మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jul 07, 2020 , 00:06:04

ఊరూరా..ఈత వనాలు

ఊరూరా..ఈత వనాలు

  • టీఆర్‌ఎస్‌ హయాంలోనే కులవృత్తులకు ఆదరణ
  • హరితహారంలో ఈత, తాటి వనాలు పెంచుదాం...
  • ప్రతిగ్రామంలో వెయ్యి మొక్కలు  నాటుదాం..
  • నాలుగు వేల గ్రామాల్లో నాటేందుకు సన్నాహాలు 
  • నందిగామ మండలంలో మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

టీఆర్‌ఎస్‌ హయాంలోనే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.  హరితహారంలో భాగంగా  ఎంపీ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి,   ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లతో కలిసి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వెంకమ్మగూడ శివారు ప్రభుత్వ భూమిలో ఈతమొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో ఈత, తాటి వనాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3.7 కోట్ల మొక్కలు నాటామని అన్నారు. వీటి నుంచి తీసిన నీరాసేవిస్తే ఆరోగ్యానికి మంచిదన్నారు. మొదటి విడుతగా ఒక్కో గ్రామంలో వెయ్యి మొక్కలకు తగ్గకుండా నాలుగు వేల చోట్ల   నాటడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. హరితహారం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈత, తాటి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. -  కొత్తూరు/నందిగామ

కొత్తూరు/నందిగామ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే కులవృత్తులకు పూర్వవైభవం లభించిందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అన్ని కులాలకు ఉపాధి దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వెంకమ్మగూడ శివారులోని ప్రభుత్వ భూమిలో ఈతచెట్లు నాటే కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఊర్లో తాటి, ఈత వనాలను ఏర్పాటు చేసి ఒక ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రజలకు అందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారని మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు నీరా పానీయాన్ని  అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.7 కోట్ల ఈత, తాటి మొక్కలు నాటామని మంత్రి వివరించారు. ప్రతి ఊర్లో తాటి, ఈత వనాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని చెప్పారు. అందులో భాగంగా 4  వేల గ్రామాల్లో మొదటి విడుతగా 1000 చెట్లకు తక్కువ కాకుండా ఏర్పాటు చేస్తున్నామని..

అలాగే మూడేండ్లపాటు ప్రతి గ్రామ శివారులో ఈత, తాటి వనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత వనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. తాటి, ఈత  వనాల నుంచి తీసిన  నీరా సేవిస్తే బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటాయని, వాటితో పాటు 13 రోగాలకు చెక్‌పెట్టవచ్చని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.  కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఈత మొక్కలను నాటారు. కార్యక్రమంలో నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్‌, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, వెంకమ్మగూడ సర్పంచ్‌ రాజనీత, చేగూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ జిల్లా అధికారి ఖురేషీ, ఎక్సైజ్‌ శాఖ జిల్లా అధికారి రఘురాం, షాద్‌నగర్‌ ఎక్సైజ్‌ శాఖ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సునీత,  నందిగామ తాసిల్దార్‌ హైదర్‌అలీ, ఎంపీడీవో బాల్‌రెడ్డి పాల్గొన్నారు.logo