మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jul 05, 2020 , 00:23:24

అంగ‌న్‌వాడీలో స్మార్ట్ బోధ‌న‌

అంగ‌న్‌వాడీలో స్మార్ట్ బోధ‌న‌

  • ప్రత్యేక యాప్‌ను రూపొందించిన సర్కార్‌
  • బోధిస్తున్న తల్లిదండ్రులు 
  • ఆసక్తిగా వింటున్న చిన్నారులు
  • ఇంటి వద్దకే ఆటాపాట సామగ్రి

వికారాబాద్‌ టౌన్‌ : వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో 1106  అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 49,882 మంది చిన్నారులు ఉన్నారు. 5897 మంది గర్భిణులు ఉండగా, 4931 మంది బాలింతలు ఉన్నారు. జిల్లాలో 969 అంగన్‌వాడీ టీచర్లు, 969 మంది ఆయాలు అంగన్‌వాడీల్లో పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ కేంద్రాలను స్మార్ట్‌గా మార్చింది. అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్‌లను సైతం పంపిణీ చేసింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారానే చిన్నారులు, గర్భిణుల హాజరు, పౌష్టికాహారం పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లోకి చేర్చుతున్నారు. 

ప్రత్యేక యాప్‌తో తల్లిదండ్రులతో బోధన

ప్రభుత్వం అంగన్‌వాడీ పిల్లల కోసం icds.tgwdc.inpreschool అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంకా అంగన్‌వాడీ టీచర్లు తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరాలు, చిన్నచిన్న లెక్కలు, పొడుపు కథలు, రైమ్స్‌ను పిల్లల తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. వీటి ద్వారా చిన్నారుల తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లతో పిల్లలకు ఆటపాటలు నేర్పుతున్నారు. బొమ్మలతో రూపొందించినవి కావడంతో చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం రోజుకు 3 నుంచి 4 గంటలు తల్లిదండ్రులే గురువులుగా మారి బోధిస్తున్నారు. 

ఇంటి వద్దకే ఆట వస్తువులు, పౌష్టికాహారం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే సరుకులను అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మారుమూల గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. చిన్నారులకు బాలామృతం, 16 కోడిగుడ్లు, పాలు, మురుకులు వంటి సరుకులు అందిస్తున్నారు. ఇదివరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, అన్నం, పప్పు, పాలు అందించేవారు. ఆట వస్తువులను కూడా ఇంటి వద్దకు ఇస్తుండటంతో చిన్నారులు కూడా సరదాగా గడుపుతున్నారు. 

మహిళా, శిశు సంక్షేమ శాఖ చర్యలు 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రా్రష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో విద్యాలయాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలు కూడా మూతబడ్డాయి. పౌష్టికాహారాన్ని మాత్రం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అంగన్‌వాడీ టీచర్లు అందిస్తున్నారు. ఇదే సమయాన్ని చిన్నారులకు ప్రయోజనకరంగా మార్చడం కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి ఆరేండ్ల చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను వారి ఇండ్లలోనే అందించేందుకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. 

చిన్నారులకు అన్‌లైన్‌లోనే పాఠాలు..

కరోనా సమయంలో చిన్నారులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రత్యేక యాప్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా చిన్నారులకు వారి తల్లిదండ్రులు పాఠాలు బోధిస్తారు. కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, అన్నం, పప్పు, పాలు వారి ఇండ్ల వద్దకే అందిస్తున్నాం.

-విజయలక్ష్మి, సిద్దులూర్‌ అంగన్‌వాడీ టీచర్‌ 


చిన్నారులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ..

కరోనా నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికి వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రత్యేక యాప్‌ను రూపొందించి తల్లిదండ్రులతో  చిన్నారులకు బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.  అంగన్‌వాడీలో చిన్నారుల పేర్లను తప్పక నమోదు చేయాలి.

-లలితకుమారి, వికారాబాద్‌ జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి


logo