ఆదివారం 05 జూలై 2020
Vikarabad - Jun 30, 2020 , 23:33:41

మాస్క్‌ ఉంటేనే ప్రయాణం

మాస్క్‌ ఉంటేనే ప్రయాణం

  • ఆటోవాలా ఐడియా అదుర్స్‌
  • ఆటోలోనే శానిటైజర్‌
  • ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ
  • అభినందిస్తున్న ప్రయాణికులు

షాద్‌నగర్‌రూరల్‌ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. పేద, మధ్య, ధనిక, చిన్న, పెద్ద, కుల, మత, ఉద్యోగ, రాజకీయ తారతమ్యం లేకుండా అందరినీ కరోనా వణికిస్తున్నది. కరోనా మహమ్మారి నియంత్రణకు మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మున్సిపల్‌ శాఖ పదేపదే చెబుతున్నా కొందరు పట్టించుకోవడంలేదు. దీంతో రోజురోజుకూ కరోనా తీవ్ర రూపం దాలుస్తున్నది. ఇదిలా ఉంటే ప్రజల ఆర్థిక పరిస్థితులను చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో లాక్‌డౌన్‌లో సడలింపు ఇచ్చింది. రవాణా, వ్యాపారాలు, ఇతర సముదాయాలు, తదితర వాటిపై ఆంక్షలను విధించింది. అయినా కొందరు కరోనా నియంత్రణ సూచనలను పట్టించుకోవడంలేదు. అన్ని వ్యాపార సముదాయాలు, హోటళ్ల వద్ద మాస్కులు ఉంటేనే అనుమతి అని బోర్డులు పెడుతున్నారే తప్ప కొనుగోలుదారులకు మాస్కులు లేకున్నా లాభార్జన కోసం విక్రయాలు జరుపుతున్నారు. కాని ఒక ఆటోవాలా మాత్రం తప్పనిసరిగా మాస్క్‌ ఉంటేనే రండి అని తన ఆటోకు బోర్డును ఏర్పాటు చేసి కఠినంగా అమలు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నాడు.

ఆదాయం ముఖ్యం కాదు.. 

ఆదాయం ముఖ్యం కాదు.. అందరి ఆరోగ్యం ముఖ్యం అని ఓ ఆటోవాలకు వచ్చిన ఐడియా అదుర్స్‌ అని ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు. చాలామంది అదే ఆటోకు ఫోన్‌ చేసి మరీ ప్రయా ణం కొనసాగిస్తున్నారు. ఆటోవాలా తనకు వచ్చిన ఐడియాతో ఆటోలో శానిటైజర్‌ను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా డ్రైవింగ్‌ సీట్‌ వెనుక భాగంలో జాలిని ఏర్పాటు చేసి కవర్‌ను కట్టాడు. ఆటోలో ప్రయాణించేవారు తప్పకుండా మాస్క్‌ను కలిగి ఉండాలని, ఆటోలోకి ఎక్కేటప్పుడు తప్పకుండా చేతులను శుభ్రపరిచేవిధంగా హ్యాండ్‌వాష్‌, వాటర్‌ను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ప్రయాణికులు దిగిన వెంటనే శానిటైజర్‌ను చల్లే విధంగా స్ప్రే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రయాణికుల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఐడియా అదుర్స్‌ అని ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు. 

అందరూ ఆరోగ్యంగా ఉండాలి : శివ, డ్రైవర్‌ 

జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకకుండా ఉంటుందని ప్రభుత్వం, వైద్యాధికారులు, పోలీసులు చెబుతున్నారు. లాభం ముఖ్యం కాదు, నాతోపాటు నా ఆటోలో ప్రయాణించేవారు ఆరోగ్యంగా ఉండాలనుకున్నాను. అందుకే రూ.3వేలతో ఆటోలో కరోనా నియంత్రణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. మాస్క్‌ ఉంటేనే అటోలో ఎక్కించుకుంటా. కేవలం ఇద్దరికి మాత్రమే ఆటోలో అనుమతి. ఆటోలో ఎక్కే సమయంలో చేతులను శుభ్రం చేసుకునే విధంగా హ్యాండ్‌వాష్‌ను ఏర్పాటు చేశా. నా సీట్‌ వెనుక భాగంలో జాలిని ఏర్పాటు చేసి కవరును కట్టా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కరోనా నియంత్రణను పాటిద్దాం.. కరోనాను తరిమికొడుదాం. 


logo