గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:44:45

సిరిసిల్ల తరహాలో జిల్లా లైబ్రరీ

సిరిసిల్ల తరహాలో జిల్లా లైబ్రరీ

  • మోడల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నది  సీఎం  కేసీఆర్‌ ఆలోచన 
  • అన్ని నియోజక వర్గాల్లో ఏర్పాటు
  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 
  • గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం:  ఎంపీ రంజిత్‌రెడ్డి 
  • ఆధునిక హంగులతో ఏర్పాటు : రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితా రెడ్డి 
  • బడంగ్‌పేటలో రూ.4 కోట్లతో మోడల్‌ గ్రంథాలయాలు నిర్మాణానికి శంకుస్థాపన 

బడంగ్‌పేట: అర్బన్‌ ప్రాంతాల్లో మోడల్‌ గ్రంథాలయాల నిర్మాణం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని దావూద్‌ఖాన్‌గూడలో  చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య , టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ నాగేందర్‌గౌడ్‌, గ్రంథాలయ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డితో కలిసి గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నూతన హంగులతో మోడల్‌ గ్రంథాలయాన్ని ఏవిధం గా నిర్మించారో అదే తరహాలో  బడంగ్‌పేటలో నిర్మిస్తున్న ట్లు ఆమె తెలిపారు. రూ.4 కోట్లతో భవన నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌, విద్యార్థులు, మహిళలు, పిల్లలకు అనుకూలంగా ఉండేలా భవనం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండేదన్నా రు. జిల్లా పునర్విభజనతో ఇది నియోజక వర్గాలకు మధ్యలో ఉండాలని నిర్ణయించారన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. శంషాబాద్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లిలో మోడల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమన్నారు. పీవీ నరసింహారావు లాంటి వారు గ్రంథాలయాల్లోని పుస్తకాలు చదివి బహుభాషా కోవిదులయ్యారన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ సత్యబాబు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 


logo