ఆయా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు కొందరు తిరిగిరాగా, 10-15రోజులుగా పట్నం నుంచి తిరిగి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఒకప్పుడు తమ పొలాలను కౌలుకు ఇచ్చి వలస వెళ్లినవారంతా తిరిగి పొలంబాట పట్టారు. సొంత వ్యవసాయ భూమి ఉన్నోళ్లు సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా నియంత్రిత సాగు ప్రకారం ఆయా పంటలను సాగు చేసుకుంటుండగా, ఇంకొందరు తల్లిదండ్రులకు పొలం పనుల్లో తోడుగా నిలుస్తున్నారు. భూమిలేని మరికొంత మంది ఇతరుల పొలాలకు కూలీకి వెళ్తుండడంతో, ఉపాధి హామీ పనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతున్నారు.

జిల్లాకు తిరిగొచ్చిన వంద కుటుంబాలు..

హైదరాబాద్‌కు వలసవెళ్లిన వారిలో దాదాపు వంద కుటుంబాల వరకు జిల్లాకు తిరిగొచ్చారు. జిల్లాలోని పూడూరు, మోమిన్‌పేట్‌, నవాబుపేట, ధారూర్‌, పెద్దేముల్‌ తదితర మండలాలకు చెందిన వారు పట్నం నుంచి సొంతూళ్లకు వచ్చారు. వారికి హైదరాబాద్‌లో జీవనోపాధి ఉన్నప్పటికీ ఒక్క కరోనా విజృంభణతోనే బతికుంటే బలుసాకు తినొచ్చనే ఆలోచనతో పల్లెటూర్లలో ఉన్న కన్నవారి వైపు కదలివస్తున్నారు. ఆటో నడిపించి జీవనోపాధి పొందేవారు మొదలుకొని కారు డ్రైవర్లు, ప్రైవేట్‌ లెక్చరర్లు, టీచర్లు, షాపింగ్‌ మాల్స్‌లో పనిచేసేవారు.. ఇలా అందరూ తిరిగొస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా పోయేవరకు మా ఊళ్లలోనే ఉండి పొలం పనులు చేసుకుంటామంటున్నారు తిరిగొచ్చిన ప్రజలు. కొందరు పట్టణంలోనే ఉండాలనుకున్నప్పటికీ అద్దెకున్న ఇంటి యజమానులు కరోనా వైరస్‌ భయంతో బలవంతంగా ఖాళీ చేయిస్తుండడం కూడా గ్రామాలకు తిరిగి రావడానికి కారణమని చెబుతున్నారు. ఏదేమైనా బ్రతుకుదెరువుకు వెళ్లిన వారంతా తిరిగి గ్రామాలకు వచ్చి పొలం బాట పట్టారు.

ఉద్యోగాలు వదిలి...

నగరంలోని మోమిన్‌పేట్‌ మండలం రామ్‌నాథ్‌గుడుపల్లి చెందిన మోహిద్‌ అనే వ్యక్తి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కరోనా విజృంభణతో సొంతూరికి వచ్చి వారికి ఉన్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. అదే విధంగా అదే గ్రామానికి చెందిన నవీన్‌కుమార్‌ అమీర్‌పేట్‌లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో పనిచేసేవాడు, లాక్‌డౌన్‌ ప్రారంభంలోనే ఇంటికి వచ్చి కుటుంబానికి చేదోడుగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హాజీ తాపీమేస్త్రీగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కరోనా విజృంభణతో కుటుంబంతో వచ్చి సొంతూరిలో వ్యవసాయం చేస్తున్నాడు.

కార్పెంటర్‌గా పని చేసేటోన్ని..

కొన్నేండ్లుగా హైదరాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాను. కరోనా కారణంగా మూడు నెలల క్రితం తిరిగి సొంతూరికి కుటుంబంతో సహా వచ్చేశాం. ఇన్నేండ్లు కౌలుకు ఇచ్చిన మాకున్న 4 ఎకరాల పొలంలో మేమే సాగు చేసుకుంటున్నాం. పత్తితో పాటు స్వీట్‌కార్న్‌ పంటలను వేశాం.

- అయూబ్‌ఖాన్‌, చన్గోముల్‌, పూడూర్‌ మండలం

డెలివరీబాయ్‌గా పనిచేసే వాడిని..

నాంపల్లిలోని ఓ స్టోర్‌ నుంచి వివిధ ప్రాంతాలకు నాకున్న ఆటోలో సామగ్రిని డెలివరీ చేసేవాడిని. నెలకు రూ.15వేల వరకు జీతం ఇచ్చేవారు. కరోనా నేపథ్యంలో పని దొరుకక సొంతూరికి కుటుంబ సభ్యులతో వచ్చాను. అదేవిధంగా మాకున్న 2ఎకరాల పొలంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నా.

- రమేశ్‌, ఎన్కతల, మోమిన్‌పేట్‌


logo