శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jul 07, 2020 , 23:33:39

కొత్త కలెక్టరేట్‌ సిద్ధం

కొత్త కలెక్టరేట్‌ సిద్ధం

  • వచ్చే నెలలో నూతన కలెక్టరేట్‌లోకి.!
  •  ఆగస్టులో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ అప్పగింత
  • పూర్తైన నిర్మాణ పనులు
  • ప్రస్తుతం కొనసాగుతున్న ఎలక్ట్రికల్‌ పనులు
  • 33 ఎకరాల్లో కలెక్టరేట్‌తో పాటు అధికారుల నివాస సముదాయాలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌ జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యిం ది. వచ్చే నెలలో అన్ని శాఖల జిల్లా కార్యాలయాలన్ని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లోకి వెళ్లనున్నాయి. సిద్ధిపేట జిల్లా నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన అనంతరం జిల్లా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే నూతన కలెక్టరేట్‌లోకి కొత్త ఫర్నిచర్‌ కొనుగోలుకై ఆర్డర్‌ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా జిల్లా శాశ్వత కలెక్టరేట్‌ నిర్మాణానికి సంబంధించి పను లు పూర్తయ్యాయి. 

జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తికాగా విద్యుత్తు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెలలో అప్పగించేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు వేగవంతం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌తోపాటు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో, నలుగురు జిల్లాస్థాయి అధికారుల నివాస సముదాయాల నిర్మాణాలు కూడా దాదాపు పూర్తికాగా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను భృంగి స్కూల్‌ ఎదురుగా ఉన్న 47.38 ఎకరాల అసైన్డ్‌ భూమిలో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాస సముదాయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం 33 ఎకరాల్లో కలెక్టరేట్‌తోపాటు అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సంబంధిత అసైన్డ్‌ భూముల్లోని 22 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, మిగతా 11 ఎకరాల్లో అధికారుల నివాస సముదాయాలను నిర్మించారు. అదేవిధంగా కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్ల నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.

వచ్చే నెలలో అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌...

వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. భృంగి స్కూల్‌ ఎదురుగా ఉన్న అసైన్డ్‌ భూమిలో కలెక్టరేట్‌ నిర్మాణ పనులను ఎస్‌ అండ్‌ పి కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు సంబంధించిన వారు శరవేగంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్‌ నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాన పనులు పూర్తి కావడంతోపాటు టైల్స్‌ వేయడం పూర్తికాగా విద్యుత్తు పనులు, ప్లంబింగ్‌, ట్యాంకుల నిర్మాణం, శానిటేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నట్లు గా ఒక్కో శాఖ కార్యాలయం ఒక్కో ప్రాంతంలో కాకుండా జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయాలతోపాటు అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేవిధంగా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను నిర్మించారు. 

పోలీస్‌ శాఖ, అగ్నిమాపక శాఖ మినహా మిగ తా అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మించడంతో పాటు హెలిప్యాడ్‌, వెయ్యి సీట్లతో కూడిన సమావేశ మంది రం, వాకింగ్‌ ట్రాక్‌, బ్యాంక్‌ ఏటీఎంలు, మీ సేవా కేంద్రాలు ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను నిర్మించారు. అదేవిధంగా పాలన సమర్థవంతంగా జరుగాలంటే పాలనకు, ప్రజలకు సౌకర్యవంతమైన కార్యాలయాలు అవసరం కాబట్టి అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతమున్న కార్యాలయాల మాదిరిలా కాకుండా అధికారులు, ఉద్యోగులతోపాటు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల కోసం కూడా క్యాంటీన్లు, టాయిలెట్లు ఏర్పా టు చేశారు. అంతేకాకుండా లంచ్‌ రూంతోపాటు రికార్డు రూం, స్ట్రాంగ్‌రూం, విద్యుత్తు సబ్‌స్టేషన్‌, జనరేటర్‌, యానిమల్‌ ట్రా ప్స్‌ ఉండేలా నిర్మించారు. 

సీఎం, మంత్రులు జిల్లాల పర్యటన సందర్భంగా సమీక్షా సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి.. ఇలా అన్ని సమావేశాలకు వీలుగా ఉండేందుకుగాను వెయ్యి మంది కూర్చునేలా కాన్ఫరెన్స్‌ హాల్‌ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో ఉండనుంది. ప్రాంగణంలో పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్‌ స్కేపింగ్‌, వాకింగ్‌ ట్రాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సమీకృత కలెక్టరేట్‌తోపాటు జిల్లా పరిషత్‌ భవనాన్ని కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలను పంపినప్పటికీ ప్రస్తుతానికి సంబంధిత స్థలంలో కలెక్టరేట్‌, అధికారుల నివాస సముదాయాలకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

కలెక్టరేట్‌ పనులు పూర్తయ్యాయి

శాశ్వత కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తికాగా చిన్న, చిన్న పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్‌, శానిటేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తయినందున వచ్చే నెలలో ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ప్రభు త్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా సమీకృత కలెక్టరేట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.

- జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌


logo