సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:47:52

ఘనంగా తొలి పూజలు

ఘనంగా తొలి పూజలు

కొడంగల్‌: తొలి ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అర్చకులు పూజలు చేశారు. ఆలయంలోని ఆస్థాన మండపంలో మహావిష్ణువుకు ఆధ్యాత్మిక ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. అనంతరం గోదాదేవి, శ్రీదేవి అమ్మవార్లకు పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో  అభిషేకం చేశారు.  కరోనా నేపథ్యంలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ఒక గంట పాటు నిర్వహించి ఆలయాన్ని మూసేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి పూజలు చేశారు. 

తాండురులో..

తాండూరు టౌన్‌: పట్టణంలో తొలి ఏకాదశిని భక్తిశ్రద్ధ్దలతో జరుపుకొన్నారు. మండలంలోని అంతారం అనుబంధ దస్తగిరిపేట్‌ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాండురంగ దేవాలయంలో రుక్మిణి విఠల్‌ స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.

ఆమనగల్లులో..

ఆమనగల్లు: పట్టణంలోని వేంకటేశ్వర ఆలయం, అయ్యసాగర్‌ క్షేత్రం, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు వేడుకలను పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా శానిటైజర్లను ఏర్పాటుచేశారు.


logo