గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 29, 2020 , 00:15:23

వర్షం దండిగా.. చెరువులు నిండుగా..

వర్షం దండిగా.. చెరువులు నిండుగా..

  • పలు మండలాల్లో    కురిసిన భారీ వర్షం
  • పొంగిపొర్లిన వాగులు
  • నిండిన చెరువులు, కుంటలు 
  • పెరగనున్న భూగర్భజలాలు 
  • పంటలకు జీవం
  • అన్నదాతల్లో ఆనందం

నందిగామ: మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల చెరువుల్లోకి వరద నీరు చేరింది. చంద్రయాన్‌గూడ వద్ద జరుగుతున్న రైల్వే డబుల్‌ లేన్‌ రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మండల కేంద్రంలోని అంబపురం చెరువుకు వరద వచ్చే కాలువను పూర్తిగా పూడ్చివేశారు. దీంతో అంబపురం చెరువు కాల్వ తెగిపోయి వరద నీరు వృథాగా పోతున్నది. దీంతో సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కాల్వ మరమ్మతులు చేయించారు. దీంతో అంబపురం చెరువులోకి వరద నీరు చేరింది. 

కడ్తాల్‌లో..

కడ్తాల్‌ మండల కేంద్రంతోపాటు పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మండలవ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు వర్షం కురువడంతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు సగం వరకు నిండాయి. రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో కాలనీలు జలమయమయ్యాయి. మండలంలో కొత్తిమీర, బీరకాయ, టమాట తోటలు దెబ్బతిన్నాయి. 

కొడంగల్‌

కొడంగల్‌లో ఆదివారం తెల్లవారుజామున  మోస్తరు వర్షం  కురిసింది. సుమారుగా 34.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. 

దోమ

మండల పరిధిలోని దోమ, లింగనపల్లి, రాకొండ, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో వర్షం పడింది. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు విత్తుకునేందుకు సమాయత్తమవుతున్నారు.

దౌల్తాబాద్‌

దౌల్తాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. దేవర్‌ఫస్లవాద్‌, గోకఫస్లవాద్‌, తిమ్మారెడ్డిపల్లి, పొల్కంపల్లి, నాగసార్‌, సుల్తాన్‌పూర్‌, బాలంపేట, అల్లపూర్‌, అంతారం, గుండేపల్లి తదితర గ్రామాల్లో వర్షం పడింది. దీంతో  ఆయా గ్రామాల్లోని చిన్నచిన్న కుంటలు పూర్తిగా నీటితో నిండాయి.


logo