శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jun 30, 2020 , 22:58:54

ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌

ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌

  • నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు
  • గుంతలు తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే వరకు జియో ట్యాగింగ్‌
  • జిల్లాలో జోరందుకున్న తెలంగాణకు హరితహారం
  • ఇప్పటివరకు 3.45లక్షల మొక్కలు నాటడం పూర్తి
  • 2.70 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్‌
  • హరితహారంలో భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
  • జిల్లాలో 68.71 లక్షల మొక్కలు నాటడమే టార్గెట్‌

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మొక్కలను నాటిన అనంతరం విస్మరించకుండా నాటిన ప్రతి మొక్కను బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ ప్రక్రియ చేస్తున్నారు. అయితే హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన జియో ట్యాగింగ్‌ యాప్‌లో ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను పొందుపరుస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే మొక్కలు నాటుతారో అక్కడ నావిగేషన్‌తో మొక్కల ఫొటోలు తీసి, ప్రతి మొక్కకు ప్రత్యేకంగా నెంబర్‌ కేటాయించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. జియో ట్యాగింగ్‌ ప్రక్రియతో నాటిన మొక్క ఏ విధంగా ఉందనేది ఆన్‌లైన్‌ ఆధారంగా తెలుసుకోవచ్చు. 

జిల్లాలో ఇప్పటివరకు 2,70,904 మొక్కలకు జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్క కు ఇప్పటివరకు జియోట్యాగింగ్‌ పూర్తయింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 2,13, 903 మొక్కలకు, గనుల శాఖ 1800, గిరిజన సంక్షేమ శాఖ 500, ఉద్యాన శాఖ 7000, పరిశ్రమల శాఖ 1000, పోలీస్‌ శాఖ 400, వ్యవసాయ శాఖ 4500, ఎక్సైజ్‌ శాఖ 5140, విద్యాశాఖ 3500, అటవీ శాఖ ఆధ్వర్యంలో 33,161 మొక్కలకు జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. 

ఇప్పటివరకు 3.45 లక్షల మొక్కలు నాటడం పూర్తి...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరందుకుంది. ప్రజాప్రతినిధులు మొదలుకొని అధికారులు, ప్రజలు ఇలా అందరూ హరిత యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. హరితహారం కార్యక్రమం ప్రారంభమైన ఒకేరోజు లక్షకుపైగా మొక్కలను నాటిన జిల్లా యంత్రాంగం అదే జోరును కొనసాగిస్తున్నది. అదేవిధంగా వరుణుడు కూడా కరుణించడంతో మొక్కలు నాటే కార్యక్రమం ఊరూరా ఉద్యమంలా ఊపందుకుంది. గత రెండేండ్లు హరితహారం కార్యక్రమం ప్రారంభంలోనే వర్షాలు పడినా... తదనంతరం ముఖం చాటేయడంతో జిల్లా యంత్రాంగం నాటిన మొక్కల్లో కొంతమేర మొక్కలు మాత్రమే బతికాయి. అయితే ఈ ఏడాది వర్షాలు సరిగ్గా సమయానికి పడడంతోపాటు సంరక్షణకు చర్యలు చేపట్టడంతో జిల్లాలో నాటిన ప్రతి మొక్క బతుకుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటుతున్నారు. ఈ ఏడాది ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్ది, జామ, నిమ్మ, సీతాఫల్‌, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటుతున్నారు. జిల్లావ్యాప్తంగా 68.71 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 3.45 లక్షల మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయింది.  ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలిస్తే.. డీఆర్‌డీఏ, డీపీవో ఆధ్వర్యంలో 2,13,903 మొక్కలు, అటవీ శాఖ 33,161, ఎక్సైజ్‌ శాఖ 5940, విద్యా శాఖ 6897, విద్యుత్తు శాఖ 500, ఉద్యా న శాఖ 9000, గనుల శాఖ 2800, సంక్షేమ శాఖ 5014, గిరిజన సంక్షేమ శాఖ 1000, నీటి పారుదల శాఖ 150, వ్యవసాయ శాఖ 8480, పోలీస్‌ శాఖ 4400, పరిశ్రమల శాఖ 2000, రోడ్లు, భవనాల శాఖ 200, మార్కెటింగ్‌ శాఖ 1100, పౌరసరఫరాల శాఖ 530, పశుసంవర్ధక శాఖ 1966, తాండూరు మున్సిపాలిటీ 1650, వికారాబాద్‌ మున్సిపాలిటీ 1325, కొడంగల్‌ మున్సిపాలిటీ 850, పరిగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 1000 మొక్కలను ఇప్పటివరకు నాటడం పూర్తయింది. గ్రామాల్లో జామ, కరివేపాకు, దానిమ్మ, పప్పాయ, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు పలు  మొక్కలు నాటనున్నారు. 

ప్రతి మొక్కను బతికించేందుకు చర్యలు 

- డీఎఫ్‌వో వేణుమాధవ్‌

జిల్లాలో హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగు చర్యలు చేపట్టాం. నాటిన వెంటనే ప్ర తి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటుతాం. ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములు అవుతున్నారు.  


logo