శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jul 06, 2020 , 00:57:56

సాయ‌మందే సాగుమురిసే

సాయ‌మందే సాగుమురిసే

  • రైతుబంధు డబ్బులు జమ చేసిన ప్రభుత్వం
  • వికారాబాద్‌ జిల్లా లో 2,24,954 మంది అన్నదాతలు  
  •  ఇప్పటివరకు 1,91,666 మంది ఖాతాల్లో రూ..269 కోట్లు జమ 
  • మరో 15 రోజుల్లో మిగతావారికీ అందించేందుకు చర్యలు
  • భూ పరిమితి, నియంత్రిత సాగుతో  సంబంధం లేకుండానే పంపిణీ
  • సంబురంగా ‘సాగు’తున్న  కర్షకులు

ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయంతో  పంటల సాగు సంబురంగా సాగుతున్నది.  చేతికి రైతుబంధు డబ్బులు అందడంతో అవసరమైన ఎరువులు, విత్తనాల కొనుగోలులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. వర్షాలు కూడా విస్తారంగా కురుస్తుండడంతో పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.  వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 2,24,954 మంది రైతులుండగా.. రైతుబంధు కోసం ప్రభుత్వం రూ.307కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు 1,91,666  రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.269కోట్లు జమ చేసింది. మిగిలిన రైతులకు బ్యాంకు ఖాతాల్లో మరో పదిహేను రోజుల్లో డబ్బులు జమ చేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మొదట నియంత్రిత సాగు ఆధారంగా ఆర్థిక సాయం అందించాలనుకున్నా..  పంటల సాగుకు రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో భూ పరిమితి,  నియంత్రిత సాగుతో సంబంధం లేకుండా సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ సంబంధితశాఖకు ఆదేశాలు జారీ చేశారు.  కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం  రైతుబంధు సాయం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం డబ్బులు రైతులకు అందడంతో సాగు పండుగలా సాగుతున్నది.  వానకాలానికి సంబంధించి నెల రోజుల క్రితమే నిధులు విడుదల కాగా.. పదిహేను రోజులుగా అధికారులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగిలో దాదాపు 2 లక్షలకుపైగా రైతులను అర్హులుగా  గుర్తించారు. వానకాలం పంటకు కొత్తగా పాసు పుస్తకాలు జారీ అయిన రైతులకు కూడా ప్రభుత్వం రైతుబంధుసాయం అందిస్తున్నది. కాగా, ఈ సీజన్‌కు రైతుబంధు పథకంలో భాగంగా జిల్లాకు రూ.307 కోట్లు విడుదల చేసింది. 

రూ.269 కోట్ల రైతుబంధు జమ...

జిల్లావ్యాప్తంగా 2,24,954 మంది రైతులు ఉన్నారు. ఇందులో 1,91,666 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ.269 కోట్లు జమ చేశారు.  ఇప్పటివరకు 2,02,981 మంది రైతులకు సంబంధించిన రూ.284 కోట్ల బిల్లులు జిల్లా ఖజనా శాఖకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరో పదిహేను రోజుల్లో మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపారు. డబ్బులు జమ చేసినప్పటికీ రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్‌  వివరాలు సరిగ్గా లేకపోవడంతో చాలావరకు చెల్లింపులు ఫెయిలైనట్లు అధికారులు వెల్లడించారు. 

రూ.1144 కోట్లు..

రైతుబంధు పథకం కింద జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని విడుతల్లో కలిపి రూ.1144 కోట్లను అందజేసింది. 2018 వానకాలం సీజన్‌లో చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా, 2018 యాసంగి సీజన్‌ నుంచి రైతులకు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. గతేడాది నుంచి రైతుబంధు కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 వానకాలం సీజన్‌లో 1,94,833 మంది రైతులకు రూ.220 కోట్లు,  యాసంగిలో 1,79,899 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానకాలం సీజన్‌లో 1,88,713 మంది రైతులకు రూ.255 కోట్లు, యాసంగి సీజన్‌లో 1,71,824 మంది రైతులకు రూ.194 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటివరకు 1,91,666 మంది రైతులకు రూ.269 కోట్ల రైతుబంధు సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 

అర్హులందరికీ రైతుబంధు సాయం..

అర్హులైన రైతులందరికీ రైతుబంధు సాయం జమ అవుతుంది. అయితే ఇప్పటికీ ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలను అందించని రైతులు ఆయా మండలాల వ్యవసాయాధికారులను సంప్రదించాలి. మరో పదిహేను రోజుల్లో పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ రైతుబంధు అందిస్తాం. ఈ ఏడాది కొత్తగా పాసు పుస్తకాలు జారీ అయిన రైతులకూ సాయం అందుతుంది.

-గోపాల్‌,  జిల్లా వ్యవసాయాధికారి 


 


logo