గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:56:50

మోడల్‌ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతాం

మోడల్‌ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతాం

ఆమనగల్లు : ఆమనగల్లులో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా అన్ని వసతులతో మోడల్‌ గ్రంథాలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందజేస్తామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గ్రంథాలయాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ రమణకుమార్‌ అన్నారు. బుధవారం ఆమనగల్లు గ్రంథాలయాన్ని వారు పరిశీలించారు. దశాబ్దాల కిత్రం నిర్మించిన గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, కొంతకాలంగా ఇన్‌చార్జి గ్రంథపాలకుడి నిర్వహణలో గ్రంథాలయం కొనసాగుతున్నదని పాఠకులు తెలిపారు. గదుల కొరత కారణంగా పుస్తకాల నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు పాఠకులు సమస్యలను విన్నవించారు. ఆమనగల్లు బ్లాక్‌ మండలాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయం నాడు నిత్యం పాఠకులతో కళకళలాడగా.. నేడు కళాహీనంగా తయారయిందని గ్రంథాలయాల సంస్థ మాజీ డైరెక్టర్‌ జంగయ్య ఎమ్మెల్సీకి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆమనగల్లు గ్రంథాలయం నూతన నిర్మాణానికి రూ.2కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు వచ్చాయని.. త్వరలోనే శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని కూల్చివేసి నూతన గ్రంథాలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. తొలిసారిగా గ్రంథాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీని, రాష్ట్ర డైరెక్టర్‌ను ఎంపీపీ అనిత, స్థానిక నాయకులు సత్కరించారు.logo