సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 06, 2020 , 23:49:06

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

  • నిర్లక్ష్యం వీడాలి
  •  అక్రమ కట్టడాలపై కఠినంగా ఉండండి
  •  హరితహారం, పార్కుల అభివృద్ధికిపై 
  • ప్రత్యేక దృష్టి పెట్టాలి
  •  పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
  •  వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు 
  •  తాండూరులో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్‌

తాండూరు టౌన్‌ : అభివృద్ధి పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలెక్టర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి సుదీర్ఘంగా పర్యటించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌ లో అక్రమ కట్టడాలను పరిశీలించారు. విజయనగ ర్‌ కాలనీలో నర్సరీ ఏర్పాటు చేసే పార్కులో పర్యటించారు. కాలనీలో ఉన్న సమస్యలను కౌన్సిలర్‌, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని పటేల్‌కుంట శిఖం భూములను పరిశీలించారు. అక్కడ శ్మశానవాటికతో పాటు ఇతర నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శిఖం భూముల్లో చేపట్టిన నిర్మాణాలపై నివేదిక అందజేయాలని కలెక్టర్‌ తాసిల్దార్‌ చిన్నప్పలనాయుడును ఆదేశించారు. ఎన్టీఆర్‌నగర్‌, పటేల్‌కుంటలో అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వైట్‌ఫీల్డ్‌, ఇందిరానగర్‌లోని పార్కులను పరిశీలించారు. పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారాన్ని తూతూ మంత్రం గా చేపట్టరాదని, లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షించాలని కౌన్సిలర్లు, అధికారులకు సూచించారు. అక్కడి నుంచి పట్టణంలోని రైతుబజార్‌ వద్దకు చేరుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట, రోడ్లపై వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తుండంతో రైతుబజార్‌ నిరుపయోగంగా మారుతున్నదని కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప నర్సింహులు, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌తో కలిసి షీ టాయిలెట్‌ నిర్మాణ పనులను, మరోవైపు రైల్వేస్టేషన్‌ సమీపంలో నిర్మించబోయే షీ టాయిలెట్‌ స్థలాన్ని, అదేవిధంగా నిర్మాణంలో ఉన్న రోడ్డు విస్తరణ పనులను కూడా కలెక్టర్‌ పరిశీలించారు. రోడ్డు విస్తరణలో మురుగు కాలువ నిర్మాణం లేకపోవడంతో పాటు ఆక్రమణలను తొలగించకుండా పనులు చేపడుతుండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారాంపేట్‌ రోడ్డు మార్గంలో చేపట్టే సీసీ రోడ్డు, మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులపై ఆరా తీశారు. అక్కడి నుంచి గుమాస్తానగర్‌లో పర్యటించిన కలెక్టర్‌ రోడ్డు విస్తరణ పనుల్లో మురుగు కాలువలను ధ్వంసం చేసి ఇష్టారాజ్యంగా చేపట్టడంపై ఆర్‌అండ్‌బీ అధికారులపై మండిపడ్డారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్‌ డీఈ విద్యాసాగర్‌ ఉన్నారు.


        


logo